breaking news
Jnanesvar
-
ప్రకృతికి ఫ్రెండ్
కాలేజీకి సెలవులు వస్తే యువత విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్తుండటం సహజమే. కానీ జ్ఞానేశ్వర్ మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రకృతి దగ్గరికి వెళ్లి పలకరిస్తుంటాడు! చిన్నారులతో కలిసి మొక్కలు నాటుతుంటాడు. ప్రకృతి సంరక్షణపై గ్రామస్తులకు సంగీత వాయిద్యాలతో పాటలు పాడి వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటాడు. జ్ఞానేశ్వర్‌ది సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామం. ప్రకృతిని పరిరక్షిస్తానని ప్రతిన బూని పాదరక్షలు లేకుండా ఎనిమిదేళ్లుగా పాదయాత్రలు చేస్తున్నారు! జ్ఞానేశ్వర్ ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో బీఈడీ చదువుతున్నారు. స్వగ్రామం మంజీరా నది పరివాహకంలో ఉండటంతో రోజూ నది అందాలు ప్రకృతి చూస్తూ పెరిగారాయన. 2017లో నది చుట్టుపక్కల ఉన్న చెట్లను నరకడంతో మంజీరా నది మొత్తం ఎండిపోయిన దృశ్యమూ చూశారు. నదిలోని మొసళ్లు గ్రామాల్లోకి వచ్చేవి. పక్షులు మృతి చెందేవి. దీంతో చలించిపోయి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టారు. అందుకు బాలల్ని తన సైన్యంగా మలుచుకున్నాడు. చిన్నారులతో కలిసి వేసవి కాలంలో సీడ్‌బాల్స్ (విత్తన బంతులు) తయారు చేసి మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో వాటిని విసిరారు. వర్షాలు కురిస్తే అందులోని విత్తనాలు మొల కెత్తేవి. మొదట్లో చిన్నారులను తీసుకొని వెళ్తే వారి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పేవారు. తర్వాత్తర్వాత వాళ్లూ ముందుకు వచ్చారు. మొక్కలు నాటేందుకు చిన్నారులతో కలిసి వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లేవారు జ్ఞానేశ్వర్. దీంతో గ్రామస్తుల్లోనూ చైతన్యం వచ్చింది. చెట్లను పూజించడం, తామూ మొక్కలు నాటడం ప్రారంభించారు. ఒక్కో దఫా మంజీరా తీరంలో వెయ్యి మొక్కలు నాటాలనే లక్ష్యంతో వెళ్తారు. అక్కడికే విద్యార్థులు భోజనం తెచ్చుకొని సాయంత్రం వరకు మొక్కలు నాటుతారు. జ్ఞానేశ్వర్ గత ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా, హైదరాబాద్, బీదర్‌లలో సైకిల్ యాత్ర నిర్వహించారు. నిరుడు దసరా సెలవుల్లో మంజీరా నది రక్షించాలని కోరుతూ నారాయణఖేడ్‌లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నదుల ఆవశ్యకతను తెలియజేస్తూ వాటిని ఎందుకు పరిరక్షించుకోవాలో వివరించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ ఏడాది దసరా సెలవుల్లోనూ సిద్దిపేట జిల్లా నుంచి నారాయణఖేడ్ వరకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై పాదయాత్ర చేపట్టారు. – రవి ముదిరాజ్ తాటికొండ, సాక్షి, మెదక్ డెస్క్ -
ఆంధ్ర పరాజయం
నదౌన్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు హిమాచల్ ప్రదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఇన్నింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడింది. ఓపెనర్ సీఆర్ జ్ఞానేశ్వర్ (103; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించినప్పటికీ జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఓవర్‌నైట్ స్కోరు 175/1తో సోమ వారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 100.5 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆట మొదలైన కాసేపటికే... సెంచరీ పూర్తయిన వెంటనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జ్ఞానేశ్వర్ నిష్క్రమించడంతో మిగతా బ్యాట్స్‌మెన్ వరుస విరామాల్లో వికెట్లను సమర్పించుకున్నారు. సాయికృష్ణ (82 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరి మితమయ్యారు. హిమాచల్ బౌలర్లలో గుర్విందర్ సింగ్ (3/62), మయాంక్ డాగర్ (3/89) ఆంధ్రను దెబ్బ మీద దెబ్బ తీశారు. గులేరియాకు 2 వికెట్లు దక్కాయి. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలగా, హిమాచల్ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. ఈ గ్రూపులో ఐదు మ్యాచ్‌లాడి ఒక్కటీ గెలవలేకపోయిన ఆంధ్రకు ఇది రెండో ఓటమి కాగా, 3 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ప్రస్తుతం గ్రూప్ ‘బి’లో ఆంధ్ర అట్టడుగున ఉంది. -
చిత్రగుప్తుడి చిట్టాలో చిత్రాలెన్నో!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: మోహన్‌రెడ్డి పైనాన్స్ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న జ్ఞానేశ్వర్ చెప్పిన లెక్కలు కొత్త ప్రశ్నలకు తావిస్తున్నాయి. కీలక పత్రాలతో ఉడాయించిన జ్ఞానేశ్వర్ దొరికితే అక్రమ ఫైనాన్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారు బయటకు వస్తారని భావించగా, ఆయన చెప్పిన మాటలకు.. ఇక్కడి లెక్కలకు మధ్య తేడా ఉండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సీఐడీ రిమాండ్ నివేదికలో పేర్కొన అంశాలు పరిశీలిస్తే జ్ఞానేశ్వర్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు అంత కీలకం కాదని తెలుస్తోంది. అయితే, జ్ఞానేశ్వర్ విలువైన పత్రాలను దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. 15 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న అతను హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లో సంచరించినట్లు అనుమానిస్తున్న పోలీసులు పత్రాలను ఆయా ప్రాంతాల్లోనే దాచి ఉంచాడని భావిస్తున్నారు. రాయలసీమలోని పలువురు ఫ్యాక్షన్ నేతలతో మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉండటంతో జ్ఞానేశ్వర్ వ్యూహాత్మకంగా తిరుపతి వరకు వెళ్లి వారివద్దే ఈ డాక్యుమెంట్లు ఉంచారని ప్రచారం జరుగుతోంది. చిట్టాలో చిత్రాలెన్నో... సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పలువురు పోలీసు అధికారులతో పాటు వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టినట్లుగా జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. కానీ, వాటిని మొత్తం కలిపితే రూ.3.84 కోట్లుగా తేలింది. కానీ, అదే నివేదికలో మోహన్‌రెడ్డి నుంచి పలువురు ప్రముఖులు, ఉద్యోగులు తీసుకున్న అప్పు రూ.8.34 కోట్లుగా తేలింది. అట్లాంటప్పుడు మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం అందులో పేర్కొనలేదు. ఇవేకాకుండా వందలాది ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇళ్లు మోహన్‌రెడ్డి, ఆయన బినామీల పేరిట ఉన్నాయి. జ్ఞానేశ్వర్ నుంచి రాబట్టిన సమాచారం చూస్తే... మోహన్‌రెడ్డి దందాకు సంబంధించి కొన్ని విషయాలు మాత్రమే బయటపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోనే కాకుండా నిర్మాతలకు సంబంధించిన ఆస్తులనూ తనఖా పెట్టుకుని సుమారు రూ.200 కోట్ల వరకు అప్పులిచ్చాడని ఆరోపణలున్నాయి. అయితే,జ్ఞానేశ్వర్ చెప్పిన వివరాలు చూస్తే పొంతనే లేకుండా ఉంది. జ్ఞానేశ్వర్ నోటి వెంట... కిరణ్‌రావు మాట జ్ఞానేశ్వర్ నోట రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్‌రావు పేరు రావడం చర్చనీయాంశమైంది. మోహన్‌రెడ్డికి కిరణ్‌రావు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అతని సూచనల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి ఎన్నికల ముందు రూ.3 కోట్లు అప్పు ఇచ్చారని రిమాండ్ షీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదారాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కిరణ్‌రావు నుంచి మరి కొంతమందికి కూడా మోహన్‌రెడ్డి పెద్ద మొత్తంలో అప్పులిప్పించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు తాజాగా కిరణ్‌రావు వ్యాపారాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం. మోహన్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు ఏఎస్సై మోహన్‌రెడ్డి రిమాండ్‌ను న్యాయమూర్తి అజహర్ హుస్సేన్ పొడిగించారు. శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. రిమాండ్‌ను న్యాయమూర్తి మరో 14రోజులు పొడిగిం చారు. దోనపాటి వెంకట రమణారెడ్డిని ఆస్తుల ను అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో నిందితుడు మోహన్‌రెడ్డి బినామీ పూర్మ శ్రీధర్‌రెడ్డి బెయిల్ ఫిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి విచారణ ఈనెల 30కి వాయిదా వేశారు. విచారణ ముందుకు సాగేనా..? ఈ కేసులో సీఐడీ అధికారులకు కొత్తగా రాజకీయ ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. విచారణ మరింత లోతుగా వెళితే బడా వ్యాపారులు, ఎస్పీ స్థాయి అధికారులు, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని, అదే జరిగితే ఇబ్బందని భావిస్తున్న సదరు నేతలు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో కేసును నీరుగార్చేలా సీఐడీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పెద్ద నేతతో మంతనాలు చేశారని, అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే సీఐడీ దూకుడుకు కళ్లెం పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు మోహన్‌రెడ్డిపై ఫిర్యాదులు చేసిన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఏసీబీకి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రతి రోజు 5 నుంచి 7 ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.