breaking news
Qatar country
-
ఖతర్‌లో కష్టాలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నవారి పరిస్థితులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. జీతం బాగుందనే ఆశతో ఏజెంట్ల మాటలను నమ్మి వెళ్తే దేశం కాని దేశంలో నరకం అనుభవిస్తున్నారు. కొంత మందికి కనీసం తిండికయ్యే ఖర్చంత కూడా వేతనాలు ఇవ్వకుండా అక్కడి కంపెనీలు మోసం చేస్తున్నాయి. ఇదే పరిస్థితిని నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు బాధితులు ఎదుర్కొన్నారు. ఇందులో ఇద్దరు అప్పుచేసి ఖతర్ దేశం నుంచి బయటపడి ఇండియాకు తిరిగి వచ్చారు. ఏ పరిస్థితుల్లో ఖతర్‡ వెళ్లాల్సి వచ్చింది... ఏజెంటు ఏ విధంగా మోసం చేశాడు... వారు పడ్డ కష్టాలను వివరించారు. ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన చెలిమెల పవన్, నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ గౌడ్, మోపాల్ మండలం బాడ్సీ గ్రామానికి చెందిన కొట్టాల రవి. వీరు ముగ్గురితో పాటుగా జగిత్యాల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారితో కలిపి మొత్తం తొమ్మిది మంది ఏజెంట్ చేతిలో మోసపోయారు. కూతురి పెళ్లి చేసేందుకు డబ్బులు కావాలని ఒకరు... ఇక్కడ ఉద్యోగాలు లేక ఖతర్‌లో ఏ పనైనా పర్వాలేదని మరొకరు... ఇల్లు కట్టుకుందామని ఇంకొకరు... ఇలా ఉన్న ఆస్తులను అమ్మేసి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఖతర్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖత్తార్‌లో క్యాబ్ డ్రైవర్‌గా వెళ్తున్న వీరికి వేతనం అధిక మొత్తంలో ఉంటుందని, అక్కడి డ్రైవింగ్ లైసెన్సు కూడా కంపెనీయే భరిస్తుందని ఏజెంట్ చెప్పిన మాయ మాటలకు మోసపోయి ఒక్కొక్కరు రూ.1లక్షా 30వేలు కట్టారు. మెట్‌పల్లికి చెందిన పంజాల శ్రీనివాస్ గౌడ్ అనే ఏజెంటుతో పాటు ముంబాయికి చెందిన మరో ఏజెంటుకు ఈ డబ్బులను మొత్తం చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో ఖతర్ దేశం వెళ్లారు. ఆలిజర హోలోడింగ్ లిమోసిన్ కర్వ టాక్సీ కంపెనీలో డ్రైవర్‌గా చేరారు. ఏజెంటు చెప్పిన విధంగా ఖత్తార్‌లో పని చేసే కంపెనీలో ఒకరోజు ట్యాక్సీ నడిపి 100 రియళ్లు సంపాదిస్తే 30 రియళ్లు వేతనంగా ఇవ్వాలి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. రోజుకు 450 రియళ్లు సంపాదించి ఇస్తేనే 30 శాతం వేతనంగా ఇస్తామని కంపెనీ వాళ్లు టార్గెట్ పెట్టడంతో ఏం చెయ్యాలో అర్థం కాని స్థితికి చేరుకున్నారు. టార్గెట్ చేయలేని పక్షంలో ప్రతినెల 500 రియళ్లు (ఇక్కడి వేతనం రూ.8 వేలు) ఇస్తున్నారని, అప్పు చేసి ఇంత దూరం వస్తే ఇలా జరిగిందేంటని ఆందోళనకు గురయ్యారు. ఆదుకుని అన్నం పెట్టిన పాకిస్తానోళ్లు... ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోగా, వచ్చే వేతనం భోజనానికి కూడా సరిపోని పరిస్థితి. డ్రైవింగ్ లైసెన్సుకు కూడా అప్పు చేసి దాదాపు రూ.1లక్ష వరకు వెచ్చిస్తే తమ పరిస్థితి ఇలా అయిందని కంపెనీ వారితో గొడవ పడినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తిండికి డబ్బులు లేక ఒక్కో రోజు పస్తులు ఉండాల్సి వచ్చిందని, గొడవ పడినందుకు కంపెనీ వాళ్లు వేరే చోటికి పంపించారని తెలిపారు. అక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్లున్నా పట్టించుకోలేదని, పాకిస్తాన్ దేశస్తులు కొందరు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి కొన్ని రోజుల పాటు ఆదుకున్నారని చెప్పారు. ఇలా కెన్యా, బంగ్లాదేశ్ వారు కూడా ఆదుకున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన చెలిమెల పవన్, నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ గౌడ్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి డబ్బులు తెప్పించుకుని ఖతర్ నుంచి ఆగస్టు నెలలో స్వదేశానికి చేరుకున్నారు. మిగతా కరీంనగర్, జగిత్యాల్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బాధితులు డబ్బులు లేక అక్కడే చిక్కుకుపోయారు. ప్రజాప్రతినిధులకు ట్వీట్ చేసినా స్పందించలేదు.. ఏజెంటు చేతిలో మోస పోయి ఖత్తార్‌లో అష్టకష్టాలు పడ్డ ఈ ఇద్దరు నిజామాబాద్ వాసులు రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం అక్కడి నుంచే ప్రయత్నాలు చేశారు. వచ్చే వేతనం తిండికి కూడా సరిపోవడం లేదని, తమను ఇండియాకు రప్పించి మోసం చేసిన ఏజెంటుపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకు మెసేజ్ పెట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదన్నారు. పరాయి దేశం పంపుతానని పరారయ్యాడు! –గల్ఫ్ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుల వేడుకోలు డిచ్పల్లి: విదేశాలకు పంపిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు, పాస్‌పోర్టు తీసుకొని పరారైన కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ నాడెం నర్సయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన బాధితులు పందెన శ్రీనివాస్, బాలయ్య, పందెన చిన్న గంగాధర్ శుక్రవారం ఎస్ఐ రాజశేఖర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ గల్ఫ్ దేశం ఇరాక్‌కు పంపిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరికి రూ.లక్షా 50వేలు ఖర్చు అవుతుందని అడ్వాన్సుగా రూ.65వేల చొప్పున తీసుకుని పరారయ్యాడన్నారు. నెల రోజులుగా వీసా వస్తుందని మాయ మాటలు చెబుతూ వచ్చాడని వాపోయారు. చివరకు గట్టిగా నిలదీసి తమ డబ్బులు, పాసుపోర్టు ఇవ్వాలని అడిగితే పరారయ్యాడని తెలిపారు. తామే కాకుండా ధర్పల్లి మండలానికి చెందిన మరికొందరిని కూడా మోసగించినట్లు తెలిపారు. సదరు ఏజెంట్‌పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఫిర్యాదు ప్రతులను చూపుతున్న బాధితులు కుటుంబాల పరిస్థితి తలచుకుంటే భయంగా ఉంది : బాధితులు చేసిన వ్యాపారాలు కలిసి రాకపోవడంతో వేరే మార్గం లేక ఖతర్ దేశానికి వెళ్లినం. దేశం వెళ్తే అయినా తమ కుటుంబాలు బాగుపడుతాయని బంగారాం, భూములు అమ్మేసి ఏ జెంటుకు కట్టినం. ఖతర్‌లో ఇచ్చే జీతం తినే తిండికి కూడా సరిపోలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో వేరే దేశస్తులు అన్నం పెట్టి ఆశ్రయమిచ్చిండ్రు. అప్పు చేసి ఇంటికి వచ్చినం. ఇప్పుడు కుటుంబాల పరిస్థితి చూస్తే భయం గా ఉంది. గల్ఫ్ ఏజెంటుపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. -
వంచించి.. హింసించి.. కడతేర్చారు
ఉండి :పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపనతో ఉపాధి కోసం ఖతార్ దేశానికి వెళ్లిన ఉండి గ్రామానికి చెందిన షేక్ నూర్జహాన్ (45) అక్కడి ఏజెంట్ల అకృత్యానికి బలైంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయూలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నూర్జహాన్ తండ్రి కరీంసాహెబ్, ఆమె పెద్ద అల్లుడు షేక్ బాబ్జీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి గ్రామానికి చెందిన కరీంసాహెబ్ పెద్ద కుమార్తె అయిన షేక్ నూర్జహాన్ (45)ను భీమడోలు మండలం పాతూరుకు చెందిన షేక్ వెంకన్న సాహెబ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధి నిమిత్తం ఆమె గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకుని ఉండి గోరింతోటలో నివాసం ఉంటున్న కొల్లి పద్మ అనే ఏజెంట్‌ను సంప్రదించింది. ఆమె ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఖతార్ దేశానికి వెళ్లారు. అరుుతే ఏజెంట్ కొల్లి పద్మ నూర్జహాన్ను విజిటింగ్ విసాపై ఖతార్ పంపింది. ఈ విషయం తెలియని నూర్జహాన్ ఖతార్‌లో అడుగుపెట్టేసరికి అక్కడి ఏజెంట్లు ఆలీ, లక్ష్మి అనే వారు ఆమెను తీసుకెళ్లి ఓ వ్యభిచార గృహానికి రూ.10 లక్షలకు అమ్మేశారు. అనేక కష్టాలను అనుభవించిన నూర్జహాన్ మే 19న తన పెద్ద అల్లుడు షేక్ బాబ్జీకి ఫోన్ చేసి తనను మోసం చేసిన విషయూన్ని వివరించింది. వ్యభిచారం చేయూలంటూ హింసిస్తున్నారని, ఒప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, తనను ఏదోలా స్వదేశానికి తీసుకెళ్లాలని ప్రాధేయపడింది. పది లక్షలు డబ్బులు చెల్లించి మే 23లోగా తీసుకెళ్లకపోతే చంపేస్తామని చెప్పారని నూర్జహాన్ చెప్పినట్టు షేక్ బాబ్జీ తెలిపారు. నూర్జహాన్ను ఖతార్ పంపించిన ఏజెంట్ కొల్లి పద్మను తాము నిలదీయగా అక్కడ అంతా బాగానే ఉందని, నూర్జహాన్ పని చేసుకుంటుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని పద్మ చెప్పిందని కరీంసాహెబ్, బాబ్జీ తెలిపారు. ఈ విషయంపై నూర్జహాన్ భర్త షేక్ వెంకన్న సాహెబ్ ఉండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి తన భార్యను స్వదేశానికి రప్పించాలని కోరారని, అరుునా వారు పట్టించుకోలేదని వారు తెలిపారు. చేసేది లేక ఖతార్‌లో ఉన్న బంధువుల ద్వారా ఇండియన్ ఎంబసీ ఫోన్ నంబర్ సంపాదించి వారికి ఫోన్ చేయగా అక్కడి అధికారులు మరొక ఫోన్ నంబర్ ఇచ్చి వారిని సంప్రదించాలని సూచించారని వారు తెలిపారు. అక్కడికి ఫోన్ చేసి వివరాలు తెలపగా నూర్జహాన్ అనే మహిళ మృతదేహం రెండు రోజుల క్రితం ఖతార్‌లో చంపి రోడ్డుపై పడేశారని, మృతదేహం లభ్యమైందని వారు తెలిపినట్టు కరీంసాహెబ్, షేక్ బాబ్జీ తెలిపారు. పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నూర్జహాన్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు ఉండి పోలీస్‌స్టేషన్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. పోలీసులకు ముందుగానే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే నూర్జహాన్ మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూర్జహాన్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. న్యాయం చేయాలంటూ సెల్ టవరెక్కిన నూర్జహాన్ బంధువు తమకు న్యాయం చేయాలంటూ నూర్జహాన్ బంధువు షేక్ మస్తాన్ ఉండిలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలోని సెల్ టవరెక్కాడు. నూర్జహాన్ మరణానికి కారకులైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసిన ఆయన న్యాయం అందదని భావించి సెల్ టవరెక్కి పోలీసుల్లో వణుకు పుట్టించారు. పోలీసులు వచ్చి నూర్జహాన్ మృతికి కారణమైన ఏజెంట్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని, ఆమె మృతదేహాన్ని త్వరలోనే రప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు టవర్‌పై నుంచి దిగొచ్చాడు.