breaking news
lands price
-
Puttaparthi: ఆధ్యాత్మిక వైభవం.. పర్యాటక నందనం
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత పుట్టపర్తి.. సాయి బాబా ఉన్నప్పటి రోజులను తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా సాయిబాబా మందిరానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. వివిధ పనులపై కలెక్టరేట్ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు.. మందిరానికి వెళ్లి సాయిబాబా సమాధి సందర్శిస్తున్నారు. కొన్ని రోజులుగా నిత్యం రెండు వేలకు మందికి పైగా ఇక్కడికి వస్తున్నారు. మందిరం లోపల నిర్వహిస్తున్న క్యాంటీన్ (తక్కువ ధరకే)కు ప్రతి పూట సుమారు వెయ్యి మంది భోజనానికి వస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టం అవుతోంది. మ్యూజియం, నక్షత్రశాల కిటకిట.. పుట్టపర్తిలోని చైతన్యజ్యోతి మ్యూజియం, నక్షత్ర శాల సందర్శించే వారి సంఖ్య కూడా పెరిగింది. సాయిబాబా మరణం తర్వాత చైతన్యజ్యోతి మ్యూజియం చూసేందుకు రోజుకు సరాసరి 200 మంది మాత్రమే వచ్చేవారు. జిల్లా కేంద్రం అయ్యాక రోజుకు సగటున 400 మంది వస్తున్నారు. పక్కనే ఉన్న జంతుశాలకు కూడా జనం క్యూ కడుతున్నారు. ఇక్కడ సుమారు 300 మూగజీవులు ఉన్నాయి. జింకలు, కృష్ణజింకలు, దుప్పిలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఎదురుగా ఉన్న నక్షత్రశాలను సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇక.. జిల్లా కేంద్రమైన తర్వాత ఏర్పాటు చేసిన చిత్రావతి నదిలో బోటింగ్‌కు వారాంతపు రోజుల్లో విపరీతమైన గిరాకీ ఉంటోంది. పెరిగిన రవాణా సౌకర్యాలు.. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత రవాణా సౌకర్యాలు పెరిగాయి. జిల్లాలో మొత్తం 32 మండలాలు ఉండగా.. 30 మండలాలకు నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే రామగిరి, కనగానపల్లి మండల కేంద్రాలకు బస్సు సర్వీసులు నగుపుతున్నట్లు జిల్లా రవాణా శాఖాధికారి మధుసూదన తెలిపారు. తిరుపతి, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. దీనికి తోడు బెంగళూరులోని యలహంక జంక్షన్ నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం వరకు ప్యాసింజర్ రైలును రెండు నెలల క్రితం పట్టాలెక్కించారు. సాయిబాబా విమానాశ్రయం అప్పటి నుంచి అందుబాటులో ఉంది. అతి చిన్న గ్రామంలో విమానాశ్రయం ఉండటం దేశంలోనే ప్రత్యేకం కావడం విశేషం. అంతేకాకుండా అతి చిన్న పంచాయతీలోనే వందల సంఖ్యలో పెద్ద పెద్ద భవనాలకు కేరాఫ్‌గా పుట్టపర్తిని చెప్పవచ్చు. భూముల ధరలకు రెక్కలు.. జిల్లా కేంద్రం ప్రకటించిన తర్వాత పుట్టపుర్తి నలుమూలలా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే చుట్టూ పది కిలోమీటర్ల మేర రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. కొత్తచెరువు మండల కేంద్రంలో వ్యాపారాలు వృద్ధి చెందాయి. నాలుగు ప్రధాన మార్గాలకు కేంద్రంగా ఉండటంతో ప్రైవేటు కంపెనీల షోరూం లు, బంగారు దుకాణాలు వెలిశాయి. ధర్మవరం, పెనుకొండ, కదిరి, బెంగళూరు మార్గాల కూడలిలో కొత్తచెరువు ఉంటుంది. నాణ్యమైన వైద్యం.. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తారు. ఆప్తమాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాలకు వైద్యం చేస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆరు లేన్ల రహదారులు జిల్లాలోనే రెండు.. కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో రెండు ప్రధాన రోడ్డు మార్గాలు వెళ్లనున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 576 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల మార్గానికి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) పూర్తయింది. మొత్తం రూ.4,750 కోట్లతో అంచనా వేశారు. అదేవిధంగా బెంగళూరు నుంచి కొడికొండ మీదుగా అమరావతికి నిర్మించనున్న మరో మార్గం శ్రీసత్యసాయి జిల్లాలో నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో ప్రవేశించేలా ప్రణాళిక ఉంది. మొత్తం 332 కిలోమీటర్లకు గానూ 13 కట్ పాయింట్లుగా ఉండే మార్గానికి మొత్తం రూ.30 వేల కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఆశాజనకంగా వ్యాపారాలు శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాక పుట్టపర్తికి రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరిగింది. ఫలితంగా వ్యాపారాలు ఆశాజనకంగా ఉన్నాయి. చిన్న హోటళ్లు, పెట్రోల్ బంకులకు గిరాకీ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మాకు మంచిగా వ్యాపారం ఉంటోంది. – హరినాథ్, సాయి గోకుల్ సూపర్ బజార్, పుట్టపర్తి రెట్టింపు సంఖ్యలో జనం జిల్లా కేంద్రం ఏర్పాటైనప్పటి నుంచి రెట్టింపు సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. ఇలాగే కొనసాగితే మంచి లాభాలు వస్తాయి. సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి కృతజ్ఞులై ఉన్నాం. చిత్రావతి నదిలో బోటింగ్‌కు కలెక్టర్ కూడా స్పందించారు. కొనసాగించాలని కలెక్టర్ కోరారు. – కేశవ, బోటింగ్ నిర్వాహకుడు విపరీతమైన గిరాకీ గత మూడు నెలలుగా వ్యాపారం బాగుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వస్తున్నారు. గతంలో సాయిబాబా ఉన్న సమయంలో మంచి స్పందన వచ్చేది. దుకాణంతో పాటు చుట్టుపక్కల అద్దె గదులు కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. – మనోహర్, చిల్లర దుకాణం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూములకు రెట్టింపు ధరలు కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. కొత్త చెరువులో కార్ల షోరూం, ఈ–కామర్స్ స్టోర్లకు కూడా అడిగారు. అవి వస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. – సత్యనారాయణ, కమ్మవారిపల్లి -
ఆగస్టు 1 నుంచి భూమ్!
- భూముల మార్కెట్ విలువల పెంపు కోసం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు - మూడేళ్లుగా పెంపు ప్రతిపాదనలకు సర్కారు నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భూముల మార్కెట్ విలువలను పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలను పంపింది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పక్షంలో పెరిగిన మార్కెట్ విలువలు వచ్చే ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. వాస్తవానికి భూముల మార్కెట్ వాల్యూను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండేళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతియేటా రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షించడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తోంది. బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరలను బట్టి రిజిస్ట్రేషన్ విలువను లెక్కిస్తారు. ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా, అత్యల్పంగా ఉన్న భూముల సగటు ధరను తీసుకొని, అందులో 65 శాతాన్ని మార్కెట్ వాల్యూగా నిర్ణయిస్తారు. గత మూడేళ్లుగా భూముల మార్కెట్ వాల్యూ పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతియేటా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతున్నా సర్కారు అందుకు సమ్మతించ లేదు. దీంతో విభజనకు (2013) ముందు ధరలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. మార్కెట్ ధరలను పున ః సమీక్షించని కారణంగా అంతగా భూమ్ లేని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ కంటే రిజిస్ట్రేషన్ విలువలే అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు బహిరంగ మార్కెట్లో పెరిగినప్పటికీ పాత మార్కెట్ విలువలే అమల్లో ఉండటం వలన సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లుతోందని రిజిస్ట్రేషన్ వర్గాలంటున్నాయి. మార్కెట్ విలువను బట్టే పెంపు ప్రతిపాదనలు వివిధ ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ ధరలను బట్టి భూముల మార్కెట్ విలువలను పెంచే నిమిత్తం ఏప్రిల్ 1 నుంచే రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో భూమి విలువను (10 నుంచి 70 శాతం వరకు) ఎంత శాతం పెంచవచ్చో ప్రత్యేక ఫార్మాట్ ద్వారా వివరంగా తెలపాలని సబ్ రిజిష్ట్రార్లకు, జిల్లా రిజిష్ట్రార్లకు సూచించింది. అలాగే.. ధరలు పెరగకుండా తటస్థంగా ఉన్న ప్రాంతాలు, ధరలు బాగా తగ్గిన ప్రాంతాలను కూడా ఫార్మేట్లో పేర్కొనాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశించింది. కేవలం మార్కెట్ విలువల పెంపునకే పరిమితం కాకుండా, ధరలను తగ్గించాల్సి వస్తే, ఏ మేరకు తగ్గించాలో కూడా తెలపాలని ఉన్నతాధికారులు సూచించారు. 2003లో ఎకరం రేటు రూ. 10 వేలు ఉండే రాజధాని శివారు ప్రాంతాల్లోని భూముల ధరలను 2013కల్లా రూ. 40 లక్షల నుంచి 70 లక్షలకు అప్పటి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని కొన్ని మండలాల్లో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయినందున ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ ధరలను తగ్గించాలని, విలువ పెరిగిన ప్రాంతాల్లో ఆ మేరకు మార్కెట్ వాల్యూను కూడా పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపు 10 నుంచి 15శాతం వరకు ఉండవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.