breaking news
Nido Taniam
-
ఈశాన్యవాసుల క్షేమమే పార్లమెంట్ కాంక్ష
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తానియా హత్యను లోక్‌సభ బుధవారం ఖండించింది. యువకుని మరణాన్ని యావత్ భారతదేశం ఖండిస్తోందని, ఈశాన్య ప్రాంతవాసులను రక్షించాలని పార్లమెంటు ఆకాంక్షిస్తోందన్న విస్పష్ట సందేశం దేశ ప్రజల్లోకి వెళ్లాలని స్పీకర్ మీరా కుమార్ చెప్పారు. సిగ్గుచేటు ఘటన: సుష్మాస్వరాజ్నిడో హత్య అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తిన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ఈ ఘటనను సిగ్గుచేటుగా అభివర్ణించారు. నిడో మరణంతోపాటు ఇద్దరు మణిపురి యువతుల వేధింపుల ఘటననూ ఆమె సభలో ప్రస్తావించారు. ఈశాన్య ప్రాంతవాసులపట్ల వివక్షను రూపుమాపాలని ఆమె కోరారు. ఢిల్లీవాసులు దేశంలోని వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈశాన్య ప్రాంతాల విద్యార్థుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈశాన్య ప్రాంతవాసులను రక్షించవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు చేస్తూ కూర్చుంటున్నాయని పరోక్షంగా కేజ్రీవాల్‌ను విమర్శించారు. ఈశాన్య ప్రాంత విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల వారితో కలిసి నివసించేందుకు వీలుగా హాస్టల్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. చర్యలకు వామపక్షాల డిమాండ్... వామపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తి నేరస్తులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ప్రాంతవాసుల పట్ల జాతివివక్షను ఆపండి అని రాసిఉన్న పోస్టర్‌ను వారు ప్రదర్శించారు. ఈశాన్య ప్రాంత విద్యార్థుల పట్ల జాతి వివక్ష తీవ్రమైన అంశమని, దానిని రూపుమాపాలని మైనారిటీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి నినాంగ్ ఎరింగ్ అన్నారు. నీడో మరణాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. ఇటువంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు కఠిన చట్టం తేవాలని ఆయన కోరారు. జేడీయూ నేత శరద్ యాదవ్ ఈ అంశంపై మాట్లాడుతూ... ఇది దేశ ఐక్యతకు సంబంధించిన విషయమని, ఎవరికీ అన్యాయం జరగకూడదని అన్నారు. నిడోను చంపిన నిందితులెవరో ఇప్పటికీ పోలీసులు గుర్తించలేదని సభ దృష్టికి తెచ్చారు. తాజా నివేదికివ్వండి: హైకోర్టు నగరంలో నిడో తానియా మరణంపై తనంతటతానుగా విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు... ఢిల్లీ పోలీసులు సమర్పించిన నివేదికను బుధవారం తోసిపుచ్చింది. మృతుడి పోస్ట్‌మార్టమ్‌కు సంబంధించిన అన్ని వివరాలతోపాటు తాజా నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. నత్తనడకన దర్యాప్తు జరుపుతున్న తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. ఐదుగురు సభ్యులతో కమిటీ.. నగరంలో ఈశాన్య వాసుల సమస్యలను పరిశీలించడం కోసం హోం మంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. నిడో మరణంపై న్యాయ దర్యాప్తుకు కూడా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. -
నిడో హంతకులపై కఠిన చర్యలు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిడో తనియ (19) హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. దోషులను కఠినంగా శిక్షించడానికి సాధ్యమైనంత కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై చర్చించడానికి కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి నినొంగ్ ఎరింగ్ నేతృత్వంలోని ఈశాన్య ప్రాంత విద్యార్థుల బృందం ప్రధానితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ‘నిడో మరణానికి అసలు కారణమేంటో పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుంది. ఇతని హత్య తరువాత హింస జరగడం విషాదకరం’ అని అన్నారు. ఢిల్లీలోని ఈశాన్యవాసులందరికీ పటిష్ట భద్రత కల్పిస్తామని ప్రధాని స్పష్టీకరించారు. ‘మిగతా ప్రజలందరి మాదిరే ఈశాన్యవాసులకు కూడా ఢిల్లీలో సమానస్థానం ఉంటుంది. వీళ్లంతా సురక్షిత భావనతో జీవించేందుకు మిగతా ప్రజలు కూడా సహకరించాలి. నేడు మానవతా విలువలు ప్రమాదంలో పడిపోతున్నాయి. ఐకమత్య భావన దెబ్బతింటోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులపై కఠినంగా వ్యవహరిస్తాం : కేజ్రీవాల్ అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థి నిడో తనియ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇలాంటి జాతివివక్షాపూరిత చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. నిడో హత్యకు నిరసనగా జంతర్‌మంతర్ వద్ద మంగళవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఇది వరకే మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ‘ఇది చాలా దురదృష్టకర ఘటన. ఇది కేవలం ఈశాన్య ప్రజల పోరాటమే కాదు..మనందరి పోరాటం. జాతివివక్షకు వ్యతిరేకంగా అందరం ఉద్యమించాలి. ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో ఈశాన్య రాష్ట్రాల చరిత్ర గురించి పాఠాలు కూడా ప్రవేశపెడతాం’ అని ఆయన పేర్కొన్నారు. కొందరు నేతలు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని హామీ ఇస్తున్నా ఏమీ జరగబోదంటూ పరోక్షంగా రాహుల్‌గాంధీ ప్రకటనను విమర్శించారు. నిడో హత్యను నిరసిస్తూ జంతర్‌మంతర్‌లో సోమవారం కూడా జరిగిన ఆందోళనకు హాజరైన రాహుల్ బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం నాటికి ఆందోళనకు మంత్రి మనీశ్ సిసోడియా సైతం హాజరయ్యారు. దోషులపై కఠిన చర్యలు: షిండే హామీ నిడో హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మంగళవారం ఎరింగ్ బృందానికి హామీ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరామని మంత్రి ఎరింగ్ అన్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఈశాన్యవాసుల సమస్యలను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని కూడా నియమిస్తామని తెలిపాయి. అయితే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతోపాటు ఘటనకు బాధ్యులైన ఢిల్లీ పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల బృందం హోంమంత్రిని కోరింది. ఎరింగ్ బృందం సోమవారం రాహుల్‌గాంధీని కూడా కలిసి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ముగ్గురు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ నిడో హత్య కేసులో అరెస్టయిన ముగ్గురికి స్థానిక కోర్టు ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిందితులు సుందర్‌సింగ్, పవన్ ఫర్మానియా, ఫర్మాన్‌ను జైలుకు తరలించాల్సిందిగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పవన్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, వీరిలో ఇద్దరు మైనర్లని పోలీసులు తెలిపారు. నిడో పోస్టుమార్టం తుది నివేదికను ఎయిమ్స్ ఇంకా అందజేయలేదని పేర్కొన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోన్న నిడో తానియ జనవరి 29న లజ్‌పత్‌నగర్‌లోని మిత్రుని ఇంటికి బయలుదేరాడు. ఏ బ్లాక్‌లో నివసించే మిత్రుని ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవడానికి అదే బ్లాకులోని ఓ మిఠాయి దుకాణంలో అడిగాడు. దుకాణంలో కూర్చున్న ఇద్దరు సోదరులు ఫర్మాన్, రిజ్వాన్ తన జుట్టును చూసి గేలి చేయడం నిడో తనియంకు కోపం తెప్పించింది. దాంతో ఫర్మాన్, రిజ్వాన్‌తో వాదనకు దిగాడు. కోపం ఆపుకోలేక దుకాణం గ్లాసును బద్దలుకొట్టాడు. దానితో ఫర్మాన్, రిజ్వాన్ , మరికొందరు కలిసి నిడోను చితకబాదారు. దెబ్బలు తిన్న నిడో పోలీసులు, తన మిత్రులకు ఫోన్ చే శాడు. ఘటనా స్థలానికి చేరుకు న్న మిత్రులు కూడా స్థానికులతో ఘర్షణకు దిగారు. మరునాడు ఉదయం గ్రీన్‌పార్క్ ఎక్స్‌టెన్షన్‌లోని గదిలో ఈ యువకుడి మృతదేహం కనిపించింది. -
నిడో తానియం మృతిపై 'సిట్' దర్యాప్తు
దేశ రాజధానిలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి నిడో తానియం (19) మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ దర్యాప్తు బృందాన్ని సౌత్ ఈస్ట్ డీసీపీ పి.కరుణాకరన్ పర్యవేక్షించనున్నారని తెలిపారు. అయితే ఆ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన నిందితుల కోసం హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. గత బుధవారం లజ్‌పత్ నగర్‌లోని స్వీట్ షాప్‌లో నిడో తానియంపై దాడి జరిగింది. ఆ మరునాడు అతడు మరణించాడు. దాంతో నిడో తానియం మృతిపై విచారణ జరపాలని హస్తినలోని జంతర్ మంతర్ వద్ద ఈశాన్యరాష్ట్రవాసులతోపాటు స్థానికులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళనకారులను పరామర్శించారు. ఆ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని ఆందోళనకారులకు ఆయన హామీ ఇచ్చారు. రాహుల్ అక్కడి నుంచి వెళ్లిన గంటకే సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసుల ప్రకటించడం గమనార్హం. నిడోతానియం మృతిపై నిరసనకు దిగిన ఆందోళనకారులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. నిడో తానియం మృతిపై విచారణ వేగవంతం చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిడో తానియం మృతిపై మంగళవారం న్యూఢిల్లీలో జరిగే ధర్నాలో కేజ్రీవాల్ పాల్గొనున్నారు.