breaking news
kalyana mahostavam
-
నేడు అంతర్వేదిలో కల్యాణోత్సవం
సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. కల్యాణోత్సవాలు రథసప్తమినాడు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవీ భూదేవీ అమ్మవార్లతో శ్రీ స్వామివారి కల్యాణాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. శనివారం తెల్లవారుజామున సముద్రంలో పుణ్యస్నానాలు, మధ్యాహ్నం రథోత్సవం జరగనున్నాయి. కల్యాణోత్సవం, సముద్ర స్నానాలు, దర్శనాలు, రథోత్సవాలకు 2 లక్షల మంది వరకూ వస్తారని అంచనా. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో అంతర్వేదిలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, అమలాపురం, రాజోలు నుంచి బస్సులను నడపనుంది. -
నేడు సత్యదేవుని కల్యాణం
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవం బుధవారం జరగనుంది. కల్యాణోత్సవం నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధార కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి గరుడ వాహనంపై, సీతారాములను పల్లకిలో ఊరేగిస్తారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు రామాలయం పక్కనే ఉన్న వేదికపై సత్యదేవుని దివ్య కల్యాణం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.