breaking news
PV narasimha rao express way
-
Hyderabad: పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై టూ వీలర్ ప్రవేశానికి చెక్..
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు వ్యతిరేకంగా పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే పై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించకుండా ఉండేందుకు హెచ్ఎండీఏతో కలిసి తగు చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. సరోజినీదేవి ఆసుపత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 11 కిలో మీటర్ల మేర నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కేవలం కార్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ద్విచక్ర వాహనాదారులు, భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. కానీ కొందరు ద్విచక్ర వాహనాదారులు ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. ► గతంలో ఈ వంతెనపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు సైతం జరిగాయన్నారు. ►ఈ నేపథ్యంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ద్విచక్ర వాహనదారుల ప్రవేశాన్ని అరికట్టేందుకు హెచ్ఎండీఏతో పలుమార్లు సంప్రదింపులు జరిపి తగు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ►ఎక్స్‌ప్రెస్‌వే వంతెనపై ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ► ఈ నెల చివరి నాటికి ఈ పనులు పూర్తి అవుతాయన్నారు. సీసీ కెమెరాల ద్వారా వాహనాదారులను గుర్తించి అపరాధ రుసుం వేస్తామన్నారు. ►సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు పోలీస్‌స్టేషన్‌లోనే తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫ్లై ఓవర్ ర్యాంపుల వద్ద సీసీ కెమెరా వాహనాన్ని గుర్తించి అపరాధ రుసుం విధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. -
పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదం
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని మెహదీపట్నం పీవీ నర్సింహా రావు ఎక్స్‌ప్రెస్ వే పై చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి నగరంలోకి వస్తున్న కారు పిల్లర్ నంబర్ 84 వద్దకు చేరుకోగానే అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.