breaking news
Online booking app
-
ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!
ఆన్లైన్ రవాణా సేవలందిస్తున్న ఉబర్ కొత్తగా జల రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు రోడ్లపై వాహనాలను బుక్ చేసుకున్నట్లే, ఇకపై నీటిలో బోట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఆసియాలో తొలిసారిగా జల రవాణా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో శికారా(సంప్రదాయ చెక్క పడవలు) బుకింగ్‌ను పరిచయం చేసింది. శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సులో ప్రయాణించే ఈ శికారా పడవలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సరస్సు చుట్టుపక్కల ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. శతాబ్దాలుగా సరస్సులో రవాణా, విశ్రాంతి కోసం శికారాలను ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల‘సాంకేతికత, సంప్రదాయాన్ని మిళితం చేసి ప్రయాణికులకు ఆన్లైన్ ద్వారా శికారా రైడ్ అందించి వారికి మరుపురాని అనుభవాన్ని సొంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కశ్మీర్‌లోని ఉత్కంఠభరిత ప్రకృతి దృశ్యాన్ని మరింత మందికి చేరువ చేయడం, పర్యాటకాన్ని మెరుగుపరిచే ఈ ఐకానిక్ అనుభవాన్ని సృష్టించడం గర్వకారణం’ అని ఊబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ తెలిపారు. ఉబర్ వినియోగదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. శికారా రైడ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఉబర్ వేదికగా 15 రోజుల ముందు నుంచి బుక్ చేసుకునే వీలుంది. దాల్ లేక్‌లో దాదాపు 4,000 శికారాలు ఉన్నట్లు అంచనా. -
కళాకారుల వేదిక.. జిల్మోర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేడుకను మరింత అందంగా మలచాలని అనుకుంటున్నారా? ఇక నుంచి కళాకారుల కోసం కాళ్లరిగేలా తిరగక్కరలేదు. సింగర్, యాంకర్, కమెడియన్, డ్యాన్సర్, మిమిక్రీ, మెజీషియన్.. ఇలా ఆర్టిస్టులెవరైనా ఒక్క క్లిక్‌తో వారిని చేరుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన యుక్తా ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ‘జిల్మోర్’ పేరుతో కళాకారుల ఆన్లైన్ బుకింగ్ యాప్‌ను సోమవారమిక్కడ ప్రారంభించింది. ఇటువంటి యాప్ అందుబాటులోకి రావడం భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 120 మందికిపైగా కళాకారులు జిల్మోర్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్మోర్ యాప్‌తోపాటు వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. యూజర్లు తమకు కావాల్సిన ఆర్టిస్ట్‌ను వెబ్/యాప్ ద్వారా ఆహ్వానించాలి. కార్యక్రమం, సమయం తమకు అనుకూలమైతే యూజర్ ఆహ్వానాన్ని గెస్ట్ (కళాకారులు) అంగీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్దేశిత మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లిస్తే బుకింగ్ పూర్తి అవుతుంది. బాలు నేతృత్వంలో.. జిల్మోర్ మెంటార్, బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు. అంతేగాక ఆయన వాటాదారుగా కూడా ఉన్నారని కంపెనీ వెల్లడించింది. ప్రతిభగల వర్థమాన కళాకారులకు ఇది చక్కని వేదికగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎస్.పి.బాలు అన్నారు. ప్రస్తుతం రూ.50 లక్షల సీడ్ ఫండ్ సమీకరించామని జిల్మోర్ ఫౌండర్ సారథి బాబు రసాల తెలిపారు. మార్చికల్లా రూ.6.7 కోట్లను సేకరిస్తామని చెప్పారు. అలాగే 4,000 మందికిపైగా కళాకారులు తమ వేదికపైకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10 వేలకుపైగా ఫంక్షన్ హాళ్లున్నాయి. 50 శాతం మంది కస్టమర్లు ఎంటర్టైనర్ను కోరుకుంటున్నారు. వీరికోసం కనీసం రూ.10 వేలు ఖర్చు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకుపైగా వ్యాపార అవకాశాలు ఉన్నాయి’ అని చెప్పారు.