breaking news
male suicides
-
మగవారిని గమనించండి.. దేశంలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు
ఇంట్లోని వారు ఎలా ఉన్నారో గమనించాల్సిన బాధ్యత మగవాడిదని సమాజం అంటుంది. కాని ఇంటి మగవాడు ఎలా ఉన్నాడో ఎవరు గమనించాలి? ఇటీవల పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యలు వారి ఒత్తిళ్లను పట్టించుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020’ ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 70 శాతం పురుషులవైతే 30 శాతం స్త్రీలవి. కోవిడ్ కాలపు అనారోగ్యం.. ఆర్థిక సమస్యలు.. ఉద్యోగ బాధలు మగవారిని ఈ వైపుకు నెడుతున్నాయి. వారి గురించి కుటుంబం, సమాజం ఆలోచించాలి. మన దేశంలో రోజుకు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో తెలుసా? రోజుకు దాదాపు 419. 2020లో మొత్తం ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో తెలుసా? 1,53,052. వీటిలో పురుషుల సంఖ్య 1,08,532 (70 శాతం). స్త్రీలు 44, 498 (30 శాతం). అంటే స్త్రీల కంటే రెట్టింపు సంఖ్యలో పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలు సున్నిత స్వభావులు, భావోద్వేగాలకు తొందరగా లోనవుతారు అనుకుంటాము. కాని పురుషులే ఇప్పుడు సున్నితంగా ఉన్నారు. జీవితాన్ని ఎదుర్కొనలేకపోతున్నారని ఈ సర్వే మనకు తెలియచేస్తోంది. స్త్రీలైనా పురుషులైనా ప్రాణం అత్యంత విలువైనది. అయితే స్త్రీలు తమ ఆందోళనను ఏదో ఒక విధంగా బయటపెట్టి నలుగురికి తెలిసేలా చేస్తారు. కాని పురుషుడు తన లోలోపల అదిమి పెట్టుకుంటాడు. తీరా నష్టం జరిగిపోయాకే అతడి మనసులో ఎంత వత్తిడి ఉన్నదో మనకు తెలుస్తుంది. దీనిని బట్టి ఇంట్లోని భర్తను, తండ్రిని, సోదరులను గమనించుకోవాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబ సభ్యులపై ఉందని తెలుస్తోంది. కోవిడ్ అనంతరం 2020 ప్రారంభంలోనే కోవిడ్ మహమ్మారి రావడం, ఫలితంగా నిరుద్యోగం, ఆర్థిక అభద్రత, మానసిక ఆందోళన... ఇవన్నీ పురుషుల ఆత్మహత్యలకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే దీని వెనుక సంఘం పెట్టిన ఇమేజ్ కూడా కారణమే. పురుషుడంటే సమర్థుడిగా ఉండాలి, ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలి, తెగింపుతో ఉండాలి ఇలాంటి స్టీరియోటైప్ ఆలోచనలను ఇచ్చింది సంఘం. ఏడ్చే మగాళ్లను నమ్మొద్దంది. కాని పురుషుడు ఒత్తిడిలో ఉంటే ఏం చేయాలి? కష్టం చెప్పుకుంటే చేతగానివాడనుకుంటే ఎలా? ఆత్మహత్య చేసుకోవడమేనా దారి? కొందరు పురుషులు అదే చేస్తున్నారు. పనిచేసే చోట అవమానాలు 2020లో పురుషులలో జరిగిన ఆత్మహత్యలను పరిశీలిస్తే పని ప్రదేశంలో అవమానాలు కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ఆ సంవత్సరం పనిచేసేచోట అవమానాల వల్ల దేశంలో మొత్తం 1847 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పురుషులు 1602 (87 శాతం). స్త్రీలు 234 (12 శాతం). అంటే రోజుకు సగటున ఐదు ఆత్మహత్యలు దేశంలో పని ప్రదేశంలో వేధింపుల వల్ల జరుగుతున్నాయి. వీటిలో మూడు నుంచి నాలుగు పురుషులవి. బాస్లు అవమానించడం, జీతాల పెంపులో తేడా, ప్రమోషన్లలో తరతమ భేదాలు ఇవన్నీ మగవాళ్లను కుంగదీసి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయి. స్త్రీలకు లైంగిక వేధింపులు ప్రధాన కారణం అవుతున్నాయి. అలాగే పని దొరకడం లేదన్న బాధతో కూడా పురుషులు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భరోసా ఇవ్వాలి తండ్రి, భర్త, సోదరులతో మాట్లాడండి. వారి ఉద్యోగం, వ్యాపారం, వృత్తి... వీటిలో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోండి. ఆరోగ్యం గురించి ఆరా తీయండి. సమస్య ఉంటే బలవంతంగానైనా హాస్పిటల్కు తీసుకెళ్లండి. ఆర్థిక సమస్యలు తెలుసుకోండి. అప్పులేమైనా ఉన్నాయా కూపీ లాగండి. పరిస్థితి ఎలా ఉన్నా వారి వల్ల ఏదైనా తప్పు జరిగి ఉన్నా నిందించకండి. నిలదీయకండి. సపోర్ట్ చేస్తామని చెప్పండి. ఒత్తిడి ఉంటే విశ్రాంతి తీసుకోమని చెప్పండి. ఉద్యోగం మారాలనుకుంటే మారమని, లేదంటే మానేసి కొంతకాలం బ్రేక్ తీసుకోమని, మరేం పర్వాలేదని దిలాసా ఇవ్వండి. మిత్రులతో, క్లోజ్ఫ్రెండ్స్తో మాట్లాడించండి. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం ప్రాణాంతకం. -
ఆత్మహత్యల్లోనూ మగవాళ్లదే పైచేయి
ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నా ఇప్పటికీ సమాజంలో పురుషాధిక్యతే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల్లో కూడా పురుషుల ఆధిక్యతే కొనసాగుతోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, వారిలో 5 లక్షల మందికిపైగా పురుషులే ఉంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఏటా సరాసరి 13 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండగా అందులో 6 వేల మంది మహిళలు ఉంటున్నారు. భారత్ లాంటి దక్షిణాసియా దేశాల్లో మహిళల కన్నా రెట్టింపు సంఖ్యలో పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక దౌర్బల్యం, వివిధ రకాల ఒత్తిడులు, పేదరికం లాంటి సామాజిక సమస్యలు, కెరీర్లో వెనుకబడిపోతున్నామన్న ఆందోళన, ఇతర సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడంలో విఫలమవడం, సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉండడం వల్ల ఏర్పడుతున్న ఆత్మన్యూనతా భావం తదితర కారణాల వల్ల ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇప్పటివరకు సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తూ వచ్చారు. ఆడవాళ్ల కన్నా మగవాళ్లే ఎందుకు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే కోణం నుంచి ఏ శాస్త్రవేత్త పెద్దగా అధ్యయనం చేయలేదు. గత 20 ఏళ్లుగా ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్న లండన్లోని 'ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సూసైడ్ రీసెర్చ్' చేసిన తాజా అధ్యయనంలో 'సోషల్ పర్ఫెక్షనిజం' అనే కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సమాజం దృష్టిలో తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వహిస్తున్నానా, లేదా అన్న కోణంలో ఎప్పుడూ ఆలోచించే ఓ వ్యక్తి, తాను నిజంగా ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదనే ఆత్మన్యూనతా భావానికి గురైనప్పుడు ఆత్మహత్యను ఆశ్రయిస్తాడని ఆ అకాడమీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రోరీ కార్నర్ తెలిపారు. తనకు దగ్గరగా ఉండే బంధు మిత్రుల దృష్టిలో ఓ కుటుంబ పోషకుడిగా, ఓ అన్నగా, ఓ తండ్రిగా, ఓ ఉద్యోగిగా అంచనాల మేరకు సరైన బాధ్యత పోషించకపోతే పలు రకాల మానసిక ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్య దిశగా ఎక్కువగా ఆలోచిస్తాడని ఆయన వివరించారు. కొంత మంది కెరీర్లో ఓటమిని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. రోరీ కార్నర్ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకున్న ఇతర సామాజిక సాస్త్రవేత్తలు ఆడవాళ్లలో 'సోషల్ పర్ఫెక్షనిజం' తక్కువగా ఉంటోందని అభిప్రాయపడ్డారు. పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కులు కల్సిస్తున్న పాశ్చాత్య దేశాల్లో కూడా మగవాడే కుటుంబ పెద్దగా ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తున్నారని వారు అంటున్నారు. అంటే పురుషాధిక్య సమాజం మూలాలు అక్కడ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోలేదన్నమాట. ప్రపంచంలో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్న దేశాల్లో దక్షిణ కొరియా ముందుండగా, బ్రిటన్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్న చైనాలో ఇప్పుడు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అత్యధిక గంటలు పనిచేస్తున్న కార్మికులు, అవినీతి కేసుల్లో దొరికిపోయిన పారిశ్రామికవేత్తలే ఇప్పుడు చైనాలో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. అవినేతి కేసుల్లో నేరం రుజువైతే ఆ దేశంలో మరణశిక్ష విధిస్తారు. ఆత్మహత్యకు పాల్పడితే కుటుంబ సభ్యులపై ఎలాంటి కేసు ఉండదు. తప్పించుకునేందుకు మరో మార్గం ఎటూ ఉండదు గనుక కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఆత్మహత్య చేసుకోవడమే శ్రేయస్కరమని వారి భావిస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.