తిరుమలలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సోమవారం రాత్రి అంకురార్పరణ జరిగింది. ఆలయ పవిత్రత కాపాడడం, దోష పరిహారణార్థం ఈ ఉత్సవాలను టీటీడీ ఏటా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి గురువారం వరకు నిత్య, వారపు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. అర్చన, తోమాల సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.