breaking news
Rajendranagar constituency
-
కాల్వను మింగేసిన కబ్జాదారులు
సాక్షి, రాజేంద్రనగర్: నదిపై వంతెన, రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే లక్షలాది రూపాయలు, సంవత్సరం పాటు సమయం పడుతుంది. అదే కబ్జాదారులకు ఆ పని అప్పగిస్తే రాత్రికి రాత్రే రోడ్డును పూర్తి చేస్తారు. ఇది మాటల్లో కాదూ చేతల్లో చేసి చూపించారు కబ్జారాయుళ్లు... వివరాల్లోకి వెళితే.. హిమాయత్‌సాగర్ జలాశయం నుంచి వచ్చే వరద నీటిని కిస్మత్ఫూర్, బండ్లగూడ మీదుగా సంఘం వద్ద మూసీ నదిలోకి కలిసేలా గతంలో 220 అడుగుల కాల్వను ఏర్పాటు చేశారు. దీనికి ఈసీ నదిగా పేరు పెట్టారు. మూసీ పేరుతోనే ఈ కాల్వ ప్రస్తుతం కొనసాగుతుంది. బండ్లగూడ పీఅండ్‌టీ కాలనీ నుంచి జనచైతన్య వెంచర్‌కు మధ్యన మూసీ నది అడ్డుగా ఉంది. ఈ రెండు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో స్థానికంగా స్థలాలకు విపరీతమైన ధర పలుకుతోంది. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కొందరు మట్టిపోసి రోడ్డును ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా మరికొందరు భారీ వాహనాలు వెళ్లేలా మట్టిని పోసి రోడ్డును తయారు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు గుండా లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు సులువుగా వెళ్తున్నాయి. ఇదే అదునుగా కొందరు కబ్జాదారులు మూసిలో సైతం మట్టిపోసి ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు సైతం సాగుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
రాజేంద్రనగర్‌లో బహుముఖ పోరు
రాజేంద్రనగర్: ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. అంతకు ముందు చేవెళ్ల నియోజకవర్గంలో కొనసాగుతుండేది. గత రెండు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 26 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీఆర్ఎస్, మజ్లిస్, మహాకూటమి, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ హైట్రిక్ కోసం కష్టపడుతున్నారు. మజ్లిస్ ఓ వర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయనే ధీమాతో ఉంది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసద్ నేరుగా ప్రచారంలో పాల్గొంటూ తమ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ విజయంపై ధీమాతో ఉన్నారు. మజ్లిస్‌ను ఓడించే సత్తా తనకే ఉందంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక, మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న గణేష్‌గుప్తాకు కాంగ్రెస్ కేడర్ సహకరిస్తుండడంతో విజయం తనదే అంటున్నారు. గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఈసారి తనకే అవకాశం ఉందని చెబుతున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారు. మొత్తం ఓటర్లు 4,40,863 రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 4,40,863 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,07,752 మంది మహిళలు, 2,33,039 మంది పురుషులు, ఇతరరులు 76 మంది ఉన్నారు. బరిలో 26 మంది.. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి టి.ప్రకాష్‌గౌడ్, బీజేపీ తరఫున బద్దం బాల్‌రెడ్డి, మహాకూటమి(టీడీపీ) నుంచి గణేష్‌గుప్తా, మజ్లిస్ తరఫున మిర్జా రహమత్‌బేగ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తోకల శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అభివృద్ధే నినాదం.. తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందంటూ చెబుతున్నారు. ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 42 వేల మంది వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారని, వారంతా తన వెంటే ఉన్నారని అంటున్నారు. లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమనే ధీమాతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. మజ్లిస్‌ను తరిమికొడతానంటున్న బాల్‌రెడ్డి.. మజ్లిస్‌ను ఢీకొనే సత్తా బీజేపీకే ఉందని, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆ పార్టీ పాగాను అడ్డుకునేందుకు తాను బరిలోకి దిగానని కమలం అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి చెబుతున్నారు. తాను పోటీ చేస్తుండడంతో మజ్లిస్, టీఆర్ఎస్లు ఏకమై ఓ వర్గం ఓట్లను చీల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్ర పథకాలపై ఆయన క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. అభివృద్ధి చేస్తానంటున్న గణేష్‌గుప్తా.. తాజా మాజీ ఎమ్మెల్యే తొమ్మిదేళ్లు అభివృద్ధిని విస్మరించారని మహాకూటమి అభ్యర్థి ప్రకాష్‌గౌడ్ విమర్శన అస్త్రాలు సంధిస్తూ ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తాను చూపిస్తానంటూ వెల్లడిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా మారుస్తానని అంటున్నారు. మహాకూటమిలోని ఇతర పార్టీల కేడర్ తోడవ్వడంతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. మైనార్టీ ఓట్లపై ఆశలు... మైనార్టీ ఓట్లపై ఆధారపడిన మజ్లిస్ అభ్యర్థి మిర్జా రహమత్‌బేగ్.. పూర్తి ప్రచార బాధ్యతను ఎంఐఎం అధ్యక్షుడు అసద్‌పై ఉంచారు. గతంలో ఎన్నడు లేని విధంగా అసదుద్దీన్ నిత్యం సభలు నిర్వహిస్తూ మైనార్టీ ఓట్లు చీలకుండా వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లే ఎక్కువ ఉండడంతో అవి గంపగుత్తగా తమ పార్టీకే పడతాయని, దీంతో విజయం ఖాయమని పార్టీ అభ్యర్థి అంటున్నారు. -
నిధులిస్తే.. పార్టీ మారుతా: ప్రకాశ్‌గౌడ్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు నిధులు విడుదల చేస్తే పార్టీ మారేందుకు సిద్ధమని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రకటించారు. మూడు నెలల క్రితం ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇదే చెప్పానని, వారం క్రితం ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టం చేశానని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రంగారెడ్డి జిల్లా పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ఎద్దడి నివారణ పనుల పూర్తికి రూ.314 కోట్లు అవసరమని, వాటిని మంజూరు చేసిన మరుక్షణమే టీడీపీని వీడి గులాబీ గూటికి చేరుతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
అడిగినవి ఇస్తే టీఆర్ఎస్లోకి వస్తా
*రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మణికొండ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 350 కోట్ల నిధులతో పాటు ఇంటింటికీ మంజీరా నీటిని సరఫరా చేస్తే తాను తప్పకుండా టీఆర్ఎస్లో చేరతానని టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ స్పష్టం చేశారు. గండిపేట్‌లో ఆదివారం ఆయన కైట్‌ఫెస్టివల్‌ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మూడునెలల క్రితం తనను సీఎం పిలిచినపుడే తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను తెలిపానని, అవి చేపడితే తప్పకుండా పార్టీలో చేరతానని స్పష్టం చేశానన్నారు. మూడు నెలలు గడచినా మంజీరా నీరు, అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి కదలికలేనపుడు తాను పార్టీ మారి ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు డివిజన్లకు రూ. 200 కోట్లు, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలకు రూ. 150 కోట్ల నిధులను అడిగానన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను రెండు సార్లు గెలిపించారని, వారి ప్రయోజనం చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌లు అభివృద్ధి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన కితాబిచ్చారు. అందుకే వారికి ప్రజల్లో మంచిపేరు ఉందన్నారు.