breaking news
primary report
-
అఫ్గానిస్తాన్ పగ్గాలు మళ్లీ ఘనీకే !
కాబూల్: అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుగా అష్రాఫ్ ఘనీ మళ్లీ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదివారం ప్రాథమిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఘనీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. అష్రాఫ్ ఘనీకి 50.64 శాతం ఓట్లు వస్తే, ఆయన ప్రత్యర్థి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లాకు 39.52 శాతం ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ ఎన్నికల కమిషన్ (ఈఏసీ) తుది ఫలితాల్ని మరికొద్ది వారాల్లో ప్రకటించనుంది. ఈలోగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరైనా ఫలితాలపై తమకేమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేసే హక్కు ఉంది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఫలితాల్ని సవాల్ చేస్తామని అబ్దుల్లా ప్రకటించారు. సెప్టెంబర్ 28న అఫ్గానిస్తాన్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 19న ఫలితాల్ని వెల్లడించాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపించడంతో ఫలితాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్నికల పరిశీలకులు, పోటీ చేసిన అభ్యర్థులు ఈఏసీ సక్రమ మైన పనితీరును కనబరచలేదని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే 2001లో తాలిబన్ల పాలన అంతం తర్వాత జరిగిన ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఐక్యరాజ్య సమితి అంటోంది. జర్మనీ సంస్థ పంపిణీ చేసిన బయోమెట్రిక్ యంత్రాలు బాగా పనిచేశాయని పేరొచ్చింది. కానీ, లక్ష ఓట్ల వరకు గల్లంతైనట్టు ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు తాలిబన్లతో అమెరికా జరిపిన చర్చలతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇక వారితో చర్చించడానికేమీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తే, అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల సంఘం అధ్యక్షురాలు హవా అలామ్ నురిస్తానీ తమకు అప్పగించిన బాధ్యతను నీతి, నిజాయితీ , చిత్తశుద్ధితో నిర్వహించామన్నారు. ఫలితాలు పారదర్శకంగా లేవు: అబ్దుల్లా ఎన్నికల ఫలితాలు వెలువడగానే అబ్దుల్లా కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో..‘మాకు ఓటు వేసిన ప్రజలకి, మద్దతుదారులకి, ఎన్నికల సంఘానికి, అంతర్జాతీయ మిత్రులకి మేం ఒకటే చెబుదామనుకుంటున్నాం. ఎన్నికల ఫలితాల్ని మేం అంగీకరించడం లేదు. చట్టపరంగా మేం చేస్తున్న డిమాండ్లు తీర్చాల్సి ఉంది’’అని ఉంది. -
ఫొని ఎఫెక్ట్ : కేంద్రానికి నివేదిక పంపిన ఎల్వీ
సాక్షి, అమరావతి : ఫొని తుపాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపారు. దీనిలో తుపాన్ ప్రభావం వల్ల 2 వేల విద్యుత్ స్థంభాలు, 117 సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి 733 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని నివేదికలో పేర్కొన్నారు. 553 హెక్టార్లలో పంటలు.. 520 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఫొని తుపాన్ వలన ఎలాంటి ప్రాణ నష్టం సంభంవిచలేదని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. -
టేపులు అసలువే.. అతికించలేదు: ఎఫ్ఎస్ఎల్
ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్.. తన ప్రాథమిక నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్య తదితరులు మాట్లాడిన టేపులను ఎఫ్ఎస్ఎల్లో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను ల్యాబ్‌కు పంపారు. ఇందులో ఎలాంటి ఎడిటింగ్ జరగలేదని, అంతా సక్రమంగానే ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికి కేవలం ప్రాథమిక నివేదికను మాత్రమే సమర్పించారు. ఇంకా తుది నివేదికను రూపొందించాల్సి ఉంది. ఇందుకు కనీసం 48 గంటల సమయం పడుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఆడియో టేపులను పోల్చి చూసేందుకు తమకు చంద్రబాబు స్వర నమూనాలు కావాలని కోర్టును ఏసీబీ కోరింది. వీడియో, ఆడియోలను అసలైనవిగానే ఎఫ్ఎస్ఎల్ తేల్చిచెప్పింది. అతికించడం మార్చడం లాంటివి జరగలేదని స్పష్టం చేసింది.