breaking news
Nokia Networks
-
4జీ హ్యాండ్సెట్ మార్కెట్లో యాపిల్‌దే సింహభాగం
న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఫ్రీక్వెన్సీలో పనిచేస్తోన్న 1.4 కోట్ల యూనిట్ల 4జీ పరికరాల్లో అధిక వాటాను కలిగి ఉందని నోకియా నెట్వర్క్స్ తన నివేదికలో తెలిపింది. దీని ప్రకారం.. టాప్-15 4జీ మోడళ్లలో యాపిల్ ఐఫోన్ 5ఎస్, 6 మొబైల్స్ తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఏ5 నాలుగో స్థానంలో నిలిచింది. 1,800 మెగాహెర్ట్జ్ బాండ్లో 4జీ సర్వీసులను సపోర్ట్ చేసే మొబైల్స్‌లో ఐఫోన్ 5ఎస్, 6 మొబైల్స్ వరుసగా 10.46 శాతం, 8.9 శాతం వాటాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వీటి తర్వాతి స్థానంలో లెనొవొ ఏ6000 (7.5 శాతం) ఉంది. ఇక దీని తర్వాతి స్థానాల్లో యాపిల్ ఐఫోన్ 5, షావోమి రెడ్మి నోట్3, మైక్రోమ్యాక్స్ యురేకా ఉన్నాయి. 850 మెగాహెర్ట్జ్ బాండ్లో 4జీ సేవలను అందించే పరికరాల్లో యాపిల్ ఐఫోన్ 5ఎస్, 6 వాటా వరుసగా 18.12 శాతంగా, 15.42 శాతంగా ఉంది. భారత్‌లో టెల్కోలు 4జీ సేవలను అందించడానికి 1,800 మెగాహెర్ట్జ్, 850 మెగాహెర్ట్జ్, 2,300 మెగాహెర్ట్జ్ బాండ్లో స్పెక్ట్రమ్‌ను కలిగి ఉన్నాయని నోకియా నెట్వర్క్స్ వివరించింది. 1,800 మెగాహెర్ట్జ్ 4జీ మొబైళ్ల వాటా 1.45 శాతంగా (1.3 కోట్ల యూనిట్లుగా), 2,100 మెగాహెర్ట్జ్ 4జీ మొబైళ్ల వాటా 1.2 శాతంగా ఉన్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం ఎయిర్టెల్ మాత్రమే ఇప్పటివరకు 1,800 మెగాహెర్ట్జ్ బాండ్ ఫ్రీక్వెన్సీలో 4జీ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఆర్‌కామ్, రిలయన్స్ జియోలు సంయుక్తంగా 850 మెగాహెర్ట్జ్ బాండ్లో 4జీ సేవలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపింది. -
మొబైల్ ఇంటర్నెట్ వినియోగం 74% అప్
న్యూఢిల్లీ: దేశంలో 3జీ వినియోగం పెరగటం వల్ల మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో వృద్ధి కనిపించింది. 2013తో పోలిస్తే గతేడాది చివరకు 3జీ డాటా వినియోగంలో 114 శాతం వృద్ధి, మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 74 శాతం వృద్ధి నమోదైందని నోకియా నెట్వర్క్స్ తెలిపింది. 2జీ మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 41 శాతం వృద్ధి కనిపించింద ని నోకియా నెట్వర్క్స్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం డాటా వినియోగంలో 3జీ వాటా 52 శాతంగా ఉంది. 2జీ వినియోగదారునితో పోలిస్తే 3జీ వినియోగదారుడు 3 రెట్లు ఎక్కువ డాటాను వినియోగించుకుంటున్నాడు. ‘ఏ’ సర్వీస్ ప్రాంతాలలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో డాటా వినియోగం అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో 3జీ డాటా వినియోగంలో 129 శాతం వృద్ధి నమోదైంది. అలాగే ‘బి’ సర్వీస్ ప్రాంతాలలో కూడా 3జీ డాటా వినియోగంలో 107 శాతం వృద్ధి కనిపించింది. డాటా వినియోగం ప్రకారం ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మెట్రో నగరాలు ‘బి’ సర్వీస్ ప్రాంతం కిందకు వస్తాయి. డాటా వినియోగంలో పెరుగుదల వివిధ మొబైల్ పరికరాలు, నెట్‌వర్క్‌ల పైన ఆధారపడి ఉంటుందని నోకియా నెట్వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ గిరోత్రా అన్నారు. పరిశ్రమ అధ్యయనం ప్రకారం, 2014లో భారత్‌కు 258 మిలియన్ల ఫోన్లు దిగుమతి అయ్యాయి. వీటిలో 22 శాతం 3జీ స్మార్ట్ఫోన్లు, 7 శాతం 2జీ స్మార్ట్ఫోన్లు, 1 శాతం 4జీ స్మార్ట్ఫోన్లు, 70 శాతం ఫీచర్ ఫోన్లు ఉన్నాయని చెప్పారు.