breaking news
Junior Scientist Award
-
విదేశాల్లో మెరిసే..నూజివీడు మురిసె
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలు అయిన ట్రిపుల్ ఐటీల్లో వికసించిన విద్యాకుసుమాలు నేడు ఖండాంతరాల్లో పరిమళాలు వెదజల్లుతున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్‌కు చెందిన కొల్లి మీనాకుమారి కూడా ఈ కోవకు చెందిన యువతే. పరదేశంలో తెలుగునేల గొప్పతనం చాటుతోంది. జర్మనీలో యువ సైంటిస్టుగా రాణిస్తూ, పుట్టిన గడ్డకు.. చదువు నేర్పిన విద్యా సంస్థకు పేరుతెస్తోంది. సాక్షి, నూజివీడు(విజయవాడ) : నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008–14 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని తన ప్రతిభతో జర్మనీలోని ఫిలిప్ విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ సత్తా చాటుతోంది. తొలి బ్యాచ్‌లో ట్రిపుల్ ఐటీలో చేరిన కొల్లి మీనాకుమారి స్వగ్రామం విజయనగరం జిల్లా కామన్నవలస. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చివరి అమ్మాయి అయిన మీనాకుమారి తొలి నుంచి చదువులో ముందుండేది. బాడంగి హైస్కూల్లో పదో తరగతి చదివి మెరుగైన మార్కులు తెచ్చుకోవడంతో ట్రిపుల్ ఐటీ సీటును సాధించింది. గేట్లో ర్యాంక్ తెచ్చుకొని.. ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి గేట్ రాయగా వరంగల్‌లోని నిట్‌లో సీటు లభించింది. అక్కడ చేరి రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ విభాగంలో 2015–17 ఏడాదిలో ఎంటెక్ పూర్తిచేసింది. ఈ విభాగంలో వస్తున్న నూతన మార్పులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుంది. అనంతరం డెహ్రాడూన్‌లోని ఐఐఆర్ఎస్లో రీసెర్చ్ చేసింది. ఐఐఆర్ఎస్లో రీసెర్చ్ చేస్తుండగానే జర్మనీలో, థాయ్‌లాండ్‌లో పీహెచ్డీ చేసేందుకు అవకాశాలు వచ్చాయి. జపాన్ ప్రభుత్వ ఉపకార వేతనంతో థాయిలాండ్‌లోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏఐటీ)లో పరిశోధన చేయడానికి ఎంపికైంది. ప్రస్తుతం ఫిలిప్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ ట్రిపుల్ ఐటీ ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటుతోంది. ఆమె చేసిన పీహెచ్డీ పరిశోధకు మార్బర్గ్ ఇంటర్నేషనల్ డాక్టరేట్ పురస్కారం సైతం లభించింది. గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం. ట్రిపుల్ ఐటీలే లేకుంటే వేలాది మంది విద్యార్థులు నేడు ఉన్న గొప్ప గొప్ప స్థాయిల్లో ఉండేవారే కాదు. లక్షలాది రూపాయల ఫీజులు కట్టి చదివించే స్థోమత లేని నిరుపేద, పేద వర్గాల పిల్లలే ఇందులో చదువుకుంటున్నారు. గ్రామీణ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను మరింత పదును పెట్టడంలో ట్రిపుల్ ఐటీలు ఎంతో దోహదపడుతున్నాయి. – కొల్లి మీనాకుమారి -
ఆదిత్యకు మరో అవార్డు!
మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి జూనియర్ సైంటిస్ట్ అవార్డు ఎలా కైవసం చేసుకున్నాడనే కథాంశంతో తెరకెక్కిన బాలల చిత్రం ‘ఆదిత్య... క్రియేటివ్ జీనియస్’. స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన ఈ బాలల చిత్రం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన జెన్రీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు న్యూయార్క్ సన్ ఫెస్ట్ 2016 పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నాం. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.