breaking news
Lalit Modi issue
-
'వారికో న్యాయం.. మరియాకు మరో న్యాయమా'
ముంబై: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారం ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య చిచ్చురాజేస్తోంది. ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మరియాకు శివసేన మద్దతుగా నిలిచింది. మోదీ వివాదంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మాదిరిగా రాకేష్‌కు ఎందుకు అండగా ఉండటం లేదని శివసేన పార్టీ పత్రిక సామ్నాలో బీజేపీని ప్రశ్నించింది. వీసా మంజూరు విషయంలో సాయం చేసిన సుష్మా, రాజెలకు బీజేపీ బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా లండన్‌లో సమావేశమైన ముంబై పోలీస్ చీఫ్ రాకేష్‌పై చర్యలు తీసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో శివసేన స్పందించింది. 'లలిత్ మోదీ ఐపీఎల్లో అవతకవకలకు పాల్పడ్డాడు. ప్రభుత్వ యంత్రాంగం అనుమతితో మోదీ లండన్‌లో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ముంబై పోలీస్ కమిషనర్‌కు మోదీని అరెస్ట్ చేసి భారత్‌కు తీసుకువచ్చే అధికారం లేదు. ఐపీఎల్ చైర్మన్‌గా మోదీకి చాలా మంది రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయి. వీరందరిపైనా చర్యలు తీసుకుంటారా' అని సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. -
మోదీ వివాదంలో కొత్త మలుపు
- ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లపై రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సంతకం - 2011 నాటి పత్రాలు బహిర్గతం.. - పోర్చుగల్ ఆసుపత్రితో రాజస్థాన్ ప్రభుత్వం భూ ఒప్పందం.. అదే ఆసుపత్రిలో లలిత్ మోదీ భార్యకు ఆపరేషన్ - బీజేపీపై విమర్శల దాడి ముమ్మరం చేసిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: సంచలనం సృష్టిస్తోన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఇమిగ్రేషన్ వివాదంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. 2011లో మోదీ భారత్ నుంచి సురక్షితంగా యూకే వెళ్లేందుకు నేటి రాజస్థాన్ ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నాయకురాలు వసుంధరా రాజే సహకరించినట్లు తెలిసింది. 18, ఆగస్టు, 2011 తేదీని సూచిస్తూ లలిత్ మోదీ యూకే ఇమిగ్రేషన్ కు సమర్పించిన దరఖాస్తులో వసుంధర రాజే సాక్షి సంతకం చేశారు. అయితే అనూహ్యరీతిలో మోదీ పర్సనల్ రిలేషన్స్ సిబ్బందే ఈ డాక్యుమెంట్లను బహిర్గతం చేశారు. మోదీ భార్యకు క్యాన్సర్ చికిత్స చేసిన పోర్చుగల్ ఆసుపత్రి విషయంలోనూ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్చుగల్ రాజధాని లస్బన్ కేంద్రంగా పనిచేసే సదరు ఆసుపత్రి రాజస్థాన్ లో రీసెర్చ్ సెంటర్ స్థాపించాలనుకుంది. అందుకు అనుగుణంగా ఆ ఆసుపత్రికి 35 వేల ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తున్నట్లు వసుంధర రాజే ప్రభుత్వం అక్టోబర్ 2, 2014న జోవో జారీ చేసింది. సరిగ్గా ఇది జరిగిన రెండు నెలల తర్వాత అదే ఆసుపత్రిలో లలిత్ మోదీ భార్యకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ ఉచితంగా నిర్వహించారా లేదా అనే విషయాలు ఇంకా తెలియాల్సిఉంది. భార్య ఆపరేషన్ కోసం ఇంగ్లాండ్ నుంచి పోర్చుగల్ వెళ్లాలనుకున్న మోదీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేయడం, ఇప్పుడా విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడం తెలిసిందే. తాజాగా వివాదంలో వసుంధరరాజే పాత్ర కూడా స్పష్టం కావడంతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడిని ముమ్మరం చేసింది.