పాడి రైతులకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వ్యవసాయ రంగానికిస్తున్నట్లే పాడి రైతులకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రోగ్రెసివ్ డెయిరీ ఫార్మర్స్ అసోసియేషన్ (పీడీఎఫ్‌ఏ) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోలాగే రుణాలపై వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వైఎస్ హయాంలో పాడి రైతులకూ కొంత కాలం వడ్డీ సబ్సిడీ లభించిందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలూ దీన్ని కొనసాగించి ఉంటే డెయిరీ రంగానికి ఊరటగా ఉండేదని పీడీఎఫ్‌ఏ తెలంగాణ జనరల్ సెక్రటరీ కె.బాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు డెయిరీ ఫార్మింగ్‌లోకి వస్తున్నారు.
కానీ మార్కెటింగ్, తదితర సమస్యల కారణంగా గడిచిన రెండు మూడేళ్లలో అనేక డెయిరీ ఫామ్‌లు మూతపడ్డాయి. అందుకని 8-9 శాతం మేర వడ్డీ సబ్సిడీని ఇస్తే పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. త్వరలో జరగనున్న డెయిరీ ఎక్స్పో వివరాలు వెల్లడించడానికి బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుతం లీటరుకు రూ. 4 చొప్పున ఇస్తున్న ప్రోత్సాహకాన్ని కూడా మరికాస్త పెంచి, తోడ్పాటు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డెయిరీ సంస్థలు స్థానికంగా సేకరణ జరిపితే నాణ్యమైన పాలను అందించడం సాధ్యపడుతుందని బాల్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో డెయిరీ రంగంలో దాదాపు 2.5 లక్షల మంది పైగా ఉపాధి పొందుతున్నారని, ఒక మోస్తరు పెద్ద స్థాయి ఫారమ్‌లు దాదాపు 350-400 పైచిలుకు ఉన్నాయని బాల్‌రెడ్డి తెలియజేశారు. రాజకీయ నాయకుల డెయిరీ వ్యాపారాల వల్ల సహకార సంఘాల ఆధ్వర్యంలో నడి చే సంస్థలు దెబ్బతిన్నాయని బాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరిన్ని పాల సంస్థలు వస్తూ, ధరల పరమైన పోటీ పెరుగుతూ ఉండటంతో కల్తీ ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.
పాల కల్తీకి పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా నాణ్యతను కాపాడటం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. పాడి రైతులక్కూడా వ్యవసాయ రైతులకు సమానంగా విలువ ఇవ్వాలని పీడీఎఫ్‌ఏ ప్రెసిడెంట్ ఎం.జితేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ధర నిర్ణయంలోనూ పాల ఉత్పత్తిదారులను సంప్రదించాల్సిన అవసరం ఉందన్నారు.
5 నుంచి డెయిరీ షో
ఈ నెల 5 నుంచి 7 దాకా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 4వ డెయిరీ షో జరగనుంది. తెలంగాణ పశు సంవర్ధక శాఖ విభాగం, పీడీఎఫ్‌ఏ, ఏపీడీడీసీఎఫ్‌తో కలిసి యాక్టివ్ ఎగ్జిబిషన్స్ అండ్ కాన్ఫరెన్సెస్ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. కొత్త టెక్నాలజీలు, ట్రెండ్స్ గురించి పాడి రైతుల్లో అవగాహన కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యాక్టివ్ గ్రూప్ డెరైక్టర్ పీఎస్ఎల్ఎన్ రావు చెప్పారు. మేలు జాతి పాడి పశువులు, డెయిరీ రంగానికి అవసరమయ్యే యంత్రాలు, పరికరాలు వంటివి ఇందులో ప్రదర్శనకు ఉంచుతున్నట్లు తెలియజేశారు. 90 మందికి పైగా ఎగ్జిబిటర్స్ ఇందులో పాల్గొంటున్నారన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు డెయిరీ ఫార్మింగ్ మొదలైన వాటిపై అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ఫారమ్‌ల సందర్శన వంటివి ఈ షోలో భాగంగా ఉంటాయని రావు తెలిపారు.