breaking news
military spending
-
రికార్డు స్థాయికి ప్రపంచ సైనిక వ్యయం
ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2024లో ప్రపంచ దేశాలు సైన్యానికి 2.7 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. గాజా, ఉక్రెయిన్లపై యుద్ధం నేపథ్యంలో ముఖ్యంగా యూరప్, మధ్యప్రాచ్యంలో ఈ సైనిక వ్యయం అధికంగా పెరిగింది. తాజా వివరాలను స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. యూరప్‌లో ఊహించని పెరుగుదల యూరప్ దేశాల్లో (రష్యాతో సహా) సైనిక వ్యయంలో అధిక పెరుగుదల కనిపించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం, నాటో కూటమి పట్ల అమెరికా నిబద్ధతపై సందేహాల మధ్య 17 శాతం పెరుగుదల నమోదైంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు సమయంలో సైనిక వ్యయాన్ని మించిపోయింది. ఇక రష్యా సైనిక వ్యయం 2024లో 149 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది 2023తో పోలిస్తే 38 శాతం పెరిగింది. ఇది రష్యా జీడీపీలో 7.1 శాతం. మొత్తం ప్రభుత్వ వ్యయంలో 19%. ఉక్రెయిన్ మొత్తం సైనిక వ్యయం 2.9 శాతం పెరిగి 64.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది రష్యా వ్యయంలో 43 శాతం కాగా, ఆ దేశ జీడీపీలో 34 శాతం. 2024లో అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశం ఉక్రెయిన్. రష్యా చేస్తున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రస్తుతం తన పన్ను ఆదాయం మొత్తాన్ని సైన్యానికి కేటాయిస్తోంది. జర్మనీ కూడా సైనిక వ్యయాన్ని బాగానే పెంచింది. 28 శాతం పెరిగి, 88.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఇది భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో నాల్గో అతి పెద్ద దేశంగా నిలిచింది. పునరేకీకరణ తరువాత జర్మనీ ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. వ్యయాన్ని పెంచిన చైనా సైన్యానికి భారీగా ఖర్చు చేసే ప్రపంచంలోనే రెండో దేశమైన చైనా సైతం తన సైనిక బడ్జెట్‌ను పెంచింది. 7.0 శాతం పెరుగుదలతో చైనా సైనిక వ్యయం 314 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తన సైన్యాన్ని ఆధునీకరించడానికి, సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలు పెంచుకోవడానికి, అణ్వాయుధాల విస్తరణలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది. ఆసియా మొత్తం సైనిక వ్యయంలో సగం వాటాను చైనానే కలిగి ఉంది. తగ్గేదే లేదన్న అమెరికా ప్రపంచ పెద్దన్న అమెరికా కూ సైనిక వ్యయంలో వెనుకబడలేదు. మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా వాటా 37 శాతం గమనార్హం. ఇక 2024లో మొత్తం నాటో వ్యయంలో 66 శాతం ఆమెరికా పెట్టుబడులే. 2024లో 5.7 శాతం పెంచడంతో ఆ దేశ సైనిక వ్యయం 997 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా నేతృత్వంలోని కూటమిలోని 32 సభ్యదేశాల మొత్తం సైనిక వ్యయం 1.5 ట్రిలియన్లకు పెరిగింది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిన దేశాలు అస్థిర, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తమ శక్తిని, పలుకుబడిని చాటుకునేందుకు సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ డేటా ప్రకారం అమెరికా, చైనా, రష్యా, భారత్, సౌదీ అరేబియాలు తమ సైనిక శక్తికి అత్యధిక బడ్జెట్ కేయటాంచిన మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యూఎస్ – 895 బిలియన్ డాలర్లు చైనా – 266.85 బిలియన్ డాలర్లు రష్యా – 126 బిలియన్ డాలర్లు భారత్ – 75 బిలియన్ డాలర్లు సౌదీ అరేబియా – 74.76 బిలియన్ డాలర్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
అధిక మిలటరీ వ్యయం అమెరికాదే
న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌ల నుంచి అమెరికా సైనిక ఉపసంహరణ ప్రారంభం అయిన నాటి నుంచి మొట్టమొదటి సారిగా ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం కాస్త పెరిగింది. అంటే 2011 తర్వాత తొలిసారిగా గతేడాది ప్రపంచ సైనిక వ్యయం ఒక శాతం పెరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ మిలటరీ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నది ప్రపంచ దేశాల్లో అమెరికానే. గతేడాది వ్యయం గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ 600 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది అమెరికా. 215 డాలర్లు ఖర్చు పెట్టిన చైనా రెండో స్థానంలో ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తితో పోలిస్తే మాత్రం సైనిక వ్యయంలో అమెరికా వెనకబడే ఉంది. ఈ విషయంలో అన్ని దేశాలకన్నా సౌదీ అరేబియా ముందుంది. సౌదీ అరేబియా జాతీయ స్థూల ఉత్పత్తిలో 13.5 శాతాన్ని మిలటరీపై ఖర్చు పెడుతుండగా, అమెరికా తన జాతీయ స్థూల ఉత్పత్తిలో 3.3 శాతం ఖర్చు పెడుతున్నది. చైనా 1.9 శాతం ఖర్చు పెడుతున్నది. 5.4 శాతంతో రష్యా రెండో స్థానంలో, 3.3 శాతంతో అమెరికా మూడో స్థానంలో, 2.6 శాతంతో దక్షిణ కొరియా నాలుగో స్థానంలో, 2.3 శాతంతో భారత్ ఐదవ స్థానంలో, 2.1 శాతంతో ఫ్రాన్స్ ఆరవ స్థానంలో, రెండు శాతంతో బ్రిటన్ ఏడవ స్థానంలో, 1.9 శాతంతో చైనా ఎనిమిదవ స్థానంలో, 1.2 శాతంతో జర్మనీ తొమ్మిదవ స్థానంలో, 1.0 శాతంతో జపాన్ పదవ స్థానంలో ఉంది. రష్యాతో కలుపుకొని తూర్పు యూరప్‌లోనే మిలటరీ వ్యయం ఎక్కువగా పెరగ్గా ప్రపంచంలోని మిగతా అన్ని రీజియన్లలో తగ్గింది. ఈ పెరుగుదల ఏకంగా 7.5 శాతం ఉంది. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లోనే సైనిక వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఆసియా, ఓసినియాలో ఐదు శాతం పెరిగింది. సాధారణంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మిలటరీపై ఎక్కువ ఖర్చు పెట్టేవి. అయితే ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడ్డ నాటి నుంచి ఈ దేశాలు సైనిక వ్యయాన్ని తగ్గిస్తూ వచ్చాయి. ఈసారి అన్ని దేశాలకన్నా ఆఫ్రికా తన సైనిక వ్యయాన్ని ఐదు శాతం తగ్గించుకున్నట్లు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.