breaking news
The poverty
-
అసలు సంపద
ఒక వ్యక్తి హజ్రత్ జునైద్ బొగ్దాదీ(ర)వద్దకువచ్చి: ‘‘అయ్యా.. నేనొక నిరుపేదను. పేదరికం కారణంగా ఎవరికీ ఏమీ సాయం చేయలేక పోతున్నాను. దీనికి కారణం ఏమిటీ?’ అని ప్రశ్నించాడు. దానికి జునైద్ బొగ్దాదీ, ‘‘నువ్వు దానధర్మాలు చేస్తావా? ఇతరుల పట్ల ఉదారబుద్ధితో వ్యవహరిస్తావా?’’ అని ఎదురు ప్రశ్నించారు. దానికతను చిన్నబుచ్చుకుని‘‘అయ్యా.. నేనే నిరుపేదను. ఆ కారణంగానే ఏమీ చేయలేక పోతున్నానన్నదే నా బాధ. దానధర్మాలు చేయడానికి, ఉదారంగా వ్యవహరించడానికి నా దగ్గరేముందని?’’ అన్నాడా వ్యక్తి.‘‘అదేమిటీ అలా అంటావు? నీ దగ్గర గొప్ప సంపద ఉంది. పరులతో పంచుకోగల నిధులున్నాయి నీ దగ్గర’ అన్నారు బొగ్దాదీ. ఆ వ్యక్తి ‘‘అయ్యా.. నేను చాలా చిన్నవాణ్ణి. నన్ను ఆట పట్టించకండి.’’ అన్నాడు.‘‘అయ్యయ్యో..! ఆట పట్టించడం కాదు. ఇది నిజం. నేను చెబుతా విను.’’ అంటూ..‘‘నీ దగ్గర ఉన్న గొప్ప సంపద నీ ముఖారవిందం. ఎంత పేదరికమైనా, ఎన్ని కష్టాలొచ్చినా ముఖంపై చిరునవ్వును చెదరనీయకు. ఇతరులను చిరునవ్వుతో పలకరించడం ఆరాధనతో సమానం అన్నారు మన ప్రవక్త. దీనికోసం ధనం అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.రెండవది కళ్ళు. ఇవి లక్షలాదిమందిని ప్రభావితం చేస్తాయి.ఆ కళ్ళతో ఒక్కసారి అమ్మ వైపు ప్రేమతో చూస్తే ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది.’మూడవది నోరు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ధనం లేకపోయినా పరవాలేదు. నోరు బాగుంటే చాలు. అంతేకాదు, నోటితో ఇతరులకు మంచిని బోధించవచ్చు. మంచిని చర్చించవచ్చు. దాన్ని విలువైనదిగా భావించు. ఆనందం, సానుకూలత వ్యాప్తి చెందుతాయి.నీ దగ్గరున్న మరో నిధి నీ మనసు. మంచి ఆలోచనలతో ఉదయాన్ని ప్రారంభిస్తే, ప్రశాంతత నీ సొంతమవుతుంది. మానసిక ప్రశాంతత ప్రాప్తమైతే నీ అంత ధనవంతుడు మరెవరూ ఉండరు. తద్వారా ఇతరుల ఆనందంలో, కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చు. వారి జీవితాలను తాకొచ్చు.మరో గొప్ప సంపద నీ శరీరం. దాంతో ఇతరులకు అనేక మంచిపనులు చేయవచ్చు. అవసరమైన వారికి సహాయం అందించవచ్చు. సహాయం చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. ఇప్పుడు చెప్పు నువ్వు పేదవాడివా?’’ అన్నారు జునైద్ బొగ్దాదీ రహ్మతుల్లా అలై.ఈ మాటలు విన్న ఆ వ్యక్తి పరమానందభరితుడై, ఆత్మ సంతోషంతో, ఆత్మవిశ్వాసంతో పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగిపొయ్యాడు. – తస్లీమ్ -
దయలేని అమ్మలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమ్మా నన్ను అమ్మకే.. ఓ యమ్మా... నాన్నా నీకు దండ మే... నవ మాసాలు నన్ను మోశావమ్మా.. పురిటి నొప్పుల బాధ పడ్డావమ్మా.. పేగు తెంచుక నన్ను గన్నావమ్మా.. పేరు పెట్టకుండ వేరు చేయకమ్మా.. నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓయమ్మా..! నన్ను దూరంజేయబోకమ్మా... అని మెతుకుసీమలో బతుకమ్మ ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతిని.. ఆడపిల్లలను ప్రేమించడమే బతుకమ్మ... పర్యావరణాన్ని రక్షించుకోవడం.. అమ్మను, ఆడబిడ్డను బతికించుకోవడమే ‘బతుకమ్మ’కు అర్థం. పరమార్థం. తెలంగాణ సాకారమై బంగారు బతుకమ్మ నిండు పండగ శోభ సంతరించుకున్న వేళ ఇంకా ముళ్ల పొదల్లో పుత్తడి బొమ్మల మృత్యు కేకలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల పుడితే తప్పు, నట్టిట్లో నడిస్తే ముప్పు.. పెరిగితే అప్పు అనే ధోరణి పల్లెను ఇంకా వదల్లేదు. మెతుకు సీమలో పేదరికం రక్తబంధాన్ని కూడా హేళన చేస్తోంది. అమ్మ వెచ్చని పొత్తిళ్లలో నిద్రపోవాల్సిన పసికందులు ముళ్ల పొదల్లో.. మురికి కాల్వల్లో పడి కన్ను మూస్తున్నారు. జిల్లాలో నెల రోజులుగా వరుసగా ఆడ శిశువును విసిరేసిన సంఘటనలు అందరినీ కలచివేస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 10 మంది శిశువులను అమ్మలు నిర్దయగా వదిలేసుకున్నారు. గత చేదు సంఘటనలు మరవకముందే బుధవారం గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో మరో సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల ఆడ శిశువులను గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డులో ఎవ్వరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పాప గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఆస్పత్రి సిబ్బంది గుర్తించి విషయాన్ని పోలీసులు, శిశు సంక్షేమశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఐసీడీఎస్ అధికారి విమల జిల్లా కేంద్రంలోని శిశుగృహ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో శిశు గృహ అధికారులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు. ఇలాంటి సంఘటనే మంగళవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలోనూ చోటుచేసుకుంది. వావిలాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బతుకమ్మ తయారు చేసేందుకు తంగేడు పూల కోసం అటవీప్రాంతంలోకి వె ళ్లగా అక్కడ పొదల మధ్య పసికందు కనిపించటంతో మాన్పడిపోయారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నెలరోజుల ఆడ శిశువును పొదలమాటున వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు మహిళలు విషయాన్ని గ్రామపెద్దలకు తెలిపారు. చివరకు శిశు సంక్షేమశాఖ అధికారులు ఆడశిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు. గత నెల 9వ తేదీన మెదక్-చేగుంట రహదారిపై కొర్విపల్లి శివారులో అప్పుడే పుట్టిన మగశిశువును సైతం న్యూస్పేపర్లో చుట్టి మొక్కజొన్న చేనులో వదిలేయగా, స్థానికుల చొరవతో అధికారులు శిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి తరలించారు. ఇక ఐదు నెలల క్రితం వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి పోయారు. ఇలా జిల్లాలో ఆడ శిశువులను అటవీ ప్రాంతాల్లో, నిర్జన ప్రదేశాల్లో, ఆస్పత్రుల్లో వదిలేసి వెళ్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అభం శుభం ఎరుగని, లోకం పోకడ తెలియని పసికందులను వదిలించుకుంటూ మాతృత్వానికి మాయని మచ్చలను మిగులుస్తున్నారు. ఏదిఏమైనా ఆడ శిశువులను వదిలేసి వెళ్లటం సమాజానికి పట్టిన రోగమని సామాజిక కార్యకర్త యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ కూతుళ్లను విక్రయించటం, పొత్తిళ్లలోని ఆడశిశువులను వదిలి వేయటం సమాజంపై దుష్ర్ఫభావం చూపుతుందన్నారు. ఆడ శిశులను వదిలివేసే నీచ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.