జ్వరం వస్తేనే యాపిల్స్.. పండగ రోజు కూడా పనికి వెళ్లేవాళ్లం : నూకరాజు
ప్రస్తుతం బుల్లితెరపై బిజీ ఆర్టిస్టుల్లో ఒకరు నూకరాజు. 'పటాస్'షోతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. ఈ మధ్యే ఓ రియాల్టీ షోలో తన ప్రియురాలితో కలిసి పాల్గొన్నాడు. ప్రస్తుతం సొంతంగా ప్రైవేట్ సాంగ్స్‌తో పాటు పలు టీవీ షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న టాక్ షోకి వెళ్లిన నూకరాజు.. తన చిన్ననాటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు.వర్షం వస్తే..ఇంట్లో నీళ్లు నిండేవిచిన్నప్పుడు చాలా కష్టాలను అనుభవించా. మాది చాలా పేద కుటుంబం. చిన్న పాకలో ఉండేవాళ్లం. వర్షం వస్తే.. ఇంట్లో నీళ్లు నిండేవి. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. చికెన్ తినాలంటే రెండు వారాల ముందే ఎదురు చూసేవాళ్లం. సంక్రాంతి పండుగ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుని ఆడుకుంటే.. మేము మాత్రం పనికి వెళ్లేవాళ్లం. ఇంట్లో యాపిల్స్ కొనేవారు కాదు. జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ఎవరో తీసుకొచ్చేవారు. అందుకే చిన్నప్పుడు 'జ్వరం వస్తే బాగుండు’అని అనుకునేవాళ్లం.బంగారం తాకట్టు పెట్టాల్సిందే.. చేతిలో డబ్బులు ఉండేవి కాదు. నాన్నకు ఏదైనా రోగం వస్తే బంగారం తాకట్టు పెట్టాలి లేదా అమ్మేసి.. ఆస్పత్రిలో చూపించాలి. అంతకు మించి వేరే మార్గం ఉండేది కాదు. ఆ పరిస్థితులు చాలా బాధాకరంగా ఉండేవి. మా నాన్న మద్యానికి బానిస కావడంతో మా కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించింది. అంతకు ముందు పూరి గుడిసెలో ఉన్నా.. అందరం కలిసి సంతోషంగా ఉండేవాళ్లం. ఎప్పుడైతే నాన్న మద్యానికి అలవాటు పడ్డాడో అప్పటి నుంచి ముద్ద సరిగా లోపలికి వెళ్లేది కాదు’ అంటూ నూకరాజు ఎమోషనల్ అయ్యాడు. ‘ఎవరైనా వెన్నుపోటు పొడిచారా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ..‘దాన్ని వెన్నుపోటు అనలేను. కానీ నాతో కలిసి పనిచేసే ఓ ఆర్టిస్ట్ తన చెల్లి పెళ్లి కోసం డబ్బు కావాలని అడిగాడు. ఎలాంటి కాగితం రాసుకోకుండా నమ్మకంతో రూ.13 లక్షలు ఇచ్చాను. చివరికి అతడు నన్ను మోసం చేశాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.