breaking news
padmavati ammavaru
-
అభయ ప్రదాత
కలియుగంలో పెళ్లి కోసం అప్పు చేసిన మొదటివాడు శ్రీనివాసుడేనట. ఈ విషయం మనకు శ్రీ శ్రీనివాస కల్యాణమనే గ్రంథమే చెబుతోంది. పద్మావతీ అమ్మవారిని పెళ్లాడడానికి తన దగ్గర డబ్బులేకపోవడంతో స్వామివారు కుబేరుడి దగ్గర అప్పు చేశారట. కల్యాణం అనంతరం తన దేవేరితో కలిసి తిరుమలకు వెళుతూ, మార్గమధ్యంలో అప్పలాయగుంట వద్ద ఉన్న వేముల పర్వతంపై తపస్సు చేస్తున్న సిద్ధేశ్వర మహర్షి భక్తికి మెచ్చి ఆయనను అనుగ్రహించేందుకు ఆయన వద్దకు వచ్చాడట. తన స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి అప్పు చేసినట్లు మహర్షికి తెలియడంతో ఆయన స్వామివారిని ‘అప్పులాయన’ అని సంబోధిస్తూ, తనను అనుగ్రహించినందుకు గుర్తుగా ఇక్కడే ఉండిపొమ్మని కోరుకున్నాడట. ఆ మహర్షికి అభయమిచ్చిన చోటే వేంకటేశ్వరుడు వెలిశాడట. అక్కడ నీటికుంట ఉండడంతో అప్పులాయనకుంటగా పేరొచ్చిందని కూడా చెబుతారు. నాటి అప్పులాయన కుంటనే నేడు అప్పలాయగుంటగా పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని టీటీడీ ధార్మిక సంస్థ నిర్వహిస్తోంది. తిరుమలకే ఎందుకు వెళ్లారు...? వేంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఎక్కడ ఉండాలనే విషయంపై చర్చ జరిగింది. అప్పుడు అమ్మవారి తండ్రి ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి తిరుమల కొండపై ఒక కుటీరం ఏర్పాటు చేశారని, అందువల్ల స్వామివారు అక్కడ కొలువై ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. ఆరునెలలు అగస్త్యేశ్వరుని అతిథిగా.. పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత స్వామివారు కాలినడకన తిరుమలకు వెళ్తుండగా మధ్యలో శ్రీనివాసమంగాపురం దగ్గర తొండాపురంలో అగస్త్యేశ్వర స్వామి మందిరానికి వెళ్తాడు. అప్పుడు అగస్త్యేశ్వరుడు వెంకన్న–పద్మావతి దంపతులకు ‘తిరుమలలో 33 కోట్ల మంది రుషులు తపస్సు చేస్తున్నారు. అందువల్ల మీరు ఆర్నెల్లపాటు ఇక్కడే ఉండాలి’ అని చెబుతాడు. దీంతో స్వామి, అమ్మవారు అగస్త్యేశ్వరుడి మందిరంలో ఆర్నెల్లపాటు అతిథులుగా ఉన్నారని చరిత్ర. తదనంతర కాలంలో ఆ కుటీరం వకుళామాత కుటీరంగా పిలువబడుతోంది. ఆలయానికి విజయనగర రాజుల బహుమానం... నాటి విజయనగర రాజ్యస్థాపకులు అప్పలాయగుంట వేంకటేశ్వరుని ఆలయానికి కొన్ని దీపపు స్తంభాలను బహూకరించినట్లు ప్రతీతి. అప్పటి నుంచి ఇప్పటివరకు స్వామివారి సేవలకు ఆ దీపపుస్తంభాలనే వాడుతున్నారు. దీనికితోడు స్వామివారి ఆలయానికి తూర్పుముఖంగా అభయాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. తిరుమలలో లాగే పూజా కైంకర్యాలు.. తిరుమలలో జరిగే నిత్యకైంకర్యాలు, ప్రతి వైఖానస పూజా కార్యక్రమం, అన్ని సేవలు, బ్రహ్మోత్సవాలను కూడా టీటీడీ ఆధ్వర్యంలో అప్పలాయగుంటలో జరుగుతాయి. స్వామివారికి శనివారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు ఊంజల్‌సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోరు.. తిరుమల కొండపై వేలాదిమంది పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ అప్పలాయగుంట అభయహస్తం వేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం పెళ్లిళ్లు చేసుకోరు. చేసుకోవడానికి భక్తులు కూడా ఆసక్తి చూపరు. ఎలా వెళ్లాలంటే.. తిరుపతి బస్టాండులో అప్పలాయగుంటకు వెళ్లే బస్సులు ఉన్నాయి. ఆ బస్సు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపం మీదుగా అప్పలాయగుంటకు చేరుకుంటుంది. అలాగే చెన్నై నుంచి వచ్చే భక్తులు పుత్తూరు మండలం సరిహద్దులోని తడుకు ఆర్ఎస్ గ్రామం జాతీయరహదారి నుంచి ఎడమవైపునకు వెళ్తే అప్పలాయగుంట వస్తుంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే ప్రతి బస్సు వడమాలపేట మీదుగా వెళ్తుంది. వడమాలపేట నుంచి ఆటోలో వెళ్లొచ్చు. లేదంటే తడుకు ఆర్ఎస్ గ్రామం వద్ద దిగి అక్కడి నుంచి కూడా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు. ఇక్కడి స్వామివారి గొప్పతనం తిరుమల కంటే ముందే వేంకటేశ్వరుడు అభయహస్తంతో వెలిశారు గనుక ఇక్కడికి వచ్చే భక్తులంతా తమను అప్పుల బాధ నుంచి విముక్తుల్ని చేయాలని వేడుకుంటారు. కొన్నివారాల పాటు అప్పలాయగుంట అభయహస్తం వేంకటేశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. తిరుమలలో వేంకటేశ్వరుడు భక్తుల నుంచి కానుకలు తీసుకుంటాడని, కానీ అప్పలాయగుంట వేంకటేశ్వరుడు మాత్రం భక్తులకు అభయమిస్తాడని నమ్మకం. తిరుమలలో స్వామివారి హస్తం కిందకు ఉంటే.. అప్పలాయగుంటలో స్వామి చేతివేళ్ళు పైకి ఉంటాయి. అందుకే అభయహస్తం వేంకటేశ్వరుడిగా కీర్తింపబడుతున్నారు. – జి.బసవేశ్వరరెడ్డి, సాక్షి, తిరుపతి -
అమ్మవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. వీరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు. కుటుంబ సమేతంగా వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
తిరుచానూరులో మాస్టర్ ప్లానుకు రంగం సిద్ధం?
తిరుచానూరు : పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో మరో మాస్టర్ ప్లాను అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఆలయానికి రోజురోజుకూ భక్తుల తాకిడి అధికమవుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లానును తప్పనిసరిగా అమలుచేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ గురువారం తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో విలేకర్లతో మాట్లాడిన మాటలు మాస్టర్ ప్లాను వ్యవహారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇదివరకు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది. ఆదాయం అంతంతమాత్రంగానే ఉండేది. ప్రస్తుతం రోజుకు 20 నుంచి 30వేల మంది భక్తులు సరాసరిగా దర్శించుకుంటున్నారు. భక్తులు సమర్పించే కానుకలు, సేవా టికెట్లు ద్వారా నెలకు దాదాపు కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంతో అంచెలంచెలుగా మాస్టర్‌ప్లాను అమలుచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో భక్తుల తాకిడి అధికమయితే బస చేసేందుకు అనువుగా తిరుచానూరు షికారీకాలనీ సమీపంలో ఇప్పటికే శ్రీనివాసం, విష్ణునివాసం తరహాలో వసతి సముదాయం నిర్మాణ పనులు చేపట్టారు. వైకుంఠం తరహాలో క్యూకాంప్లెక్స్ తిరుమల తరహాలో భక్తుల రద్దీ అధికమైతే అమ్మవారి దర్శనానికి ఇబ్బంది ఎదురుకానుంది. దీనిని అధిగమించడం కోసం తిరుమలలోని వైకుంఠం తరహాలో తిరుచానూరులో క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. అందుకు ప్రస్తుతం ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేసుకునే యోచనలో ఉన్నా రు. పక్కా భవనం నిర్మించి పాఠశాలను అక్కడికి తరలించి, ఈ ప్రాంతంలో క్యూకాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. తోళప్పగార్డెన్లోకి అన్నదానం క్యాంటీన్ ఆలయం సమీపంలోని అమ్మవారి ఆస్థానమండపంలో ప్రస్తుతం అన్నదానం క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 5వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. భవిష్యత్తులో భక్తుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో తోళప్పగార్డెన్‌లో అన్ని హంగులతో అన్నదానం క్యాంటీన్ నిర్మాణానికి ఇదివరకే టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని మార్పులు భక్తుల సంఖ్య అధికమవడంతో దర్శన వేళలు, క్యూలలో మార్పులు చేపట్టారు. రూ.100 టికెట్ కొనుగోలు చేసిన భక్తులు జనరల్ క్యూలతో సంబంధం లేకుండా అమ్మవారిని దర్శించుకునే వెసలుబాటు కల్పించనున్నారు. కుంకుమార్చన సమయంలో సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా రోజుకు మూడు గంటలు(ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) బ్రేక్ దర్శనం తరహాలో కుంకుమార్చన సేవకు 3గంటలు కేటాయించనున్నారు. భయాందోళనలో స్థానికులు మాస్టర్‌ప్లాను అంటేనే స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మాస్టర్‌ప్లాను అమలైతే అమ్మవారి ఆలయ పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలను తొలగిస్తారని, అంచెలంచెలుగా గ్రామస్తులను తిరుమల తరహాలో వేరే ప్రాంతానికి తరలిస్తారనే భయం నెలకొంది. అమ్మవారినే నమ్ముకుని జీవిస్తున్న తమను గెంటేస్తే ఎలా బతకాలంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానికుల్లో భయం, అపోహలను తొలగించేందుకు టీటీడీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
అమ్మవారి సేవలో గవర్నర్లు