breaking news
Job life
-
నైపుణ్యాలు, ఉద్యోగ పురోగతికే ప్రాధాన్యం
ముంబై: కంపెనీల కార్యకలాపాల్లో ఆటోమేషన్, జెనరేటివ్ ఏఐ వినియోగం విస్తరిస్తుండడంతో.. జెనరేషనల్ జెడ్, మిలీనియల్స్ తరగతి యువత నైపుణ్యాలు పెంచుకునేందుకు, ఉద్యోగంలో పురోగతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ నిర్ణయాల్లో పురోగతి, అభ్యాసనా అవకాశాలకే తమ ప్రాధాన్యమని డెలాయిట్ సర్వేలో వారు చెప్పారు. జెన్ జెడ్, మిలీనియల్స్‌లో 85 శాతం మంది ప్రతి వారం చివర్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు, పనిచేస్తూనే నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు డెలాయిట్ ఇండియా చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరి రంగన్ తెలిపారు. కాకపోతే వీరికి తగినంత మార్గదర్శకత్వం లభించడం లేదని డెలాయిట్ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ మేనేజర్ల నుంచి మార్గదర్శనం కోరుకుంటుంటే.. అది కొందరికే లభిస్తున్నట్టు తెలిపింది. 505 మంది జెనరేషన్ జెడ్, 304 మిలీనియల్స్ అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా డెలాయిట్ తెలుసుకుంది. 1981–1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్‌గా, 1997–2012 మధ్యకాలంలో జని్మంచిన వారిని జెనరేషన్ జెడ్ కింద పరిగణిస్తుంటారు. పట్టాలు కాదు.. అనుభవానికే పెద్ద పీట వేగంగా మార్పులకు గురవుతున్న ఉద్యోగ మార్కెట్లో సంప్రదాయ డిగ్రీ అర్హతల కంటే.. అనుభవానికే అగ్ర తాంబూలం లభిస్తున్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. దీంతో సంప్రదాయ విద్యా వ్యవస్థ నాణ్యతపై సందేహాలు లేవనెత్తింది. 94 శాతం జెన్ జెడ్, 97 శాతం మిలీనియల్స్ సిద్ధాంతాల కంటే అనుభవానికే విలువ ఎక్కువని చెప్పారు. ఉన్నత విద్యపై 52 శాతం జెన్ జెడ్, 45 శాతం మిలీనియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్య వ్యయాలపై 36 శాతం జెన్ జెడ్, 40 శాతం మిలీనియల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన, ఒత్తిడి విషయంలో ఉద్యోగం కారణమవుతున్నట్టు 36 శాతానికి పైనే చెప్పారు. ఉద్యోగుల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి.. ‘‘ఉద్యోగుల సంతోషం, శ్రేయస్సు విషయంలో సంస్థలు తమ విధానాలను తిరిగి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. భౌతిక, మానసిక, ఆర్థిక శ్రయస్సు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నాయకత్వం స్థాయిలో వీటిని పరిష్కరించాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. -
కలవరం కాదు... వరం!
బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలలో జీవితం గడుస్తుంది. బాల్యంలో ఆటపాటలు, విద్యాభ్యాసం; యవ్వనంలో ఉద్యోగం, వివాహం, సంతానం; వృద్ధాప్యంలో అరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు... ఇలా జీవనక్రమం ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగ జీవితం... కుటుంబపరంగా కూడా అనేక బాధ్యతలను నెరవేర్చుకోవడంతో సాగుతుంది. పిల్లల చదువుల, పిల్లల పెళ్లిళ్లు, అదే సమయంలో ఉద్యోగనిమిత్తం కొత్త కొత్త ప్రదేశాలలో పనిచేయాల్సి రావడం, కొత్తవారితో పరిచయాలు... జీవితాన్ని వేగంతో నింపేస్తాయి. అయితే ఉద్యోగ విరమణ పొందాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది. ఒంటరితనం మిగులుతుంది. దీంతో మనోవేదన కలుగుతుంది. వయసు తెచ్చిపెట్టే ఆరోగ్య సమస్యలూ ముప్పిరిగొంటాయి. అందుకే పదవీ విరమణ తర్వాత ఏదైనా ఒక వ్యాపకాన్ని పెట్టుకోవాలి. ఉచిత సేవలు అందించడం కానీ, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం కానీ చేయాలి. సమాజానికి ఉపకరించే పనుల్లో నిమగ్నం అయి ఉండడం వల్ల కూడా మనం ఈ ‘శూన్యత’ నుండి బయటపడవచ్చు. దాంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలూ తగ్గుతాయి. ఇక లలిత కళలు ఇచ్చే ఆనందం గురించైతే చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఉల్లాసాన్నిచ్చే వ్యాపకాలను ఏర్పరచుకుంటే ఉద్యోగ విరమణ అన్నది శాపంలా కాకుండా వరంలా పరిణమిస్తుంది. - చెన్నమాధవుని అశోక్‌రాజు