breaking news
Night Vision Goggles
-
Indian Air Force: ‘నైట్ విజన్ గాగుల్స్’తో విమానం ల్యాండింగ్
న్యూఢిల్లీ: భారత వాయుసేన(ఐఏఎఫ్) మరో అరుదైన ఘనత సాధించింది. నైట్ విజన్ గాగుల్స్(ఎన్వీజీ) సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో సీ–130జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఒక వీడియోలో ఎన్వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానంలో లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్వీజీ విజువల్స్ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో విభిన్నంగా ఉన్నాయి. మన దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన పేర్కొంది. నైట్ విజన్ గాగుల్స్ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో, రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. -
భారతీయ వాయుసేన డేరింగ్ ఆపరేషన్
-
హ్యాట్సాఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. చిమ్మచీకట్లో సాహాసోపేతంగా 121 మందిని..
ఢిల్లీ: అదొక చిన్న రన్‌వే ఉన్న ఎయిర్‌స్ట్రిప్. కమ్యూనికేషన్లో భాగంగా.. నావిగేషనల్ అప్రోచ్ సహకారం లేదు. అక్కడ ఫ్యూయల్ సౌకర్యమూ లేదు. రాత్రి పూట ల్యాండ్ చేయడానికి ఏమాత్రం అనుకూలంగా లేని చోటు అది. ల్యాండింగ్ లైట్లు కూడా లేని చోటు నుంచి జనాల్ని తరలించే ఆపరేషన్ సక్సెస్‌గా పూర్తి చేసింది భారత వైమానిక దళం. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసే దమ్ము ఉందని మరోసారి నిరూపించుకుంది. సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ (Night Vision Goggles) సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్ఫ్రా-రెడ్ సెన్సార్లను ఉపయోగించి ఎలాంటి ఆటంకాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే.. అంత చిన్న రన్‌వేలో ఎయిర్‌క్రాఫ్ట్ దించగలిగారు. ల్యాండింగ్ అయ్యాక కూడా ఇంజిన్లను ఆన్‌లోనే ఉంచి.. అక్కడున్నవాళ్లను, వాళ్ల లగేజీలను విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్పెషల్ యూనిట్ గరుడకు చెందిన ఎనిమిది మంది కమాండోలు ప్యాసింజర్ల భద్రతను పర్యవేక్షిస్తూనే.. సురక్షితంగా ఎక్కించారు. విమానం ఎలాగైతే దిగిందో.. అదే తరహాలో ఎన్వీజీ ఉపయోగించి టేకాఫ్ చేశారు. అలా రెండున్నర గంటలపాటు ఈ రిస్కీ ఆపరేషన్ కొనసాగింది. కల్లోల రాజధాని ఖార్తోమ్కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా చోటుచేసుకోవడం గమనార్హం. అంతా జెడ్డాకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆపరేషన్ కావేరి ద్వారా ఇప్పటిదాకా 1,360 మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది కేంద్రం. ఇదీ చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు! 110 ఏళ్ల తర్వాత.. -
ఈ అద్దాలు పెట్టుకుంటే మనకూ పిల్లి కళ్లు!
పిల్లులు రాత్రి పూట కూడా చూడగలవు.. మరి మనం.. ఇదిగో ఈ కళ్లద్దాలు పెట్టుకుంటే.. మనం కూడా పిల్లిలా రాత్రి పూట చూసేయొచ్చట.. అదేంటో మరి తెలుసుకుందామా.. ఇలా చూసేద్దాం.. చీకట్లో ఏ వస్తువునూ చూడలేం.. రాత్రి అతినీల లోహిత కిరణాలు వెలువడుతాయి. వాటిని మానవ నేత్రం చూడలేదు. కానీ నానో టెక్నాలజీని ఉపయోగించి రాత్రి కూడా చూడగలిగేలా మన వెంట్రుక కన్నా వంద రెట్లు పలుచటి పొర (అల్ట్రాథిన్ క్రిస్టల్ ఫిల్మ్)ను ఆస్ట్రేలియన్ నేషన్ వర్సిటీ, నాటింగ్‌హామ్ ట్రెంట్ వర్సిటీల ఆధ్వర్యంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి పరిచింది. ఆ పొరను మన కళ్లద్దాలకు పెట్టుకుంటే సరి.. రాత్రి చీకట్లోనూ ఎంచక్కా చూసేయొచ్చు. ఇంతకీ ఇవెలా పనిచేస్తాయి? గాలియం ఆర్సెనైడ్ పదార్థంతో ఈ ఫిల్మ్‌ను తయారుచేశారు. దీనిద్వారా ప్రసరించే కాంతి తాలూకు రంగు లేదా ఫ్రీక్వెన్సీ (పౌనఃపున్యం)ని ఇది మార్చుతుంది. అంటే రాత్రి వెలువడే అతినీల లోహిత కిరణాలను.. మనం చూడగలిగే కాంతి (విజిబుల్ లైట్)గా మార్చగలదు. అయితే చీకట్లో ఏదైనా వస్తువు వెలుతురులో ఉన్నట్లు కాకుం డా ఆకుపచ్చని రంగులో కన్పిస్తుంది. సాధారణంగా నైట్ విజన్ అద్దాలతో చూసినప్పుడు కని పించినట్లే ఉంటుందని పరిశోధకులు చెప్పారు. నైట్ విజన్ అద్దాలు బరువుగా ఉంటాయని.. ఇవి చాలా తేలిక, ఖర్చు తక్కు వని తెలిపారు. ఈ రెండింటిలో అతినీల లోహిత కిరణాలను మార్చే పద్ధతి వేర్వేరుగా ఉంటుందని పరిశోధకులు డ్రాగోమిర్ నెషేవ్ వివరించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: 118 ఏళ్ల కింద.. టైమ్ ఎలా సెట్ చేశారు? -
రంపచోడవరం కిడ్నాప్
ముప్పై ఏళ్ల క్రితం జరిగిన క్రైమ్ స్టోరీ ఇది. నేను 1984లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా అపాయింట్ అయ్యాను. అప్పటికి ఆ ప్రాంతమంతా నక్సల్స్ కిడ్నాపుల సంఘటనలతో అట్టుడుకుతోంది. నేను అక్కడికి వెళ్లకుముందు జరిగిన ఓ రెండు పెద్ద కిడ్నాపులు నాకే కాదు, మొత్తం డిపార్టుమెంటుకే సవాలుగా నిలిచాయి. ఒకసారి నక్సల్స్... ఎనిమిదిమంది ఐఏఎస్ ఆఫీసర్లను కిడ్నాప్ చేసి వారి డిమాండ్లను నెరవేర్చుకున్నారు. ఇంకోసారి పెద్దాపురం ఆర్డీఓను కిడ్నాప్ చేసి వారి సహచరుల్ని జైల్ నుంచి విడిపించుకున్నారు. అదే సమయంలో ఆదిలాబాద్ కలెక్టర్‌ని కూడా కిడ్నాప్ చేశారు. ఎక్కడ చూసినా నక్సల్స్ కిడ్నాపుల వార్తలే. తూర్పుగోదావరి చాలావరకూ ఏజెన్సీ ప్రాంతం కావడంవల్ల అక్కడే ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతుండేవి. ఎవరిని కిడ్నాప్ చేసినా దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి దాచిపెట్టేవారు. పవర్లో ఉన్నవారిని కిడ్నాప్ చేసి తోటి నక్సల్స్‌ని జైళ్ల నుంచి విడిపించుకునేవారు. డబ్బున్నవారిని కిడ్నాప్ చేసి ధనాన్ని డిమాండ్ చేసేవారు. ఇలాంటివి వారి భాషలో ‘మనీ యాక్షన్’ పనులన్నమాట! సాయంత్రంలోగా 35 లక్షలు! ఒకరోజు ఉదయం నేను రంపచోడవరం ఏజెన్సీలో ఉండగా ఓ షావుకారి కుటుంబ సభ్యులొచ్చి చేతిలో ఓ లేఖ పెట్టి బోరుమన్నారు. సాయంత్రం లోగా 35 లక్షల డబ్బుని ఫలానా చోటికి పంపించకపోతే షావుకారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆ ఉత్తరం సారాంశం. అప్పటికే నేను నక్సల్స్ కిడ్నాపింగ్ సంఘటనల విషయంలో చాలా అలర్ట్‌గా ఉన్నాను. ఉదయం తొమ్మిదింటికి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే మా బలగాలను మొత్తం దింపాను. దాదాపు రెండు వందల మంది వరకూ ఉంటారు. వారిని ఎనిమిది గ్రూపులుగా విభజించాను. ఒక్కో గ్రూపులో ఇరవైమందికి పైగానే ఉంటారు. నా అంచనా ప్రకారం కిడ్నాప్ చేసిన దళంలో పదిమందివరకూ నక్సల్స్ ఉంటారు. ఒక నక్సల్‌కి ఇద్దరు పోలీసుల చొప్పున గ్రూపులను తయారుచేసి అటవీ ప్రాంతానికి చేరుకున్నాం. రంప ఏజెన్సీలో ఉన్న అటవీ విస్తీర్ణం చాలా పెద్దది. చాలా డేంజరెస్ జోన్ కూడా! చిరుత పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. ముందుగా అడవి మ్యాప్ తీసుకుని, అడవి చుట్టూ ప్రాంతాన్ని మా బృందాలు కవర్ చేసేలా ప్లాన్ వేశాను. అందరమూ దిక్సూచిలు, వైర్లెస్ ఫోన్లు, రాత్రుళ్లు కూడా కనిపించే నైట్ విజన్ గాగుల్స్, ఆయుధాలను వెంటబెట్టుకుని బయలుదేరాం. కాళ్లు అరిగే ప్రయాణం... నా స్కెచ్ గురించి చెప్పగానే టీమంతా ఆశ్చర్యపోయింది. లేఖలో చాలా స్పష్టంగా రాసి ఉంది. పోలీసులకు చెబితే బాగుండదని. అలాంటి పని చేస్తే వెంటనే ప్రాణాలు తీసేస్తామని కూడా హెచ్చరించారు. అలాంటి లేఖని చదివి కూడా నేను ఇలా పోలీసు బలగాలను అడవిలోకి పంపడం ఎంతవరకూ సమంజసమని అనుకున్నారంతా. కానీ నా స్కెచ్ ఫలితం... షావుకారు ప్రాణాలతో దక్కుతాడు. ఆ క్షణానికి అది నా నమ్మకం మాత్రమే. నా ప్లాన్ బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. మనసులో షావుకారు ప్రాణాలకు అపాయం జరక్కూడదని కోరుకుంటూ అడుగు ముందుకు వేస్తున్నానే కాని నా టెన్షన్ నాకుంది. అప్పటివరకూ ఇలాంటి ఆపరేషన్స్‌లో ఎస్పీ స్థాయి వ్యక్తి నేరుగా పాల్గొనడం అదే ప్రథమం. గాల్లోకి కాల్పులు... అడవిని ఆనుకుని ఉన్న గూఢాలు దాటుకుని మధ్యలో కాసేపు ఆగి గిరిజనులు పెట్టిన రొట్టెలు తిని మళ్లీ పరుగు మొదలుపెట్టాం. నక్సల్స్‌కి సానుభూతిపరులున్నట్టే మాక్కూడా ఉంటారు కదా! వాళ్లు షావుకారుని పట్టుకుని ఎటువైపు వెళ్లింది చూసినవారల్లా చెప్పుకొచ్చారు. దాన్నిబట్టి ముందుకు కదిలాం. మధ్యమధ్యలో చిన్న చిన్న దొంగతనాలు చేసిన దొంగలు మమ్మల్ని చూసి పారిపోయేవారు. ‘మీకోసం కాదురా బాబు’ అనుకుంటూ మా పనిలో మేం నిమగ్నమైపోతుండగా నక్సల్స్‌కి కొద్దిగా దగ్గరగా వచ్చామన్న విషయం అర్థమయ్యాక అసలు ప్లాన్ అమలుపరిచాను. వైర్లెస్ సాయంతో అందరికీ ఒక ఆర్డరు జారీ చేశాను. నాన్‌స్టాప్‌గా గాల్లోకి కాల్పులు జరుపుకుంటూ ముందుకి నడవమని చెప్పాను. అడవిలో చిన్న శబ్దం కూడా చాలా గట్టిగా వినపడుతుంది. అలాంటిది వందల సంఖ్యలో తుపాకులు ఆకాశంలోకి పేలుస్తుంటే చప్పుడు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. ఎనిమిది వైపుల నుంచి తుపాకి కాల్పులు. ఒక్కసారి పేలిస్తే నాలుగుసార్లు రీసౌండ్ వస్తోంది. మావరకూ మాకే చెవులు చిల్లులు పడేలా అనిపించింది. విషయం అర్థమైంది... గిరిజనులు నక్సల్స్ వెళ్లిన మార్గం గురించి మాకు ఎలా వివరాలు చెప్పారో వారికి అంతకంటే పెద్దస్థాయిలో సానుభూతిపరులు ఉంటారు కాబట్టి వారికి కూడా మా గాలింపు విషయాలు ఎప్పటికప్పుడు అందుతుంటాయి. పైగా ఎస్పీయే రంగంలోకి దిగిన వార్త వారికి ముందుగానే అందిపోయి ఉంటుంది. సాయంత్రం ఐదు అయ్యేసరికి వారున్న ప్రాంతానికి చేరుకున్నాం. ఒక కొండదిగాక పెద్ద జలపాతం కనిపించింది. అక్కడ పెద్ద రాయి. దానిముందు శివలింగం ఉంది. అక్కడికి వెళ్లి చుట్టూ ఉన్న లోయలోకి చూస్తే పక్కనే ఒక వెడల్పాటి రాయిపై పడివున్న షావుకారు కనిపించాడు. దగ్గరికి వెళ్లిచూస్తే బాగా దెబ్బలతో ఆయాసపడుతూ ఉన్నాడు. ‘ఏంటి సంగ’తని అని అడిగితే... ఇప్పుడే నక్సల్స్ తనని అక్కడ వదిలేసి పారిపోయారని చెప్పాడు. నేను దగ్గరకి వెళ్లగానే ఓపిక కూడదీసుకుని కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పాడు. కారణం... అప్పటివరకూ డిమాండ్ నెరవేర్చకుండా ఏ ఒక్కరూ నక్సల్స్ చేతిల్లోనుంచి ప్రాణాలతో బయటపడలేదు. చుట్టుముట్టడం వల్లే... మామూలుగా ఇలాంటి కిడ్నాపింగ్ సంఘటనల్లో పోలీసులు దాడికి వస్తున్నారని తెలియగానే కిడ్నాప్‌కి గురైనవాడ్ని చంపేసి పారిపోతారు. లేదంటే అతన్ని ఎక్కడైనా దాచిపెట్టి బెదిరింపులు కొనసాగిస్తారు. కానీ ఓ సామాన్యుడ్ని కిడ్నాప్ చేస్తే ఇంత పెద్దస్థాయిలో బలగాల్ని దింపుతామని వారు ఊహించలేదు. పైగా నేను గాల్లోకి కాల్పులు జరపాలనే కాన్సెప్టుకి అర్థం ఏమిటంటే... ఒకవైపు నుంచి పోలీసులు వస్తున్నారంటే మరో వైపుకి వారు పరిగెడతారు. కానీ నాలుగువైపుల నుంచి ఫైరింగ్ చప్పుళ్లతో వస్తున్నారంటే పోలీసుల కోపం ఏ స్థాయిలో ఉందో వారికి అర్థమైపోతుంది. వాళ్లు మరో స్కెచ్ వేసుకునే అవకాశం లేకుండా సైకలాజికల్‌గా ఇబ్బందిలో పడేశాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... అప్పటికే షావుకారిని బలవంతంగా లాక్కుంటూ, కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల అతని చాలా దెబ్బలు తగిలాయి. అతన్ని చంపేసి పారిపోతే మరునిమిషం మా టార్గెట్ నక్సల్సే అవుతారు. అడవంతా జల్లెడ పట్టయినా వారిని అంతం చేస్తామని వారికి తెలుసు. అదే షావుకారిని ప్రాణాలతో వదిలేస్తే మా దృష్టి అతనిపై ఉంటుంది. పైగా బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి అతన్ని ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లే పనిలో పడతాం కదా! నా స్కెచ్ నాతో ఉన్న పోలీసువారికి ఎంతవరకూ అర్థమైందో తెలీదు కానీ, నక్సల్స్‌కి మాత్రం క్లియర్‌గా అర్థమైంది. నేను కోరుకున్నట్టుగానే షావుకారిని మార్గమధ్యంలో వదిలేసి పారిపోయారు. సీఎం అభినందన... దెబ్బలతో ఉన్న షావుకారిని మావాళ్లంతా మోసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. నక్సల్స్ చేతిలో కిడ్నాప్ అయిన వ్యక్తిని ఈ విధంగా విడిపించుకురావడం అప్పుడొక సంచలనమైంది. పోలీస్ డిపార్టుమెంట్ పేరు చెబితే నక్సల్స్ ఒక నిమిషం ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చింది. ఇక షావుకారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అప్పటి డీజీపీ కృష్ణమాచార్యులు వెంటనే ఫోన్ చేసి అభినందించారు. ఆ వెంటనే ముఖ్యమంతి ఎన్.టి రామారావుగారి దగ్గర నుంచి ఫోన్. ‘బ్రదర్...బాగుంది. కంగ్రాట్స్’ అంటూ. ఫోన్ చేసి ఊరుకోలేదు. రిటన్‌గా కమండేషన్స్(రాతపూర్వక ప్రశంస) పంపించారు. ఆ సందర్భంగా ‘ఎస్పీ స్వయంగా ఇలాంటి ఆపరేషన్స్‌లో పాల్గొంటే ఫలితాలెలా ఉంటాయనేందుకు ఈ కేస్ ఒక ఉదాహరణ’ అని డీజీపీ కృష్ణమాచార్యులు అన్నమాట డిపార్టుమెంట్లోకి వచ్చేవారికి ఒక పాఠంలాంటిది! రిపోర్టింగ్: భువనేశ్వరి