breaking news
projects redesign
-
ప్రాజెక్టుల రీడిజైన్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
-
కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు రీ డిజైన్లు
► 2013 చట్టమే రైతులకు శ్రీరామరక్ష ► మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్‌నగర్: ‘పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే సోయి లేని ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకునేందుకు దళారీగా మారి భూ దోపిడీకి పాల్పడుతోంద’ని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని పాలమూరు ఎత్తిపోతల పథకం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసిత రైతాంగంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద రైతుల జీవితాలను కాపాడాలన్న సంకల్పంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టి నిరంకుశ ముఖ్యమంత్రి నాలుగు గోడల మధ్య నాలుగు పేజీల జీఓ నం. 123ని తీసుకువచ్చారని విమర్శించారు. రాజ్యాంగ రక్షకుడే భక్షకుడిగా మారి పేద రైతుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల రీడిజైన్ చేసి రూ.వేల కోట్లలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి కుట్రపన్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండి 2013 భూ సేకరణ ప్రకారం పేద రైతులకు పరిహారం వచ్చే వరకు వారి ముందుండి పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ల పేరుతో ప్రాజెక్టుల వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులను పెడుతున్న ఇబ్బందులు చూస్తే నాటి రజాకార్ల జమానా గుర్తుకు వస్తుందని చెప్పారు. తరతరాలుగా నమ్ముకున్న భూమిని సాదా కాగితాలపై సంతకాలు తీసుకొని పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, భూములు పోతాయన్న బాధతో గిరిజన, హరిజన రైతాంగం గుండెపోటుతో మృతి చెందిన ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు పేదల రైతుల నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు పూనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కర్వెన సభలో ఎత్తిపోతల పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి మొదటి నెల జీతం ఇచ్చాకే పనులు ప్రారంభిస్తామని రైతులను బెదిరించే కార్యక్రమానికి పూనుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు అద్దంకి దయాకర్, పవన్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, జెడ్పీటీసీలు సుధాపరిమళ, మణెమ్మ, నాయకులు బాలరాజుగౌడ్, మాన్యనాయక్, సంపత్‌రెడ్డి, రైతులు లక్ష్మణ్, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి డెల్టాలో రబీ ప్రశ్నార్థకమే!
- రీడిజైన్ పేరుతో గోదావరిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ - రోజుకు సగటున 68,132 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ప్రణాళిక - డెల్టాలో ఖరీఫ్ చివరి దశలో నీటికి కటకటే.. ఇక రబీ సాగు ప్రశ్నార్థకమే సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైన్ పూర్తయితే.. డెల్టాలో రబీ సాగు ప్రశ్నార్థకమవుతుందని సాగునీటి నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. రబీ పంట వరి సాగు చేయకపోతే భూగర్భ జలమట్టం తగ్గుతుందని.. ఉప్పు నీళ్లు పైకి ఉబికి రావడం వల్ల డెల్టా మొత్తం ఉప్పునీటి కయ్యలుగా రూపాంతరం చెంది, బంజరుగా మారడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నా సీఎం చంద్రబాబునాయుడు నోరుమెదపడం లేదు. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడుతున్నారు. - మహారాష్ట్రలో గోదావరి పురుడు పోసుకునే నాసిక్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ నిర్మించిన 18 ప్రాజెక్టులు నిండాలంటే 174 టీఎంసీలు అవసరం. తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లిలు నిండాలంటే మరో 110 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్లు నిండాలంటే 35 టీఎంసీల నీళ్లు అవసరం. - తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్ల నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజుకు 33,600 క్యూసెక్కులు, ఆ తర్వాత దేవాదుల ద్వారా 11,200 క్యూసెక్కులు, తుపాకులగూడెం ద్వారా 18,666 క్యూసెక్కులు, సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా 4,666 క్యూసెక్కులు వెరసి 68,132 క్యూసెక్కుల నీటిని తెలంగాణ వాడుకోనుంది. - గోదావరి నది పరీవాహక ప్రాంతంలో జూన్‌లో కురిసిన వర్షాలకు ప్రస్తుతం వరద నీళ్లు రాష్ట్రానికి చేరుతున్నాయి. కానీ.. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే వరద నీళ్లు రాష్ట్రానికి చేరడం కనీసం నెల ఆలస్యమవుతుంది. గోదావరి డెల్టాలో జూన్ నుంచి నవంబర్ 15 వరకూ ఖరీఫ్, డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ వరకూ రబీ పంటలను సాగు చేస్తారు. - జూన్ నుంచి అక్టోబరు వరకూ సగటున 60 రోజులపాటూ గోదావరికి భారీ ఎత్తున వరద వస్తుంది. అక్టోబరు తర్వాత ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల ద్వారా గోదావరిలోకి వచ్చే నీళ్లే డెల్టాకు ఆధారం. 2015, అక్టోబరు నుంచి 2016, ఏప్రిల్ వరకూ సీలేరు, బలిమెల రిజర్వాయర్లలో జల విద్యుదుత్పత్తి చేసి విడుదల చేసిన వాటితో కలిపి ధవళేశ్వరం బ్యారేజీకి సగటున ఏడు వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం రాలేదు. - ఒక్క గోదావరి డెల్టాకే రబీలో కనీసం 16 వేల క్యూసెక్కుల నీళ్లు అవసరం. పుష్కర, చాగల్నాడు, వెంకటనగరం, తాడిపూడి, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు మరో 20 వేల క్యూసెక్కులు అవసరం. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. అక్టోబరు తర్వాత గోదావరి నుంచి చుక్క నీరు కూడా రాష్ట్రానికి చేరదు. అప్పుడు శబరి, సీలేరుల నీళ్లే ఆధారం. సీలేరు, శబరిల ద్వారా ఏడు వేల క్యూసెక్కులకు మించి లభించవు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే డెల్టాలో రబీ సాగు అసాధ్యమని సాగునీటి నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. - 194.6 టీఎంసీల నిల్వ.. 301 టీఎంసీలు వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తే ఇబ్బందులను అధిగమించవచ్చు. కానీ.. చంద్రబాబు కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టి పోలవరం ప్రాజెక్టును నీరుగార్చారు. ఇప్పుడు తెలంగాణ అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా నోరుమెదపడం లేదు. - జూన్ 1, 2015 నుంచి నవంబర్ 30, 2015 వరకూ ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా 1609 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు. పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే.. ఇందులో కనీసం 301 టీఎంసీలను వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రజల తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండేవి కాదు. -
ప్రతిపక్షాలపై మంత్రి తీవ్ర మండిపాటు
హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైన్ పై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని రాష్ట్రమంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైన్ అంశంపై వస్తున్న విమర్శలపై ఆదివారం రాత్రి ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ... అఖిలపక్ష సమావేశాలు పెట్టి పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీపడిందని ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాకు తెలంగాణ ప్రజల హక్కులే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హరీష్ రావు సూచించారు.