breaking news
Nursing School
-
నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు
సాక్షి నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్ బస్సులో సుమారు 40 మంది విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయని, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సీఎం గారూ.. ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ) -
నామ్‌కే వాస్తే.. నర్సింగ్ విద్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేకచోట్ల కేవలం కాగితాలపైనే నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయి. బోగస్ అడ్రస్‌లు పెట్టి విద్యార్థులను చేర్చుకొని వారిని నిట్టనిలువునా ముంచుతున్నాయి. తరగతులు నిర్వహించకుండానే పరీక్ష రాయించి వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. దీంతో నర్సింగ్ విద్య తెలియక ఆసుపత్రుల్లో రోగులకు సరైన సేవలు చేయలేక వారు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు చూసి ఉద్యోగమిచ్చిన కార్పొరేట్ ఆసుపత్రులు, వారికి పని రాకపోవడంతో బయటకు గెంటేస్తున్నాయి. దీంతో మూడేళ్ల నర్సింగ్ సర్టిఫికెట్లు పొందినవారు లబోదిబోమంటున్నారు. ఇంత జరుగుతున్నా నర్సింగ్ కౌన్సిల్ ఏ విధమైన చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే ప్రాధాన్యం రాష్ట్రంలో ప్రైవేటురంగంలో 145 నర్సింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఇంటర్ అర్హతతో కూడిన మూడేళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సుల కోసం విద్యార్థులు ఎగబడుతుంటారు. ఈ కోర్సు చేశాక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగం వస్తుందని బాలికలు చేరుతుంటారు. అయితే నర్సింగ్ స్కూల్ యాజమాన్యాలు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఒక్కో స్కూలులో 45 నుంచి 60 సీట్ల వరకు వాటి సామర్థ్యాన్ని బట్టి ఉన్నాయి. ఈ కోర్సు కోసం ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తుంది. దీంతోపాటు ఇతరత్రా ఖర్చులంటూ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నాయి. అంటే 60 సీట్లున్న ఒక్కో కాలేజీకి కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నుంచే ఏడాదికి రూ.27 లక్షలు వస్తుంటాయి. ఇలా మూడేళ్ల కోర్సులకు ఏడాదికి రూ. 81 లక్షలు వస్తుంటాయి. ఇవిగాక విద్యార్థుల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అవి కలిపితే మరో రూ. 36 లక్షలు వస్తాయి. మొత్తం రూ. 1.17 కోట్లు ఫీజుల రూపంలోనే వస్తున్నాయి. అయితే, ఇంతింత ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం తరగతులు కూడా నిర్వహించని పరిస్థితి నెలకొంది. అంతేకాదు కనీసం వాటికి సొంత భవనాలు కూడా లేవు. ఈ అక్రమాలపై కొరడా ఝళిపించాల్సిన అధికారులు మామూళ్లకు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. బోగస్ అడ్రస్‌లు హైదరాబాద్ ఎల్బీనగర్లో ఒక నర్సింగ్ స్కూలు ఉంది. అలాగే వనస్థలిపురంలో ఒక నర్సింగ్ స్కూలుంది. అవెక్కడున్నాయో ఎవరికీ తెలియదు. దాని ఇంటి నెంబర్, వీధి పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఏ అడ్రస్‌కు వెళ్లాలో కూడా తెలియదు. నర్సింగ్ కౌన్సిల్ జాబితాలో పేర్కొన్న అడ్రస్‌లను పట్టుకొని వెళితే దాదాపు 50 నర్సింగ్ స్కూళ్లు బోగస్ అడ్రస్‌లు ఇచ్చినట్లు సమాచారం. విచిత్రమేంటంటే ఒకే భవనంలో 14 నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయి. అంటే ఒకే భవనంలో 14 నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయని కాదు, ఒక నర్సింగ్ స్కూలు యజమానే, అడ్రస్ లేకుండా కేవలం సర్టిఫికెట్లతో నడిపించే మిగిలిన 13 నర్సింగ్ స్కూళ్లతో ఒప్పందం చేసుకొని వారి విద్యార్థులకు అక్కడే తరగతులు నిర్వహిస్తున్నామని చూపిస్తున్నారు. అందుకోసం కొంత వసూలు చేస్తున్నారు. ఒక్క పూర్వ మెదక్ జిల్లాలోనే 8 నర్సింగ్ స్కూళ్లు ఇలా అక్రమంగా నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకోవాలి బోగస్ అడ్రస్‌లు పెట్టి, కాగితాలపై కోర్సులు నడుపుతున్న నర్సింగ్ స్కూళ్లను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలి. బోగస్ స్కూళ్లతో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుండటం దారుణం. దీనివల్ల నర్సింగ్ విద్య నాణ్యత తగ్గిపోతున్నది. –గోవర్ధన్, చైర్మన్, తెలంగాణ నర్సుల సమితి ఫ్యాకల్టీలు ఏరీ? నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక నర్సింగ్ స్కూలు ఏర్పాటు చేయాలంటే, తప్పనిసరిగా 20 వేల చదరపు అడుగుల వైశాల్యంలో భవనం ఉండాలి. నర్సింగ్ ల్యాబ్, పీడియాట్రిక్ ల్యాబ్, ప్రి క్లినికల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, స్టాఫ్ రూం, లైబ్రరీ, ఫ్యాకల్టీ రూం, లెక్చర్ హాల్ ఇలా 11 రకాల అంశాలకు సంబంధించినవి ఉండాలి. అంతేకాదు 100 పడకల ఆసుపత్రితో ఒప్పం దం చేసుకొని ఉండాలి. క్లినికల్ ప్రాక్టీస్ చేయిస్తుండాలి. అంతేకాకుండా ఒక్కో నర్సింగ్ కాలేజీలో 14 మంది బోధనా సిబ్బంది ఉండాలి. అందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్, 10 మంది ట్యూటర్లు, ఇద్దరు అదనపు ట్యూటర్లు ఉండాలి. కానీ ఏ స్కూల్లోనూ ఒకరిద్దరు మినహా ఉండటం లేదు. అసలు కాలేజీ లేకుండా, తరగతులే నిర్వహించకుండా నడుస్తున్న నర్సింగ్ స్కూళ్లు అయితే మరీ ఘోరం. ఆ స్కూళ్ల విద్యార్థులు కేవలం పరీక్షల సమయంలోనే వస్తారు. యాజమాన్యాలు పాస్ చేయిస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్, అదనపు ఫీజు కాకుండా, పాస్ చేయించినందుకు మరికొంత గుంజుతున్నారు. కోర్సు చివరి సంవత్సరంలో ఏదో ఒక ఆసుపత్రిలో శిక్షణ ఇప్పిస్తారు. ఆ శిక్షణ సమయంలో సంబంధిత ఆసుపత్రి ఎంతోకొంత విద్యార్థులకు వేతనం చెల్లిస్తుంది. అందులోనూ సగం యాజమాన్యాలే తీసుకుంటున్నాయి. -
జీజీహెచ్ అభివృద్ధికి రూ. 20 కోట్లు విడుదల
కాకినాడ క్రైం :కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య విభాగం (ఎంసీహెచ్ బ్లాకు) ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జీజీహెచ్‌లో భవన నిర్మాణం, వైద్య పరికరాల నిమిత్తం రూ. 20 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జీజీహెచ్ మార్చురీ విభాగం సమీపంలోని తోటీ క్వార్టర్స్, నర్సింగ్ స్కూల్ మెస్‌లను తొలగించి సుమారు ఎకరం స్థలంలో భవనాన్ని నిర్మించనున్నారు. ఎంసీహెచ్ బ్లాకు ఏర్పాటు నేపథ్యంలో జీజీహెచ్‌కు నూతనంగా ఐదు యూనిట్లు మంజూరయ్యాయి. ఎంసీహెచ్ బ్లాకు ఏర్పాటుతో గైనిక్ విభాగ వైద్యులు, గర్భిణులకు ఉపశమనం లభించనుందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. మూడు యూనిట్లతో సతమతం ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వందల మంది గర్భిణులు రోజూ కాకినాడ జీజీహెచ్‌కు వస్తుంటారు. జీజీహెచ్ గైనిక్ విభాగంలో ఇప్పటి వరకూ మూడు యూనిట్లు మాత్రమే ఉండడంతో అటు వైద్యులతో పాటు ఇటు గర్భిణులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గైనిక్ విభాగానికి రోజూ 400 మంది గర్భిణులు వస్తుంటారు. విభాగంలో మూడు యూనిట్లకు 90 బెడ్లు మాత్రమే ఉన్నాయి. వైద్యులపై కూడా ఒత్తిడి అధికమవుతోంది. రోజూ జీజీహెచ్ గైనిక్ విభాగంలో 40 మందికి పైగా శిశువులు జన్మిస్తుంటారు. గైనిక్ విభాగం ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఎంసీహెచ్ బ్లాకును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీహెచ్‌తో మూడు గైనిక్ యూనిట్లు నూతనంగా మంజూరయ్యాయి. ఒక పీడియాట్రిక్, ఒక అనస్థీషియా యూనిట్లు కూడా నూతనంగా రానున్నాయి. ఒక్కో యూనిట్‌కు ఒక చీఫ్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానుండడంతో వైద్యుల కొరత తీరనుంది. ఎంసీహెచ్ బ్లాకు నిర్మాణానికి బొంబేడైయింగ్ కనస్ట్రక్షన్స్ సంస్థ భవన నిర్మాణానికి ప్లాన్ రూపొందించింది.