breaking news
Manohar Aich
-
‘ మిస్టర్ యూనివర్స్’ మనోహర్ కన్నుమూత
1952లో టైటిల్ సొంతం రెండో భారత బిల్డర్‌గా రికార్డు కోల్‌కతా: ఎత్తు చూస్తే 4 అడుగుల 11 అంగుళాలు... కానీ కండలు చూస్తే కొండల్ని మించిపోయేవి. బాడీ సైజ్ బాహుబలిని తలదన్నే స్థాయి. భారత్‌లో బాడీ బిల్డింగ్‌కు పెద్దగా ప్రాముఖ్యం లేని పాత రోజుల్లోనే అంతర్జాతీయ యవనికపై సంచలనాలు సృష్టించిన ‘పాకెట్ సైజ్డ్’ మిస్టర్ యూనివర్స్ మనోహర్ ఐచ్ (104) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బగుయాటిలోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. మనోహర్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమారుడు జిమ్, ఫిట్నెస్ సెంటర్‌ను నడుపుతూ తండ్రి కలను సాకారం చేస్తున్నాడు. 1950లో 36 ఏళ్ల వయసులో మనోహర్ తొలిసారి ‘మిస్టర్ హెర్క్యులస్’ పోటీల్లో విజేతగా నిలిచారు. 1951లో ఏకంగా ‘మిస్టర్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొన్నా... రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ లండన్‌లోనే మకాంపెట్టి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాక్టీస్ చేసి ప్రో షాట్ డివిజన్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొన్ని రోజులు బస్ కండక్టర్‌గా మారారు. సర్కస్‌ల్లో కూడా పని చేశారు. చివరకు 1952లో ‘జాతీయ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ యూనివర్స్ చాంపియన్‌షిప్ టైటిల్’ను సాధించి భారత్ తరఫున రెండో ‘మిస్టర్ యూనివర్స్’గా రికార్డులకెక్కారు. దీంతో అతని సైజ్‌ను బట్టి ‘పాకెట్ హెర్క్యులస్’గా నామకరణం చేశారు. తొలిసారి 1951లో మాంటోష్ రాయ్ (భారత్) మిస్టర్ యూనివర్స్ టైటిల్‌ను గెలిచారు. కొమిల్లా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో జన్మించిన మనోహర్... 1942లో రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. ఆ తర్వాత బ్రిటిష్ అధికారి రెబూ మార్టిన్ ప్రోత్సాహం మేరకు బాడీ బిల్డింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని అంచలంచెలుగా ఎదిగారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు మనోహర్ క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేశారు. 1991లో డమ్ డమ్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఆయన లక్షా 63 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అధిక బరువులు ఎత్తడంతో 2011లో స్వల్పంగా గుండెపోటు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. ప్రతి రోజు తన శిష్యుల పురోగతిని చూస్తూ గడిపేవారు. ఫిట్నెస్ అంటే విపరీతమైన మక్కువ చూపే మనోహర్... ఉన్నన్ని రోజులు ‘ఎలాంటి ఆందోళనలు లేకుండా క్రమశిక్షణతో, నిజాయితీగా సింపుల్‌గా జీవించు. బ్రతకడం కోసం తిను... తినడం కోసం బ్రతకకు’ అనే ఓ సిద్ధాంతంతో జీవించారు. మనోహర్ మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, క్రీడా శాఖ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా ఘనంగా నివాళులు అర్పించారు. -
మన మిస్టర్ యూనివర్స్ కు 103ఏళ్లు
మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? మనోహర్ ఎయిచ్ పేరు ఎప్పుడైనా విన్నారా..? పోనీ తొలి మిస్టర్ యూనివర్స్ టైటిల్ తొలిసారి ఎప్పుడు గెలుచుకుందో తెలుసా..? కౌన్ బనేగా కరోడ్ పతీ ప్రశ్నలేంటనుకుంటున్నారా..? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.. ఈ ఫోటోలో ఉన్న 103ఏళ్ల పెద్దాయన పేరు మనోహర్ ఎయిచ్. మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు. 1952లో మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నాడు. అంతేకాదు.. ఇప్పటికీ అంతే ఫిట్ గా ఉన్నాడు. సన్నిహితులు పాకెట్ హెర్కులస్ అని ముద్దుగా పిలుచుకునే మనోహర్ బెంగాల్ లోని చిన్నటౌన్ కొమిల్లాలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఫిట్ సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మనోహర్ మొదట రెజ్లింగ్ చేసే వాడు. 1942లో అప్పటి బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ల్ లో చేరాక.. బాడీ బిల్డింగ్ పై మక్కువ పెంచుకోవడానికి బ్రిటీష్ ఆఫీసర్ రెబ్ మార్టీన్ కారణం. ఆయనే మనోహర్ కు వెయిట్ ట్రెయినింగ్ ఇచ్చారు. అయితే స్వాతంత్ర పోరాట కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పనిచేడంతో మనోహర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలుకు వెళ్లడం తన జీవితాన్ని మలుపు తిప్పిందంటాడు మనోహర్. జైల్లో ఉన్నకాలంలో తాను బాడీ బిల్డింగ్ ను చాలా సిరియస్ గా తీసుకున్నానని వివరించాడీ నాలుగు అడుగుల 11 అంగుళాల బాడీ బిల్డర్. జైల్లో స్వంతంగా రోజుకు 12 గంటల పాటు కసరత్తులు చేసే వాడినని గుర్తు చేసుకున్నాడు. మనోహర్ పట్టుదల చూసి జైలు అధికారులు అబ్బురపడి.. తనకు ప్రత్యేక ఆహారాన్ని అందించారని చెప్పుకొచ్చాడు. 1950లో మిస్టర్ హెర్కులస్ టైటిల్ గెలిచాక.. మిస్టర్ యూనివర్స్ పోటీలపై నమ్మకం కలిగింది. తర్వాత ఏడాదే లండన్ లో జరిగిన మిస్టర్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడ రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఏడాది మరింత పట్టుదలతో సాధన చేశాడు. దీంతో మిస్టర్ యూనివర్స్ గ్రూప్ 3 ఛాంపియన్ షిప్ టైటిల్ 'మన హెర్కులస్' వశమైంది. ఇక ఆసియా క్రీడల్లో 1951(ఢిల్లీ), 1954(మనీలా), 1958(టోక్యో)ల్లో వరసగా బంగారు పతకాలు సాధించాడు. ఇప్పటికీ తన 13ఏళ్ల క్రితం కసరత్తులు చేయడం మానేసినా.. కుమారులు ఏర్పాటు చేసిన జిమ్ లో యువకులకు మెలకువలు నేర్పిస్తూ చురుగ్గా ఉన్నాడు. ధూమ పానం, మద్యపానం దూరంగా ఉంచడమే తన ఆరోగ్య రహస్యం అంటాడీ బోసినవ్వుల మిస్టర్ యూనివర్స్.