breaking news
Restitution
-
ఇంటర్నెట్ సేవలపై కొనసాగుతున్న ఆంక్షలు...!
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్ సేవలు (షట్‌డౌన్) నిలిపివేయడం వంటివి చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శాంతి, భద్రతల పరిస్థితి క్షీణించే పరిస్థితులు, ఏవైనా ఘర్షణాత్మక పరిణామాలు చోటు చేసుకున్నపుడు ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకుని వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేగంగా వదంతులు వ్యాపించే అవకాశమున్నందున దీనిపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. 2012 నుంచి ఇప్పటివరకు 161 సందర్భాల్లో ఈ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు ఢిల్లీకి చెందిన లాభాపేక్ష లేని ‘సాఫ్ట్వేర్ ఫ్రీడం లా సెంటర్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అందులో అధిక శాతం గత రెండున్నరేళ్లలోపు జరిగినవే. 2016లో 31, 2017లో 70, ఈ ఏడాది ఇప్పటివరకు 32 సందర్భాలున్నాయి. అయితే భారత్‌లో ఎక్కువస్థాయిలో నియంత్రణ విధించడాన్ని మానవహక్కుల సంఘాలు, పత్రికా స్వేచ్ఛ సంస్థలు తప్పుబడుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘనతో పాటు పత్రికాస్వేచ్ఛకు భంగం వంటి కారణాల వల్ల ఇలాంటివి సరికాదని వాదిస్తున్నాయి. గత 15 రోజుల్లోనే ఆరు రాష్ట్రాల్లో... మరీ ముఖ్యంగా గత రెండువారాల్లోనే ఆరురాష్ట్రాల్లో ఈ షట్‌డౌన్ చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ , పశ్చిమబెంగాల్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ప్రధానంగా శాంతి,భద్రతల పరిరక్షణలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే మధ్యప్రదేశ్, పంజాబ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం 2017లో నిర్దేశించిన నియమ,నిబంధనల ప్రక్రియను పాటించాయి. బెంగాల్లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా, కశ్మీర్లో మిలిటెంట్లపై భద్రతాదళాలు జరిపిన భారీ ఆపరేషన్ సందర్భంగా, ఎస్సీ,ఎస్టీల అత్యాచారాల నిరోధకచట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో దళితసంఘాల భారత్‌బంద్ సందర్భంగా ఇవి చోటుచేసుకున్నాయి. ప్రాథమిక నిషేదాజ్ఞలు, ప్రజల కదలికలపై నియంత్రణలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినపుడు ఇంటర్నెట్‌సేవలు ఆపివేయడాన్ని ఒక ప్రామాణిక ప్రక్రియగా కొనసాగుతోంది. పుకార్లు, వదంతులు త్వరగా వ్యాపించేందుకు తరచుగా ఇంటర్నెట్ను ఉపయోగించడం, దాని ద్వారా హింస, అల్లర్లు రెచ్చగొట్టే అవకాశం ఏర్పడుతోందని స్థానిక అధికార యంత్రాంగం వాదిస్తోంది. అందువల్లే పరిమిత కాలానికి తాత్కాలికంగా ఈ సర్వీసును నిలిపివేయాల్సి వస్తోందని చెబుతోంది. దీని ద్వారా శాంతి,భద్రతల పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు వీలు కలుగుతోందని వాదిస్తోంది. కొత్త నిబంధనలు... ప్రస్తుతం వివిధ పనులు, అవసరాల కోసం విస్తృతంగా ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్నందున ఇలాంటి నియంత్రణలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ప్రజా భద్రతకు భంగం, అత్యవసర పరిస్థితి వంటిది ఏర్పడినపుడు తాత్కాలికంగా టెలికం సర్వీసులు సస్పెండ్ చేసేందుకు పాటించాల్సిన ప్రక్రియను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ప్రకటించింది. 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలో భాగంగా ‘టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సెఫిటీ)రూల్స్,2017గా ఈ నిబంధనలు ఖరారు చేసింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే పక్షంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారాలు కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి (కేంద్ర/ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతితో) జారీచేయవచ్చు. అయితే ఈ నిబంధనల పట్ల కూడా కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా బెంగాల్‌లోని పశ్చిమ వర్థమాన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్రాండ్ సర్వీసులు (స్థానిక కేబుల్ టీవీ వార్తా ప్రసారాలు సహా) రెండున్నర రోజుల పాటు నిలిపివేశారు. జిల్లా మేజిస్ట్రేట్‌కు సెక్షన్–144 కింద ఉన్న అపరిమిత అధికారాలను దీనికి ఉపయోగించారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు కూడా దేశంలోని ఇంటర్నెట్ సేవల నిలుపుదల ఉత్తర్వులు ఎక్కువగా ఇదే తరహాలో ఇస్తూ వచ్చారు. నూతన నిబంధనలు వచ్చాక కూడా పాత పద్థతే కొన్ని చోట్ల కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో మాత్రం కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు పాటిస్తూ ఇటీవల ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలుపుదల ఉత్తర్తులిచ్చాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నష్టపరిహారానికి గ్రీన్‌సిగ్నల్
- విద్యుత్‌లైన్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న వారికి శుభవార్త - ‘సాక్షి’ కథనంతో వాస్తవాలు వెలుగులోకి.. యాచారం: విద్యుత్ లైన్ల ఏర్పాటుతో నష్టపోతున్న రైతులకు ట్రాన్స్మిషన్ సంస్థ తగిన నష్టపరిహారాన్ని ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఈ మేరకు జిల్లాలో ట్రాన్స్మిషన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 400 కేవీ విద్యుత్ లైన్ వల్ల భూములు నష్టపోయే రైతుల వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వివిధ మండలాల తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా సూర్యపేట నుంచి జిల్లాలోని శంకర్పల్లి వరకు యాచారం, కందుకూర్, మహేశ్వరం, షాబాద్, చేవేళ్ల మండలాల గూండా టాన్స్‌మిషన్ సంస్థ విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ పనులను ట్రాన్స్మిషన్ అధికారులు ఆరు నెలల కింద యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ప్రారంభించారు. పనుల ప్రారంభంలో ట్రాన్స్మిషన్ అధికారులు రైతులను భయపెట్టి టవర్ల ఏర్పాటుకు నిర్ణయించారు. రైతులు తీవ్ర వ్యతిరేకత చూపగా కేవలం రూ.15 నుంచి రూ. 20 వేల వరకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. కొందరికి రూ. 15 వేల చెక్కులు ఇచ్చి టవర్ల పనులు పూర్తి చేయడం ప్రారంభించారు. రైతుల ఫిర్యాదు మేరకు ‘సాక్షి’ దినపత్రికలో జూన్ 10న ‘ట్రాన్స్మిషన్ మాయ ’ కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలపై కోదండరెడ్డి ట్రాన్స్మిషన్ సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిహారంపై నిలదీశారు. నిబంధనలు కూడా అనువుగా ఉండడం వల్ల జిల్లా కలెక్టర్ ఒక కమిటీని వేసి పరిహారం చెల్లింపు విషయంలో నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుకు సమీపంలో రూ.1000... ఎట్టకేలకు ట్రాన్స్మిషన్ సంస్థ టవర్ల వల్ల భూములు కోల్పోతున్నవారికి నష్టపరిహారం ఇవ్వడానికి ఒప్పుకోవడంపై రెతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. జిల్లాలోని పలు మండలాల్లో ఈ టవర్ల ఏర్పాటు వల్ల 200 మందికి పైగా రైతులు నష్టపోయారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రాన్స్మిషన్ అధికారులు, రైతుల కమిటీ నాయకులు రెండు పద్ధతుల్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. రోడ్డు సమీపంలో, ఇండ్ల దగ్గర ఏర్పాటు చేసే టవర్లకు గజానికి రూ. 1000 చొప్పున, అదే కొద్ది దూరంలో ఏర్పాటు చేసే టవర్లకు గజానికి రూ.750 చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. పంటలు, ఇతరత్రా నష్టపోయిన వాటికి కూడా తగిన పరిహారం ఇచ్చే విధంగా ఉత్తర్వులో పొందుపర్చారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆయా మండలాల తహసీల్దార్లు సర్వే చేసి ట్రాన్స్మిషన్ అధికారులకు నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు చెక్కుల రూపేణా పరిహారం అందనుంది. నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తే ఒక్కో రైతుకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పైగా అందనుంది. గురువారం ట్రాన్స్మిషన్ అధికారులు మొండిగౌరెల్లిలో పర్యటించి పరిహారం ఇచ్చే నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇదే విషయమై ట్రాన్స్మిషన్ ఎస్ఈ వెంకటనారాయణను సంప్రదించగా తహసీల్దార్లు నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు పరిహారం అందజేస్తామన్నారు. ‘సాక్షి’ కృషి వల్లే.. సాక్షి పత్రికలో కథనం వచ్చేవరకు మాకు ప్రభుత్వమే విద్యుత్ టవర్లు వేయిస్తోందని అనుకున్నాం. తర్వాత తెలిసింది, మమ్మల్ని భయపెట్టి ట్రాన్స్మిషన్ అధికారులు టవర్లు వేస్తున్నారని. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాన్ని తీసుకోని పలు రాజకీయ పక్షాల నాయకులకు ఫిర్యాదు చేశాం. కలెక్టర్‌ను పలుమార్లు కలిశాం. మొదట్లో రైతులు కేవలం రూ. 15 వేలు కూడా తీసుకున్నారు. ‘సాక్షి’ కృషి వల్ల నేడు రూ. లక్షల్లో పరిహారం అందుతుండడం సంతోషంగా ఉంది. - దేవరకొండ సత్తయ్య, రైతు, మొండిగౌరెల్లి