breaking news
Order Book
-
జోష్‌లో వెల్స్పన్ కార్ప్- జీఎంఎం ఫాడ్లర్
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఆటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. కాగా.. దేశ, విదేశాల నుంచి భారీగా ఆర్డర్లను పొందినట్లు వెల్లడించడంతో సా పైప్స్ తయారీ దిగ్గజం వెల్స్పన్ కార్ప్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క రెండు వారాల పతన బాటనుంచి మంగళవారం బౌన్స్‌బ్యాక్ సాధించిన ఇంజినీరింగ్ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వెల్స్పన్ కార్ప్ దేశ, విదేశాల నుంచి ఆయిల్, గ్యాస్ రంగ దిగ్గజాల నుంచి రూ. 1,400 కోట్ల విలువైన ఆర్డర్లను పొందినట్లు వెల్స్పన్ కార్ప్ తాజాగా వెల్లడించింది. 147 కేఎంటీకి సమానమైన ఈ ఆర్డర్లలో భాగంగా పైపులను దేశీయంగా రూపొందించనున్నట్లు తెలియజేసింది. తాజా ఆర్డర్లతో కలిపి మొత్తం ఆర్డర్‌బుక్ 755 కేంఎటీకి చేరినట్లు పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 6,300 కోట్లుగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో వెల్స్పన్ కార్ప్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో ప్రస్తుతం రూ. 5.40 ఎగసి రూ. 114 సమీపంలో ఫ్రీజయ్యింది. జీఎంఎం ఫాడ్లర్ ముందు రోజు రెండు వారాల పతన బాటను వీడిన జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. ప్లూటస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ 1.65 లక్షల షేర్లను తాజాగా కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. దీంతో కొనేవాళ్లు అధికంకాగా... అమ్మేవాళ్లు కరువుకావడంతో ఈ షేరు వరుసగా రెండో రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 190 జమ చేసుకుని రూ. 3,984 సమీపంలో ఫ్రీజయ్యింది. ప్రమోటర్లు మార్కెట్ ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్లో 17.6 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో ఈ షేరు రెండు వారాలుగా పతన బాటలో సాగుతూ వచ్చింది. ఓఎఫ్ఎస్ ద్వారా షేరుకి రూ. 3,500 ధరలో ప్రమోటర్లు వాటా విక్రయానికి నిర్ణయించిన విషయం విదితమే. -
బీహెచ్ఈఎల్ డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా!
న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ ఉపకరణాల దిగ్గజం బీహెచ్ఈఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు షేరు ధర పతనంకావడంతోపాటు, ఆర్డర్‌బుక్ బలహీనపడటం కారణంగా నిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం 2011లోనే 5% వాటాను డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. అయితే విద్యుత్ రంగం పలు సమస్యలను ఎదుర్కొంటూరావడంతో ఈ కాలంలో కంపెనీ షేరు ధర కూడా 60% పతనమైంది. తాజాగా ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో బీఎస్ఈలో షేరు దాదాపు 20% పతనమై రూ. 120 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి(ఏప్రిల్-జూన్) క్వార్టర్‌కు కంపెనీ నికర లాభం దాదాపు సగానికి పడిపోయి రూ. 465 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు కూడా 24% తగ్గి రూ. 6,353 కోట్లకు చేరాయి. ఇక ఆర్డర్‌బుక్ విలువ రూ. 1.15 లక్షల కోట్ల నుంచి రూ. 1.08 లక్షల కోట్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో కంపెనీలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను భారీ పరిశ్రమల శాఖ వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో చౌక ధరల్లో కంపెనీ వాటాను విక్రయించడం సమర్థనీయంకాదని వాదిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది.