breaking news
Journalist associations of andhra pradesh
-
మీడియాపైనా ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాకముందే రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని 9 నెలలుగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, తప్పులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా నొక్కేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేయించి, జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా నాలుగు ప్రధాన టెలివిజన్ చానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా చేసింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విశేషాలను ప్రజలకు అందించేందుకు టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ రిపోర్టర్లను, కెమెరామెన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఇలా ఎందుకు బహిష్కరించారనేది కూడా చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చానళ్లుగానీ, పత్రికలుగానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వడం పరిపాటి. ఆ తరువాతే ఏవైనా చర్యలు తీసుకోవడం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో మీడియాకు ప్రవేశం ఉన్న మార్గాల్లోనూ అనేక ఆంక్షలు విధించింది. అసెంబ్లీ గేటు నుంచి మీడియాను అనుమతించలేదు. పాసులు ఉన్నప్పటికీ వెనుక నుంచే రావాలని చెప్పి అధికారులు పంపించేశారు. దీంతో అసెంబ్లీ బయట మండుటెండలోనే మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. వారికి కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితులను మీడియా గతంలో ఏనాడూ ఎదుర్కోలేదని, తమ విధులను మాత్రమే తాము నిర్వర్తిస్తున్నామని, తమపైనా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పక్షపాత ధోరణి తగదు: ఏపీయూడబ్ల్యూజేరాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీ కోసం కొందరికి పాసులు ఇచ్చి, కొన్ని పత్రికలు, చానళ్ల రిపోర్టర్లను అనుమతించకపోవడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఏచూరి, ‘సామ్నా’ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా పట్ల పక్షపాత ధోరణులు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలకు కూడా కొన్ని పత్రికలు, చానల్స్‌ను పిలవకపోవడం తగదన్నారు. శాసనసభ స్పీకర్, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీతో పాటు మిగిలిన అన్ని చానల్స్, పత్రికలకు అనుమతి ఇచ్చి, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు.ఈ వైఖరి మంచిదికాదు: ఏపీడబ్ల్యూజేఎఫ్అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కొన్ని మీడియా సంస్థలకు పాసులు నిరాకరించడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వీసం శ్రీనివాసరావు, కె.మునిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు మీడియా విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి మీడియా సంస్థలకు మీడియా పాసులు నిరాకరించడం సరైన విధానం కాదన్నారు. ఈ విషయంపై స్పీకర్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించి మీడియా సంస్థలన్నిటికీ పాసులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
నేడు విజయవాడలో ‘భూ సమీకరణ’ సదస్సు
విజయవాడలో మంగళవారం ఉదయం ‘రాజధాని భూ సేకరణ-ప్రజా ప్రయోజనాలు’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరగనుంది. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. బందరు రోడ్డులోని వైట్‌హౌస్ భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భూ సమీకరణ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, రైతుల మనోభావాలు, ఇందువల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలపై వక్తలు ప్రసంగించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ బి.రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు గట్టు రామచంద్రరావు, జర్నలిస్టుల యూనియన్ నేత ఉప్పల లక్ష్మణ్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ, బీజీపీ రాష్ట్ర నాయకుడు శ్రీనివాసరాజు, లోక్‌సత్తా రాష్ట్ర నాయకులు చెన్నుపాటి వజీర్, డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ, గాంధీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ వేమూరి బసవ కుటుంబరావు, పర్యావరణవేత్త డాక్టర్ కె.బాబూరావు, రైతు నాయకులు మల్లెల శేషగిరిరావు, అనుమోలు గాంధీ, జర్నలిస్ట్ మేగజైన్ సంపాదకులు కృష్ణంరాజు వక్తలుగా హాజరు కానున్నారని నిర్వాహకులు వివరించారు.