breaking news
Limited Liability Partnership Company
-
రికార్డు స్థాయిలో కొత్త కంపెనీలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త కంపెనీలు నమోదయ్యాయి. నవంబర్ చివరికి 1,96,028 కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్‌లు (ఎల్ఎల్పీ) కొత్తగా ఏర్పాటైనట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రితం ఏడాది ఇలా ఏర్పాటైనవి 1.88 లక్షలుగా ఉన్నాయి. సులభతర నిబంధనల అమలు, సులభతర వ్యాపార నిర్వహణపై తమ దృష్టి కొనసాగుతుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. 2023 మే నుంచి ‘సెంట్రల్ ప్రాసెసింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్’ (సీ–పేస్) అమల్లోకి వచ్చినట్టు గుర్తు చేసింది. కాంపిటీషన్ చట్టానికి, కంపెనీల చట్టంలోని పలు నిబంధనలకు సవరణలు చేసినట్టు పేర్కొంది. కంపెనీల నిబంధనలకు చేసిన సవరణలతో కంపెనీల విలీనాలకు రీజినల్ డైరెక్టర్లు వేగంగా అనుమతులు ఇవ్వడం సాధ్యమవుతుందని తెలిపింది. చురుకైన, సమర్థవంతమైన, ప్రతిస్పందించే కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించడమే ఈ చర్యల ఉద్దేశ్యమని వివరించింది. -
సంస్కరణలకు ‘సవరణ’ దన్ను!
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల బాటలో కీలక చట్ట సవరణ బిల్లుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (ఎల్ఎల్పీ) యాక్ట్ చట్ట సవరణలకు ఓకే చెప్పింది. ఇక బ్యాంకింగ్ డిపాజిటర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్, 1961 సవరణకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ంది. రెండు అంశాలనూ వేర్వేరుగా పరిశీలిస్తే... ఎల్ఎల్పీ యాక్ట్.. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (ఎల్ఎల్పీ) చట్టంలో అనేక నిబంధనలకు కాలం చెల్లింది. ఆయా నిబంధనల కింద ఏదైనా తప్పు జరిగితే నేరపూరితంగా పరిగణించడం జరుగుతోంది. ఇలాంటి ఇబ్బందిని తొలగించడమే (డీక్రిమినలైజ్) ఎల్ఎల్పీ యాక్ట్ చట్ట సవరణ ప్రధాన ఉద్దేశ్యం. దేశంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా వ్యాపార నిర్వహణకు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఎల్ఎల్పీ యాక్ట్‌లో పలు నిబంధనలను సవరించాలని పారిశ్రామిక వర్గాల నుంచి గత కొన్నేళ్లుగా డిమాండ్ ఉంది. ఈ చట్టం కింద నిబంధనలు పాటించడంలో విఫలమైన దాదాపు 2.30 లక్షల కంపెనీలు ప్రస్తుతం క్రిమినల్ చర్యలను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం ఆయా కంపెనీలకు పెద్ద ఊరట. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తాజా ఆమోదాల వల్ల చట్టంలోని పీనల్ ప్రొవిజన్స్ (శిక్షకు సంబంధించిన నిబంధనలు) 22కు తగ్గిపోతాయని తెలిపారు. కాంపౌండబుల్ (నేరుగా కక్షి దారులు పరిష్కరించుకోదగినవి) నేరాలకు సంబంధించిన నిబంధనలు ఏడుకు, నాన్–కాంపౌండబుల్ నిబంధనలు మూడుకు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇక ఇన్–హౌస్ అడ్జూడికేషన్ యంత్రాగం (ఐఏఎం) కింద పరిష్కరించుకోగలిగిన వివాదాల నిబంధనలు కేవలం 12గా ఉంటాయని పేర్కొన్నారు. ఎల్ఎల్పీ యాక్ట్ 81 సెక్షన్లు, 4 షెడ్యూళ్లను కలిగిఉంది. డీఐసీజీసీ చట్టం... ఒక బ్యాంకు మూతపడే సందర్భాల్లో ఆ బ్యాంకులో ఉన్న తన మొత్తం డిపాజిట్లో కేవలం లక్ష రూపాయలను మాత్రమే డిపాజిట్ దారుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్ కింద తిరిగి పొందగలుగుతున్నాడు. అయితే ఈ కవరేజ్‌ని ఐదు రెట్లు అంటే రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఐసీజీసీ యాక్ట్, 1961ను సవరిస్తున్నట్లు 2021–22 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► చట్ట సవరణ ప్రకారం, మారటోరియం కింద ఉన్న డిపాజిట్ సొమ్ములో 5 లక్షల వరకూ డిపాజిటర్ 90 రోజుల్లో పొందగలుగుతాడు. ► పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ), యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందుల్లో పడిన నేపథ్యంలో కేంద్రం డీఐసీజీసీ చట్ట సవరణ బిల్లు, 2021కు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ఆమోదం వేలాది మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. ► ఈ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తెలిపారు. ► నిజానికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, 5 లక్షల వరకూ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంది. అయితే బ్యాంక్ లైసెన్స్ రద్దయి, లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైతేనే ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అమల్లోకి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒత్తిడిలో ఉన్న బ్యాంక్ నుంచి తమ డబ్బు రాబట్టుకోడానికి దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతోంది. ► బ్యాంక్ డిపాజిటర్లకు బీమా కవరేజ్ అందించడానికి ఆర్బీఐ అనుబంధ విభాగంగా డీఐసీజీసీ పనిచేస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంక్ బ్రాంచీలుసహా కమర్షియల్ బ్యాంకుల సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్ హోల్డర్లందరికీ డీఐసీజీసీ కింద బీమా సదుపాయం లభిస్తుంది. ► తాజా సవరణ ప్రకారం అసలు, వడ్డీసహా గరిష్టంగా బ్యాంకుల్లో ప్రతి అకౌంట్ హోల్డర్ డిపాజిట్‌పై రూ.5 లక్షల వరకూ బీమా కవరేజ్ ఉంటుంది. అంటే వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు ఐదు లక్షలకుపైబడి ఉన్నా... మొత్తంగా ఐదు లక్షల వరకే బీమా లభిస్తుంది. ► తాజా క్యాబినెట్ నిర్ణయంతో దేశంలోని దాదాపు 98.3% డిపాజిట్ అకౌంట్లకు పూర్తి ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. విలువలో చూస్తే 50.9% డిపాజిట్ల విలువకు కవరేజ్ లభిస్తుంది. ఆర్థిక మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం, అంతర్జాతీయంగా చూస్తే, ఆయా అంశాల్లో భారత్ మెరుగైన పరిస్థితిలో ఉంది. అంతర్జాతీయంగా 80 శాతం డిపాజిట్ అకౌంట్లకే కవరేజ్ లభిస్తుంటే, విలువలో ఈ కవరేజ్ 20 నుంచి 30%గా ఉంది. ► ప్రస్తుతం రూ.100 డిపాజిట్‌కు ప్రతి బ్యాంక్ 10 పైసలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుండగా, దీనిని 12 పైసలకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ► 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచీ రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అమలు జరుగుతుందని మంత్రి వివరించారు. -
ఎల్ఎల్పీలకు పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్(ఎల్ఎల్పీ) కంపెనీలకు డిమాండ్ పెరుగుతోందని, చాలా ఎంఎస్ఎంఈ కంపెనీలు ఎల్ఎల్పీలుగా మారడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు హైదరాబాద్ రిజిష్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ఎన్.కృష్ణ మూర్తి అన్నారు. మంగళవారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ‘ఎల్ఎల్పీ’పై నిర్వహించిన సదస్సుకు కృష్ణ మూర్తి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 95,000 కంపెనీలు నమోదై ఉన్నాయని, అందులో ఎల్ఎల్పీల సంఖ్య 898గా ఉన్నాయన్నారు. దేశం మొత్తం మీద 12 లక్షల కంపెనీలు ఉంటే అందులో ఎల్ఎల్పీల సంఖ్య 25,691గా ఉంది. ప్రైవేటు కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు ఎల్ఎల్పీలుగా మారడానికి ఆసక్తి కనపరుస్తున్నాయని, దీనికి ప్రధాన కారణం పరిమిత లయబిలిటీ, కంప్లయెన్స్ తక్కువగా ఉండటమే కారణం అన్నారు. లండన్ వంటి నగరంలో 30 లక్షలకు పైగా కంపెనీలు నమోదై ఉండగా అందులో అత్యధిక కంపెనీలు ఎల్ఎల్పీ, సింగిల్ మేన్ కంపెనీలుగా ఉన్నాయన్నారు. ఇప్పట్లో ఆర్ఓసీ విభజన వుండదు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కొంతకాలం ఉమ్మడిగానే కొనసాగుతుందని కృష్ణమూర్తి స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్వోసీ ఏర్పాటు చేసే మౌలిక వసతులు లేవని, దీంతో కొంత కాలం ఇదే విధంగా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్, నాగోల్ సమీపంలో నిర్మిస్తున్న ఆర్వోసీ సొంత భవన నిర్మాణం తుది దశలో ఉందని, ఈ సంవత్సరాంతానికల్లా కొత్త భవనంలోకి మారే అవకాశం ఉందన్నారు.