Lingaraju
-
ఇళ్లకు వెళ్లి మరీ సేవలు చేశాం
క్యాన్సర్‌తో పోరాడుతూ చివరిదశలో ఉన్నవారికి స్వస్థత చేకూర్చుతుంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్. కోవిడ్ టైమ్‌లో క్యాన్సర్ పేషంట్లకు సేవలు అందించడానికి, బయటి నుంచి వచ్చిన పేషంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పడానికి ఒక బృందంగా తామంతా ఎలా సిద్ధమయ్యారో హాస్సిస్ అడ్మినిస్ట్రేటర్ శారద లింగరాజు వివరించారు.‘‘ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామా, మన వరకే బతుకుతున్నామా.. అనే నిజాలు వెలుగులోకి వచ్చేది. మేం అందించేది ఎమర్జెన్సీ కేర్ కాదు. చనిపోయేదశలో ఉన్నవారికి ఉపశమనాన్ని ఇవ్వడం. కోవిడ్ సమయంలో అప్పటికే అంతటా భయాందోళనలు. ఎవరి వల్ల ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరు సాయంగా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని, మేం ‘చేయలేం’ అని చెప్పవచ్చు. చేయూతనివ్వలేమని వదిలేయచ్చు. హాస్పిస్ తలుపులు మూసేయచ్చు. కానీ, మానవతా ధర్మంగా చూస్తే వారిని అలా వదిలేయడం సరికాదు అనిపించింది. అందుకే, క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ కొన ఊపిరితో ఉన్నవారిని తీసుకువస్తే వారికి ‘లేదు’ అనకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చేతనైన సేవలు అందించాం.నేరుగా వారి ఇళ్లకే..క్యాన్సర్ పేషంట్స్‌కి వారి స్టేజీలను బట్టి పెయిన్ ఉంటుంది. సరైన మందులు అందక వారు బాధపడిన సందర్భాలు ఎన్నో. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మందులను వారి ఇళ్లకే వెళ్లి అందజేశాం. వారికి కావల్సిన స్వస్థతను ఇంటికే వెళ్లి అందించాం. ఈ సేవలో పాలిచ్చే తల్లులైన నర్సులూ పాల్గొన్నారు. ఆయాలు పేషంట్స్‌కు దగ్గరగా ఉండి, సేవలు అందించారు. పేషంట్స్ చనిపోతే అప్పటికప్పుడు బాడీ తీసేయమని చెప్పినవారున్నారు. కనీసం వారి పిల్లలు వచ్చేంత టైమ్ ఇవ్వమన్నా కుదరదనేవారు. వాళ్లు కోవిడ్‌తో కాదు క్యాన్సర్‌తో చనిపోయారు అని కన్విన్స్ చేయడానికి టైమ్ పట్టేది.వీడియోలలో దహన సంస్కారాలు.. ఒక బెంగాలియన్ క్యాన్సర్ చివరి దశలో చనిపోయాడు. మృతదేహాన్ని హాస్పిస్ నుంచి వారి స్వస్థలానికి తీసుకువెళ్లాలి. కోవిడ్ కాకుండా క్యాన్సర్‌తో చనిపోయాడనే లెటర్‌తో పాటు అంబులెన్స్‌ను సిద్ధం చేయించి పంపాం. వాళ్లు కూడా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు వెళ్లి దహనసంస్కారాలు చేయించి వచ్చారు. మా దగ్గర సేవ పొందుతున్న వారు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వారి పిల్లలు రాలేని పరిస్థితి. అందువల్ల దహన సంస్కారాలు చేసే సమయంలోనూ, ఆ తర్వాత వారికి వీడియోలు చూపించేవాళ్లం. పసుపు, కుంకుమలు, చెట్లకు ఉన్న కాసిన్ని పూలు పెట్టి సాగనంపేవాళ్లం. వారి ఏడుపులు, మేం సమాధాన పరచడం.. ఆ బాధ.. ఆ సందర్భంలో ఎలా తట్టుకున్నామో.. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక యజ్ఞంలా చేశామనిపిస్తోంది.ప్రతి వారిలోనూ మంచితనాన్నే చూశాం..ఒక తల్లి చనిపోయే చివరి దశ. ఆమె కొడుకు తల్లిని చూడటానికి జార్ఖండ్ నుంచి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండేవాడు. రెండు మూడుసార్లు బైక్ మీద వచ్చాడు. కొడుకును చూడాలని ఆ తల్లి ప్రాణం కొట్టుకులాడేది. కొడుకు చూసి వెళ్లిన పది నిమిషాల్లో ఆమె చనిపోయింది. నిజంగా జబ్బు ముదిరిపోయి చివరిదశలో ఉంటే ఆ కష్టాన్ని ఒకలా చూస్తాం. కానీ, కోవిడ్ భయంతో చుట్టూ ఉన్న మానవసంబంధాల కష్టం అప్పుడే చూశాం. తమ వారిని చూసుకోవడానికే కాదు, బాడీని తమ స్వస్థలాలకు చేర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. డబ్బు కాదు బంధాలే ముఖ్యం అనిపించాయి ఆ రోజులు. చివరి రోజుల్లో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు కోవిడ్ టైమ్‌లో ఏ దారీ లేదనే పరిస్థితుల్లో కూడా ‘మేం ఉన్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చాం. ప్రతి వాళ్లలో మంచితనాన్ని చూశాం’ అని గడిచిన కాలపు జ్ఞాపకాలలోని మానవతను కళ్లకు కట్టారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
లింగరాజుకు పస్తులు
► నియోగుల మధ్య తలెత్తిన విభేదాలు ► స్వామికి అందని సేవలు భువనేశ్వర్: దైవానుగ్రహం కోసం భక్తులు ఉపవాసం చేయడం ఆనవాయితీ. నగరంలోని ఏకామ్ర క్షేత్రంలో కొలువుదీరిన లింగరాజు మహా ప్రభువు నిత్య నైవేద్యాలు అందక పస్తు ఉండాల్సిన పరిస్థితులు చోటుచేసుకోవడం నివ్వెరపరుస్తుంది. రెండు వర్గాల నియోగుల మధ్య విభేదాలతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం వారుణి మహా స్నానం సేవ పురస్కరించుకుని రెండు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా స్వామికి నిర్వహించాలి్సన పల్లకి సేవకు అంతరాయం ఏర్పడింది. తదనంతరం నిర్వహించాలి్సన సేవాదులు నిరవధికంగా స్తంభించిపోయాయి. శనివారం సాయంత్రం నుంచి ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. బ్రాహ్మణ నియోగులు, బొడు నియోగుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దేవస్థానంలో సేవాదులకు సంబంధించి అధికార వర్గం స్పష్టమైన వేళల్ని జారీ చేయనందున ఇటువంటి దయనీయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. నియోగుల మధ్య బిగుసుకుంటున్న వివాదం పరిష్కరించేందుకు లింగరాజ్ దేవస్థానం అధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్టు కార్యనిర్వహణ అధికారి మనోరంజన్ పాణిగ్రాహి తెలిపారు. మహా వారుణి స్నాన సేవ నిర్వహించేందుకు పల్లకి సేవ ముందుగా చేయాల్సి ఉంటుంది. పల్లకి సేవకు బ్రాహ్మణ నియోగులు అడ్డు తగలడంతో వివాదం చోటుచేసుకున్నట్టు బొడు నియోగుల సంఘం కార్యదర్శి కమలాకాంత బొడు తెలిపారు. -
మక్కలు.. కుప్పలు తెప్పలు
అంతన్నాడింతన్నాడే లింగరాజ... అన్నట్లుగా ఉంది మార్క్‌ఫెడ్ పరిస్థితి. అట్టహాసంగా 62 కొనుగోలు కేంద్రాలను తెరచిన మార్క్‌ఫెడ్ అధికారులు ఒక్క గింజనూ పక్కకు పోనీయమంటూ గొప్పలు పోయారు...కొనుగోళ్లలో మెతుకుసీమ ఫస్ట్ంటూ కితాబిచ్చేశారు..రైతుల తరఫున వారే సంబరపడ్డారు. ఇంకా జూళ్లు తీయని మక్కలు చేలల్లో ఉండగానే కొనుగోలు కేంద్రాలన్నీ మూసేశారు. ప్రస్తుతం గజ్వేల్ మార్కెట్‌యార్డులోనే కొనుగోళ్లు జరుగుతుండడం..మక్కలు కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇక కేంద్రాన్ని కూడా 31 తర్వాత మూసివేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డుకు మక్కలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. జిల్లా రైతులు పండించిన మక్కలను పూర్తిగా కొనకుండానే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలన్నీ ఎత్తేయడం కేవలం గజ్వేల్‌లోని లావాదేవీలు నడుపుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని తొగుట, దౌల్తాబాద్, చేగుంట తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వెల్లువలా వస్తున్నాయి. అయినా శుభ్ర పరిచే మిషన్ల కొరత, కాంటాల కొరత కారణంగా రైతులు కొట్లాటలకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయి నిల్వలు పేరుకుపోయాయి. మక్కల కొనుగోళ్లలో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచామంటూ మార్క్‌ఫెడ్ గొప్పలు చెప్పుకుంటున్న వేళ...గజ్వేల్‌లో రైతులకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని దుస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఒక్క కేంద్రాన్ని సైతం 31వ తేదీ నాటితో ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 62 సెంటర్లు...అయినా తప్పని అవస్థలు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.07 లక్షల హెక్టార్లలో(2.67లక్షల ఎకరాలు) మొక్కజొన్న సాగైంది. ఈసారి రైతులు మొక్కజొన్నపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తీవ్ర వర్షాభావంతో ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. అయినప్పటికీ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు జిల్లాలో 62కిపైగా కొనుగోలు కేంద్రాలను తెరిచారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంట సాగు ఆలస్యం కావడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఐకేపీ, సహకార సంఘాల కేంద్రాల ద్వారా కేవలం 4.99 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా చాలా ప్రాంతాల్లో మక్కలు చేలల్లోనే ఉన్నప్పటికీ జిల్లాలోని చాలా కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ఎత్తివేసింది. ‘సాక్షి’ కథనంతో గడువు పొడిగింపు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లాగే గజ్వేల్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎత్తివేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 20న గజ్వేల్ కేంద్రాన్ని మూసే వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఈనెల 16న ‘చేతులేత్తుసిన మార్క్‌ఫెడ్’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికారులు గజ్వేల్ కేంద్రాన్ని 10 రోజులు పొడిగించారు. ఇప్పటికే జూళ్లు తీయని మక్కలు చేలల్లోనే ఉన్నాయి. ఉత్తుత్తి ప్రకటనలో ఊదరగొట్టారు కొనుగోళ్లలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టామని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించుకుంటున్న వేళ...గజ్వేల్‌లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లా అంతా కొనుగోలు కేంద్రాలను మూసివేసి గజ్వేల్ సెంటర్‌ను మాత్రమే నడపటం వల్ల మక్కలు వెల్లువలా ఇక్కడికి వస్తున్నాయి. ప్రస్తుతం యార్డులో కొనుగోలుకు నోచుకోకుండా సుమారు 5 వేల క్వింటాళ్లకుపైగా నిల్వలు పేరుకుపోయాయి. ఒక్కో రైతు వారం రోజులపాటు తిండి తిప్పలు మాని పగలు, రాత్రి నిరీక్షించాల్సి వస్తోంది. సకాలంలో లిఫ్టింగ్ జరగకపోవడం, యార్డు మొత్తమ్మీద రెండు మాత్రమే మక్కలను శుభ్రపరిచే యంత్రాలు ఉండటం, కాంటాలు కూడా తక్కువగా ఉండటం వల్ల కొనుగోళ్లు సాగటం లేదు. శుభ్రపరిచే యంత్రాల కోసం యార్డులో రైతులు కొట్లాటకు దిగుతుండగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తమ ఉత్పత్తులను అమ్ముకుంటే చాలని ఎంతో ఓపికతో ఉన్న రైతులకు అధికారులు మారో షాక్ ఇచ్చారు. గజ్వేల్ కేంద్రాన్ని కూడా 31తో మూసేస్తామని చెప్పడంతో రైతులంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. మరో 15 రోజులు కేంద్రాన్ని నడిపితే తప్ప రైతులకు ఉపశమనం లభించే పరిస్థితి లేదు.