breaking news
Rajya Sabha Deputy Chairman PJ Kurien
-
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రేసులో బీజేపీ
భువనేశ్వర్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించుతుందని పార్టీ సీనియర్ నేత ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నందున వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ ఎన్నిక జరుగనుంది. ‘బీజేపీ తరఫున అభ్యర్థిని పోటీలో ఉంచుతాం. ముందుగా ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తాం. అవసరమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. ఆ పదవిని ఆశించే వారిలో ముఖ్యంగా బీజేడీ నేత ప్రసన్న ఆచార్య, తృణమూల్ నేత సుఖేందు శేఖర్ ఉన్నట్లు మీడియా వర్గాల సమాచారం. బీజేపీని దూరంగా ఉంచేందుకు బీజేడీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వెలువడ్డాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యేందుకు 122 ఓట్లు అవసరం ఉంటుంది. రాజ్యసభలో బీజేపీకి 67 మంది సభ్యులు, కాంగ్రెస్కు 51 మంది, బీజేడీకి 9 మంది సభ్యుల బలముంది. -
నిష్పాక్షికంగా నడుపుతున్నా!
* నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నా * రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వివరణ న్యూఢిల్లీ: సభను నిర్వహిస్తున్న తీరును సోమవారం మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించడంతో నిబంధనల ప్రకారం, నిష్పాక్షికంగా సభాకార్యక్రమాలను నిర్వహిస్తున్నానని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్ స్థానానికి ఎలాంటి పక్షపాతం ఉండదన్నారు. ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించకుండా.. కొందరికే మాట్లాడే అవకాశమిస్తున్నారని కొంతమంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఏ మంత్రి అయినా ఏ విషయంపైనైనా ప్రకటన చేసేందుకు నోటీసు ఇస్తే.. ఆ మంత్రికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నానన్నారు. ‘ప్రతీరోజు సభాకార్యక్రమాలకు సంబంధించిన కాగితాలు టేబుల్ పైకి రాగానే.. నిబంధన 267 కింద వచ్చిన నోటీసులపై స్పందించాల్సి ఉంటుంది. ఆ నోటీసు ఇచ్చిన సభ్యుడిని మాట్లాడించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీరోజూ లలిత్ మోదీ, వ్యాపమ్ అంశాలను లేవనెత్తుతూ, సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న సభ్యులు సోమవారం గులాం నబీ ఆజాద్(కాంగ్రెస్), కేసీ త్యాగి(జేడీయూ) మాట్లాడుతున్నప్పుడు నినాదాలు ఆపేసి, వారు ప్రసంగించేందుకు అవకాశం కల్పించారు. అదే అధికార పక్ష సభ్యులు మాట్లాడేందుకు లేవగానే, నినాదాలతో వారి ప్రసంగాలను అడ్డుకున్నారు. కాగా, పార్లమెంటులో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సాధ్వి ప్రాచీకి రాజ్యసభ సెక్రటేరియట్ లేఖ పంపింది.