breaking news
L. Narashima reddy
-
ఇదేం ‘వడ్డి’ంపు ?
- డిపాజిట్లపై ఇచ్చేది తక్కువ, రుణాలపై వసూలు ఎక్కువా? - ఈ వ్యత్యాసంపై వివరణివ్వండి - ఆర్బీఐకి హైకోర్టు ఆదేశం బ్యాంకుల తీరుతో మరోసారి రుణం లభించే అవకాశాలు కరువవుతున్నాయని వినియోగదారులు చేస్తున్న ఫిర్యాదులపై కూడా విచారణ చేపడతాం - హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లపై చెల్లించే వడ్డీ తక్కువగా, రుణాలపై వసూలు భారీగా ఉండటంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. వడ్డీ చెల్లింపు, వసూళ్ల మధ్య ఎందుకింత భారీ వ్యత్యాసం ఉంటుందో వివరణ ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ చల్లా కోదండరాంలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. ఒకటీ రెండు వాయిదాలు చెల్లించనంత మాత్రానే బ్యాంకులు ఈ విషయాన్ని ఆర్బీఐ, సిబిల్ దృష్టికి తీసుకెళుతున్నాయని, దీనివల్ల తమకు మరోసారి రుణం లభించే అవకాశాలు కరువవుతున్నాయని వినియోగదారులు చేస్తున్న ఫిర్యాదులపై కూడా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. వన్‌టైం సెటిల్మెంట్ కింద రుణం చెల్లిస్తామన్నా తమ ఆస్తులను ఇండియన్ బ్యాంక్ వేలం వేయడానికి సిద్ధపడటాన్ని సవాలు చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన బెజవాడ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీవీ భాస్కర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, 2012లో బ్యాంకు తమ రుణాన్ని సర్దుబాటు చేసిందని, వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 6 కోట్లు చెల్లించేందుకు తాము సిద్ధపడినా బ్యాంకు అంగీకరించట్లేదని ధర్మాసనానికి నివేదించారు. రుణం కోసం తాకట్టు పెట్టిన ఆస్తి విలువ తాము చెల్లించే మొత్తాని కన్నా ఎక్కువ ఉంటుందనే తమ ప్రతిపాదనను బ్యాంకు తిరస్కరించిందని వివరించారు. దీనిపై డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)ను ఆశ్రయించామని... అయితే అక్కడ బ్యాంకే వాయిదా కోరి, తిరిగి ఆస్తుల వేలం నిమిత్తం తమకు నోటీసులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఇంతకీ వడ్డీ ఎంతమేర వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఏడాదికి 14.75 నుంచి 15.75 శాతం వసూలు చేస్తున్నారని భాస్కర్‌రెడ్డి చెప్పారు. దీంతో బ్యాంకులు డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఇవ్వడం, రుణాలపై ఎక్కువ వడ్డీ వసూలు చేయడాన్ని గమనించిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో వివరణ ఇవ్వాలని ఆర్బీఐను ఆదేశించింది. ఇందుకుగాను ఈ వ్యాజ్యంలో ఆర్బీఐని ప్రతివాదిగా చేర్చింది. ఇండియన్ బ్యాంకు జారీ చేసిన వేలం నోటీసులను రద్దు చేసి, విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఇదే తరహా అభ్యర్థనతో శ్రీవెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. తమ బ్యాంకు ఖాతా స్థితి గురించి ఆర్బీఐ, సిబిల్‌కు తెలియచేయకుండా యూకో బ్యాంకును నియంత్రించాలని కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణను కూడా ధర్మాసనం ఈనెల 31కి వాయిదా వేసింది. -
నిజాం సుగర్స్‌పై మంత్రుల బృందం ఏర్పాటు జీవో
హైకోర్టు నిలుపుదల సాక్షి, హైదరాబాద్: నిజాం సుగర్స్ ప్రైవేటీకరణపై తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న జారీ చేసిన జీవోను హైకోర్టు గురువారం నిలుపుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ ఈ జీవో ఆధారంగా ఎటువంటి చర్యలూ చేపట్టడానికి వీల్లేదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ చల్లా కోదండరాంలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల బృందం ఏర్పాటు జీవోను సవాల్ చేస్తూ నిజామాబాద్‌కు చెందిన నిజాం సుగర్స్ పరిరక్షణ కమిటీ, తెలంగాణ చెరకు రైతుల సంఘం కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి, కో-కన్వీనర్ అజయ్ ఆర్.వడియార్, కార్యదర్శి వి.నాగిరెడ్డి, చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ కంది బుచ్చిరెడ్డి లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. -
జాతి ఔన్నత్యం సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది
సాక్షి, హైదరాబాద్: జాతి ఔన్నత్యం సాహిత్యంలో ప్రతిఫలిస్తుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ యుగంలోనైనా రాజులు ఎన్ని యుద్ధాలు చేశారు.. ప్రజలు ఏ భోగభాగ్యాలు అనుభవించారనేదిగాక ఆ జాతి సంస్కారం, ఆ యుగంలో వర్ధిల్లిన సాహిత్యం, సంస్కృతులు మాత్రమే తర్వాత తరాలకు నిలుస్తాయని చెప్పారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది నవలకు అవార్డులు ఇవ్వలేదని, వచ్చిన నవలల్లో దేనినీ న్యాయనిర్ణేతలు ఆమోదించనందున ప్రకటించలేదని వివరించారు. త్వరలో కీర్తి పురస్కారాలను అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ర్టం విడిపోయినా తెలుగు భాష గొప్పదనం దెబ్బతినకుండా చూస్తామని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నటునిగా తొలినాళ్లలో సన్మానాలు ఎవరు చేస్తారని ఎదురు చూసిన రోజులున్నాయని, అలాంటి తనకు ఎంతోమంది సాహితీమూర్తులను సన్మానించడం ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలు ఒక్కొక్కరికి 20,116 నగదు, శాలువా, పురస్కార పత్రం అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, డాక్టర్ జె.చెన్నయ్య, ఆర్.రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.