breaking news
KPC Gandhi
-
May Be.. బాబుగారికి ఆయనంటే ఎంతో స్పెషల్!
నేను కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా ఎవరూ గొప్పగా వాడలేరు అనేది మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగ్. అదే.. అధికారులను వాడకం మొదలు పెడితే నా కన్నా గొప్పగా ఎవరూ వాడలేరు అనేది ఇప్పటికే చంద్రబాబు ఎన్నోసార్లు రుజువు చేశారు. పోలీసుల మొదలు.. రాజకీయ నాయకులు, న్యాయాధికారులు.. ఇలా ఒకరేమిటి చంద్రబాబు తలచుకుంటే ఎవరినైనా వాడేయగలరు. ఆ వాడకం తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తూ రుణం తీర్చుకోగలరు... తాజాగా ఏపీ ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించించుకుంది. వారిలో గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చీఫ్ జి.సతీష్ రెడ్డి, ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్, చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా, ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీని నియమించారు. వీరికి కేబినెట్ హోదా కల్పిస్తూ వాహనం.. ఆఫీసు.. అదే స్థాయిలో వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లిస్తారు. అయితే ఇందులో మొదటి ముగ్గురు సంగతి పక్కన పెడితే నాలుగో వ్యక్తి అయిన కేపీసీ గాంధీ గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఫోన్లో బేరాలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసునుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డ్ అప్పట్లో రాజకీయ సంచలనం అయింది. ఆఘటన తరువాత రాత్రికి రాత్రి ఆయన ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చేశారు. ఆయన ఊరు వదిలి వచ్చేసినా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసులు మాత్రం వదలలేదు. ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వాయిస్ రికార్డర్‌ను ఫోరెన్సీక్ లాబరేటరీ పంపించారు. అందులో ఉన్న గొంతు చంద్రబాబుదా కాదా అన్నది తేల్చడం ఆ ల్యాబ్ బాధ్యత. అదిగో ఆ టైంలో ఆ ల్యాబ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు కేపీసీ గాంధీ. ‘‘ఆ వాయిస్ చంద్రబాబుది అని చెప్పలేం. మిమిక్రీ కూడా కావొచ్చు’’ అని ఓ రిపోర్ట్ రాసి పడేశారాయన. దీంతో ఆ కేసు అక్కడితో ఆగిపోయింది. కట్ చేస్తే.. గాంధీ 2014-19 మధ్య కూడా ప్రభుత్వంలో సలహాదారు పాత్ర ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోలేదని అనుకున్నారో ఏమో.. ఇప్పుడు కూడా ఆయన్ని గౌరవ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించారు. మునుముందు ఫోరెన్సిక్ సంబంధ అంశాల్లో ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇస్తారట. ఆ సలహాలు ఎవరికి పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్నార్థకం. అన్నట్లు.. గతంలో అధికారంలో ఉన్నపుడు తను డీజీపీ స్థాయి అధికారిని అనే సంగతి కూడా మరిచిపోయి టీడీపీకి ఏబీ వెంకటేశ్వర రావు ఊడిగం చేశారనే చర్చ నడిచింది. అయితే.. మళ్ళీ అధికారంలోకి రాగానే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అలాగే.. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడిని విజిలెన్స్ విభాగంలో ఓఎస్డీగా నియమించారు. ఇలా ఎంతోమంది అనుయాయులను అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చి సొంత పనులు..రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని చర్చ చాలాకాలంగా నడుస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు కేపీసీ గాంధీ నియామకం కూడా అదే కోవలోకి వస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.:::సిమ్మాదిరప్పన్న -
కేపీసీ గాంధీ నియామక రహస్యమేంటో?
-
కేపీసీ గాంధీ నియామక రహస్యమేంటో?
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు కేపీసీ గాంధీ (కాజా పూర్ణచంద్ర గాంధీ)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించటం చాలా సాధారణంగా కనిపిస్తున్న విషయం అయినా ... ఓటుకు కోట్లు కేసు విచారణ సమయంలో కేపీసీ గాంధీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. కేపీసీ గాంధీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ డైరెక్టర్‌గా దీర్ఘకాలం పని చేశారు. ఓటుకు నోటు కేసులో ...ఆడియో, వీడియో టేపుల నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్ ....త్వరలో ఏసీబీ కోర్టుకు సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేపీసీ గాంధీని హడావిడిగా ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవటం అనుమానాలకు తావీస్తుంది. ఓటుకు కోట్లు కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నచంద్రబాబు నాయుడు దీని నుంచి బయటపడేందుకు తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నట్లు దీనిబట్టి అర్థం అవుతోంది. ఫోరెనిక్స్ విభాగంలో నిపుణుడయిన కేపీసీ గాంధీని నియమించుకోవటం చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా చెప్పుకోవాలేమో. గాంధీ తన పదవీ విరమణ తర్వాత ..ట్రూత్ ల్యాబ్స్ పేరుతో దేశంలోనే తొలి ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడికి కేబినెట్ హోదా లభిస్తుంది.