breaking news
no space
-
ఆఖరి మజిలికీ కష్టాలే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జీవితాంతం ఎంత దర్జాగా బతికినా.. చనిపోతే ఖననానికి ఆరు గజాల స్థలం కరువవుతోంది. కనీసం దహన సంస్కారం చేయాలన్నా అందుబాటులో లేని వైకుంఠధామాలతో మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి నెలకొంది. నాడు ఒకప్పుడు భుజాల మీద నిర్వహించే శవయాత్రలు.. నేడు వాహనాల్లో దర్శనమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజల చావు కష్టాలు వర్ణాతీతం. ఎవరైనా చనిపోతే ఖననానికీ.. దహన సంస్కారానికీ మృతుల కుటుంబీకులు, బంధుమిత్రులు నానాయాతన పడుతున్నారు. మనిషి జీవితానికి సంబంధించి ఆఖరి మజిలీ అయిన దహస సంస్కారాలకూ అనువైన స్థలం అందుబాటులో లేకుండాపోయింది. శాస్త్రాలు.. సంప్రదాయాలకనుగుణంగా దహన సంస్కారాలు చేసుకునే వీలుగా ఉండాల్సిన వైకుంఠధామాలు ఉమ్మడి జిల్లాలో పావువంతు గ్రామాల్లోనూ నిర్మాణాలకు నోచుకోలేదు. ఎవరు చనిపోయినా.. మైళ్ల దూరం శవయాత్రలు నిర్వహించాల్సిన దుస్థితి వందలాది గ్రామాల్లో నెలకొంది. వైకుంఠధామాలు లేకపోవడంతో చాలా మంది కుటుంబీకులు తమ పొలాల్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇంకొందరు గ్రామ శివార్లలో ఉన్న చెరువులు.. కుంటల వద్ద దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. వైకుంఠధామం నిర్మాణాల కోసం స్థలం అందుబాటులో లేకపోవడం.. మంజూరైన చోట్ల నిధుల కొరత.. స్థలం, నిధులు రెండూ ఉన్నా నిర్మాణ పనులపై సరైన పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో ఉమ్మడి జిల్లాలో శ్మశాన వాటికల నిర్మాణాలు అటకెక్కాయని చెప్పవచ్చు. •మహబూబ్నగర్ జిల్లాలో 442 గ్రామ పంచాయతీలు ఉంటే 61 గ్రామాల్లోనే వైకుంఠధామాలున్నాయి. 329 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించారు. పనులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. 52 గ్రామాల్లో స్థల సేకరణ చేయాల్సి ఉంది. •వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలుండగా.. ప్రస్తుతం 78 వైకుంఠధామాలు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో 178 నిర్మాణా లకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇందులో 25 నిర్మాణాల పనులు ప్రారంభించగా.. ఒక్కటి పూర్తి చేశారు. 24 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన నిర్మాణాలకు సంబంధించి స్థల సేకరణ చేయాల్సి ఉంది. •నారాయణపేట జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు రెండు గ్రామాల్లోనే వైకుంఠధామాలున్నాయి. పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా 256 గ్రామాల్లో నిర్మాణాలకు పరిపాలనా ఆమోదం లభించింది. 232 చోట్ల స్థల సేకరణ చేశారు. 24 గ్రామాల్లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 80 చోట్ల నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయి. •జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు 160 గ్రామాల్లో వైకుంఠధామాలున్నాయి. 30రోజులప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు 66 చోట్ల స్థలాన్ని గుర్తించారు. వీటి నిర్మాణాలకు సంబంధించి భూమి పూజ చేశారు. పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. మరో 29 చోట్ల స్థలాలను సేకరించాల్సి ఉంది. •నాగర్కర్నూల్ జిల్లాలో 453 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం ఐదింటిలోనే వైకుంఠధామాలున్నాయి. వీటి నిర్మాణం కోసం 407 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. 64 చోట్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం ఐదు పంచాయతీల్లోనే పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో 46 గ్రామాల్లో స్థలాలను గుర్తించలేకపోయారు. అటకెక్కిన ‘ఉపాధి’ నిర్మాణాలు ఏళ్ల నుండి వేధిస్తోన్న వైకుంఠధామాల లేమీ సమస్య పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ క్రమంలో గతంలోనే వైకుంఠధామాలు లేని గ్రామాలను గుర్తించి వాటిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించాయి. రెండేళ్ల క్రితమే సంబంధిత అధికారుల నుంచి ప్రభుత్వం తీర్మానాలు తెప్పించుకుంది. ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి రూ.10 లక్షల నుంచి రూ.10.40 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని ప్రభుత్వ ఉపాధి హామి అధికారులకు సూచించింది. ఈ నిధులతో శ్మశాన వాటిక, ప్రహరీ , స్నానపు గదులు, దహనపు గద్దె, వేచి ఉండే గడి, కార్యాలయం నిర్మాణాలు చేపట్టాలని పేర్కొంది. అయితే వైకుంఠధామాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములు గుర్తించాల్సిన బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించింది. గుర్తించిన భూములను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని సూచించింది. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో స్థలాలు గుర్తించడంలో జాప్యం జరుగుతుంది. దీంతో ఎవరైనా చనిపోతే వారి సొంత పొలాల్లో, అడవుల్లో చెరువులు, వాగులు, కుంటలు, రహదారుల సమీపంలో దహన సంస్కారాలు జరుపుతున్నారు. తర్వాత స్నానాలు చేసేందుకు మహిళలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెట్ల పొదల చాటుకు వెళ్లి స్నానాలు చేసి బట్టులు మార్చునే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో వందలాది గ్రామాల్లో ఉంది. ఇదీలావుంటే.. తమ తమ గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలంటూ అనేక మంది ప్రజలు ప్రజాప్రతినిదులు, అధికారులను ఎన్నోసార్లు వేడుకున్నారు. శవాలు ఏటి పాలు..! వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ముంపు గ్రామాలకు పునరావాసాన్ని కల్పించిన అధికారులు శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించలేదు. దీంతో ఈర్లదిన్నె గ్రామస్తులు శ్మశాన వాటిక స్థలం కోసం ఏళ్లతరబడి అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ గోడును విన్నవిస్తూనే ఉన్నారు. శ్మశాన వాటిక కోసం ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణానది ఒడ్డున మృతదేహాలను ఖననం చేస్తున్నారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా పూడ్చిన శవాల సమాధుల ఆనవాలు కూడా నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. దీంతో తమ తాత, ముత్తాతల సమాధులను కూడా గుర్తించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఈర్లదిన్నె, కిష్ణంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలాలను సేకరిస్తున్నాం.. గ్రామ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో వందలాది గ్రామాల్లో వైకుంఠధామాలు లేవు. అన్నిట్లో ఏర్పాటు చేసేలా స్థలాలను గుర్తిస్తున్నాం. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు అదే పనిలో ఉన్నారు. అయితే స్థ్థలాల సేకరణ కొంత ఇబ్బందిగా ఉంది. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తాం. – డీపీఓ వెంకటేశ్వర్లు స్థల సమస్య తీవ్రంగా ఉంది మా ఊర్లో శ్మశాన వాటికకు స్థల సమస్య తీవ్రంగా ఉంది. భూములు ఉన్న వారు తమ సొంత పొలాల్లో పూడ్చి పెడుతున్నారు. సొంత స్థలాలు లేని వారు కాల్వ వద్ద పూడ్చాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఊరికి సమీపంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేక సమస్య వచ్చి పడింది. ఇప్పుడు కాల్వ వద్ద పూడ్చే పరిస్థితి లేక గుట్ట వద్దకు వెళ్తున్నారు. – డి.బాలరాజు, సంకలమద్ది, మూసాపేట లెక్కలేనన్ని సార్లు కలిశా.. మా ఊర్లో శ్మశానవాటిక లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇందుకోసం లెక్కలేనన్ని సార్లు అధికారులను కలిశా. ఇప్పటికి సమస్య తీరలేదు. నాలుగేళ్ల నుంచి శ్మశానవాటిక కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నా.. అయినా స్పందించడం లేదు. ప్రభుత్వ స్థలంలో శ్మశానవాటిక లేనందున ప్రైవేట్ స్థలాల్లో ఎక్కడా పెట్టనివ్వడం లేదు. తక్షణం అధికారులు స్పందించి సమస్యను తీర్చాలి. – మంగలి వెంకటస్వామి, కందూర్, అడ్డాకుల -
రాజధానిలో దేవుళ్లకూ స్థానం లేకుండా చేస్తారా?
-విచక్షణా రహితంగా గుడులను, మసీదులను కూల్చేస్తున్నారు -వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మిస్తున్న రాష్ట్ర రాజధానిలో దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలతో పాటుగా దేవుళ్లకు కూడా స్థానం లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాజధాని ప్రాంతంలో విచక్షణా రహితంగా టీడీపీ ప్రభుత్వం దేవాలయాలను, మసీదులను కూల్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్యలు ఘజనీ, ఘోరీలను తలపిస్తున్నాయన్నారు. దేవాలయాలే కాకుండా మసీదులను కూడా విచక్షణా రహితంగా పడగొడుతున్నారన్నారు. ఇప్పటికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో 25 నుంచి 30 వరకూ దేవాలయాలను, కొన్ని మసీదులను పడగొట్టారన్నారు. స్థానిక ప్రజలు ఎంత వ్యతిరేకించినా, బంద్ పాటించినా కలెక్టర్కు మొరపెట్టుకున్నా లెక్క చేయకుండా దేవాలయాలను, మసీదులను కూల్చేసుకుంటూ పోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విజయవాడలో సీతమ్మ పాదాలు, శనేశ్వరాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, సాయిమందిరం ఇలాంటి వాటన్నింటితో పాటుగా రామవరప్పాడు మసీదును కూడా పడగొట్టడం దారుణమని విమర్శించారు. రామవరప్పాడు మసీదు ప్రాంతంలో ఉన్న ముస్లింలను రాత్రిపూట అరెస్టు చేసి మరీ కూల్చి వేశారన్నారు. గోశాల, నిన్న గోశాలకు చెందిన శ్రీకృష్ణ దేవాలయాన్ని కూల్చి వేయడం దుర్మార్గమని పార్థసారథి మండిపడ్డారు. గోశాల ఉంటున్న భూమిలో సగం గోశాలకే చెందినదని, మరో సగం ఇరిగేషన్ శాఖదని ఆయన అన్నారు. దేవాలయాలను, మసీదులను పడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ వారు దేవాలయాల కూల్చి వేతపైన వెంటనే స్పందించాలని, మసీదుల కూల్చివేతపైన ముస్లిం మైనారిటీ సంస్థలు, క్రిస్టియన్ మైనారిటీ పెద్దలు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వద్దని తాము అనడం లేదని అయితే ఈ సమయంలో మతభావాలను గౌరవించాలని ఆయన కోరారు. -
సబ్బం హరికి వైఎస్సార్ సీపీతో సంబంధం లేదు: శోభా నాగిరెడ్డి