breaking news
Payment of wages
-
క్యాబ్... రివర్స్ గేర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ పరిశ్రమను కరోనా వైరస్ కబళిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో క్యాబ్ బుకింగ్స్ లేకపోవటం, ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, డ్రైవర్లను ఆదుకోవటం, కార్ల నిర్వహణ వంటివి కంపెనీలకు పెను భారమవుతున్నాయి. లాక్డౌన్ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు గతంలో మాదిరి క్యాబ్స్ బుకింగ్స్ ఉండవన్నది పరిశ్రమ వర్గాల అంచనా. దీంతో నిర్వహణ భారాన్ని భరించలేమని, తాము కొనసాగటం కష్టమేనని హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న క్యాబ్ అగ్రిగేట్ కంపెనీలు చెబుతున్నాయి. నిజానికిపుడు మొబిలిటీ అనేది రోజు వారి అవసరాల్లో భాగం. లాక్డౌన్ పూర్తయ్యాక పరిశ్రమ రికవరీ అయ్యే దశలో చాలా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ పరిస్థితులు తాము భరించలేని స్థాయిలో ఉంటాయని హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న ప్రైడో, టోరా, యూటూ, రైడ్‌ఈజీ వంటి క్యాబ్ అగ్రిగేట్ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఆయా కంపెనీలకు సుమారు రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఓలా, ఉబర్లు షేరింగ్ సర్వీస్‌ల్ని నిలిపేశాయి. హైదరాబాద్‌లో తమకున్న 15వేల లీజు వాహనాలను గోదాములకే పరిమితం చేసినట్లు ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ షేక్ సలావుద్దీన్ చెప్పారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు లీజు వాహనాల ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదని.. లాక్డౌన్ పూర్తయ్యాక ఎవరి నంబర్ ప్లేట్ వాహనాలను ఆయా డ్రైవర్లకే అందిస్తామని ఓలా ప్రతినిధి తెలిపారు. లాక్డౌన్ తర్వాత పరిస్థితేంటి? లాక్డౌన్ ఎత్తేసినా గతంలో మాదిరి పెద్ద సంఖ్యలో బుకింగ్స్ ఉండవని ఓలా మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆనంద్ సుబ్రహ్మణ్యం అంచనా వేశారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు కొన్నాళ్ల పాటు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌కే ప్రాధాన్యమిస్తాయని, వైరస్ భయంతో కస్టమర్లు గతంలో మాదిరి షాపింగ్ మాల్స్, థియేటర్లు వంటి చోట్లకు ఎక్కువ వెళ్లరని పేర్కొన్నారు. కార్ పూలింగ్, వ్యక్తిగత వాహనాల వాడకానికే ప్రాధాన్యమిస్తారని చెప్పారు. ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్ వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. అందుకే ఓలా, ఉబర్ వంటివి సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆయా వాహనాల్ని పూర్తిగా శానిటైజ్ చేస్తే తప్ప కస్టమర్లలో నమ్మకాన్ని తీసుకురాలేమని సల్లావుద్దీన్ తెలిపారు. వేతనాలు, ఉద్యోగుల తగ్గింపు కూడా.. డ్రైవర్లు కాకుండా దేశవ్యాప్తంగా క్యాబ్ పరిశ్రమలో 15 వేల మంది ఉద్యోగులుంటారు. క్యాబ్స్ తిరగడం లేదు కనక వారి వేతనాల్లో 20 శాతం వరకు కోత పెట్టినట్లు తెలిసింది. దేశంలో 5 వేల మంది ఉద్యోగులున్న ఓ ప్రధాన క్యాబ్ కంపెనీ తమ ఉద్యోగుల వేతనాల్లో 15 శాతం కోత విధించింది. లాక్డౌన్ తర్వాత కూడా వ్యాపారం తగ్గుతుందన్న అంచనాతో ముందే అవి ఉద్యోగుల్ని తగ్గిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ క్యాబ్ కంపెనీలో 150 మంది ఉద్యోగులుండగా వారి సంఖ్యను సగానికి తగ్గించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తాత్కాలికంగా సేవలను నిలిపివేసే యోచనలో ఉన్నామని.. పరిశ్రమ మళ్లీ పుంజుకున్నాక.. రీబ్రాండ్‌తో మార్కెట్లోకి వస్తామని చెప్పారాయన. -
‘రాయితీ’ సొమ్ముతో గట్టెక్కిన ఆర్టీసీ
జూన్ నెల జీతాలకు డబ్బులు కరువు * బస్‌పాస్ రీయింబర్స్‌మెంట్‌తో ఊపిరి పీల్చుకున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త జీతాల చెల్లింపు ఇప్పుడు ఆర్టీసీ పీకల మీదకొచ్చింది. భారీ ఫిట్మెంట్తో ఆర్టీసీపై భారం పడకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఫిట్మెంట్ ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అయితే, జూన్ నెల ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో ఈ నెల జీతాల చెల్లింపుపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. నాలుగు రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనే కారణంతో ఆర్థిక శాఖ ఎటూ తేల్చలేదు. దీంతో జీతాలు చెల్లించడమెలాగో అంతుచిక్కక ఆర్టీసీ అధికారులు తీవ్ర ఆందోళనలో ఉండిపోయారు. ఆదుకున్న జీవో: ఆర్టీసీ ప్రతినెలా దాదాపు రూ.140 కోట్ల మేర జీతాల రూపంలో చెల్లిస్తుంది. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో అదనంగా రూ.65 కోట్ల వరకు భారం పడింది. వెరసి జూన్ నెలాఖరున రూ.200 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. కానీ, సచివాలయం నుంచి సానుకూల కబురు రాకపోవడంతో జీతాల చెల్లింపులో జాప్యం తప్పదనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఇంతలో ప్రభుత్వం నుంచి అనుకోని తీపి కబురు అందింది. బస్‌పాస్‌ల రూపంలో ఆర్టీసీ కోల్పోతున్న మొత్తాన్ని రీయింబర్స్ చేసే క్రమంలో గురువారం రూ.75 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో ఆ మొత్తాన్ని జీతాలకు మళ్లించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించి ఊపరి పీల్చుకున్నారు.