breaking news
Nellore Central Jail
-
మారిపోయాడనుకున్నారు.. మాయమైపోయాడు!
నెల్లూరు: క్షణికావేశంలో హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో పదేళ్లకు పైగా జిల్లా జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. స్రత్పవర్తన ఖైదీగా పేరు తెచ్చుకున్నాడు. స్రత్పవర్తనతో విడుదలయ్యే ఖైదీల జాబితాలో పేరు కూడా ఉంది. అంతలోనే జైలు నుంచి పరారై ఇన్నాళ్లుగా సంపాదించుకున్న సత్ప్రవర్తన పేరును పోగొట్టుకున్నాడు. సంగం మండలం గాం«దీగిరిజన సంఘం గ్రామానికి చెందిన చౌడయ్య, పుల్లయ్య, జంగాలపల్లి నాంచారయ్య (25) 2011 జనవరి 16న సంక్రాంతి పండగల సమయంలో సాయంత్రం 5 గంటల సమయంలో సరదాగా పేకాట ఆడుతున్నారు. ఇంతలో ఇండ్ల సురేష్ అక్కడికి వెళ్లి తాను ఆడుతానని చెప్పాడు. మధ్యలో పుల్లయ్య వెళ్లిపోయాడు. మిగతా ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేష్ క్షణికావేశంలో కత్తితో నాంచారయ్యను పొడిచాడు. దీంతో నాంచారయ్యను భార్య అరుణతోపాటు కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్యం కోసం బుచ్చిరెడ్డిపాళెం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంగం పోలీసులు అదే రోజు రాత్రి ఇండ్ల సురేష్‌పై హత్య కేసు నమోదు చేశారు. కోర్టులో కేసు విచారణ జరగ్గా, నిందితుడు ఇండ్ల సురేష్‌పై నేరారోపణ రుజువు అయింది. ఈ క్రమంలో అతనికి జీవిత ఖైదు విధిస్తూ 2015 మార్చిన 9న తీర్పు వెలువడింది. అప్పటి నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా ఉన్నాడు. స్రత్పవర్తన ఖైదీగా ఉండడంతో జైలు అధికారులు సైతం అతనికి ఓపెన్ జైలు పనులు అప్పగించారు. తాజాగా మూడు రోజుల క్రితం సైతం అతని కుటుంబ సభ్యులతో ములాఖత్ ద్వారా మాట్లాడారు. ఇంతలోనే అతను మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్ర కారాగారం నుంచి తప్పించుకుని పరారీ అయ్యాడు. జైలు అధికారులు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు గాం«దీజన సంఘం చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు. అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు పదేళ్లకు పైగా జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సురేష్ స్రత్పవర్తన ఖైదీగా త్వరలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని, అంతలోనే ఇలా జరగడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
మాజీ సీఎంపై దాడి కేసులో మావోయిస్టుకు రిమాండ్
నెల్లూరు: మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కాన్వాయిపై దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ ఆదివారం రిమాండ్ విధించారు. దీంతో దీపక్‌ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్కత్తా జైల్లో ఉన్న దీపక్‌ను పీటీ వారెంట్‌పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. జిల్లాలోని కోట మేజిస్ట్రేట్ ముందు దీపక్‌ను ఈ రోజు పోలీసులు హాజరుపరిచారు. దీంతో అతడికి రిమాండ్ విధించారు. 2007 సెప్టెంబర్ మాసంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ అందజేసే డాక్టరేట్ అందుకునేందుకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య అప్పటి మంత్రి ఎన్.రాజ్యలక్ష్మి తమ కాన్వాయిలో వెళ్తున్నారు. ఆ సమయంలో వాకాడు సమీపంలో ఆయన క్వాన్వాయిని మావోయిస్టులు పేల్చివేశారు. ఆ పేలుడులో కారు డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.