breaking news
Italian couple
-
కౌగిలింతలు ఇస్తా.. రండి ప్లీజ్!
ఆస్ట్రేలియా వాసులకు ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని ఓ సరికొత్త అనుభవం ఎదురవుతోంది. అక్కడ పర్యటిస్తున్న ఇటాలియన్ జంట.. ఆస్ట్రేలియన్లకు కౌగిలింతలు ఇస్తూ వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఎరికా డెల్లా మురా (20), ఆమె భర్త నికోలో మార్మిరోలి (21) అనే ఈ ఇద్దరూ బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కళ్లకు గంతలు కట్టుకుని రెండు చేతులూ ముందుకు చాచి.. వచ్చి మమ్మల్ని కౌగిలించుకోండి అని పిలుస్తున్నారు. ఇందుకోసం వాళ్లు అక్కడ ఒక కార్డుబోర్డు మీద తమ విజ్ఞప్తిని రాసి ఉంచడంతో పాటు.. చిన్నపాటి హుండీ కూడా అక్కడ పెట్టారు. ''నేను మిమ్మల్ని నమ్ముతున్నా.. మీరు నన్ను నమ్ముతారా? వచ్చి కౌగిలించుకోండి. ఈ కౌగిలింతలు ఉచితమే. కానీ మేం ఈ అందమైన దేశంలో పర్యటించడానికి మీరు సాయం చేయాలనుకుంటే, చేయండి. థాంక్యూ సో మచ్' అని ఆ కార్డుబోర్డు మీద రాశారు. గడిచిన ఏడు నెలలుగా ఈ దంపతులిద్దరూ వర్కింగ్ వీసాలు తీసుకుని ఆస్ట్రేలియాలో తిరుగుతున్నారు. అరగంట పాటు అక్కడ నిలబడి కౌగిలింతలు ఇస్తే.. భోజనానికి సరిపడ డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే, తాము ఇదంతా డబ్బుల కోసమే చేయట్లేదని ఎరికా చెప్పింది. చాలామంది వచ్చి థాంక్స్ అని, జాగ్రత్తగా వెళ్లిరండి అని చెబుతున్నారని ఆమె తెలిపింది. మరికొందరు ఏమీ చెప్పకుండా ఊరికే కౌగిలించుకుని వెళ్లిపోతున్నారట. ఇప్పటివరకు అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ, బైరన్ బే, బ్రిస్బేన్ నగరాల్లో అపరిచితులను వాళ్లు కౌగిలించుకున్నారు. -
చెయ్యెత్తితే విమానం ఆగుతుందా!!
వాలెట్టా: 'చెయ్యెత్తండి.. బస్సు ఎక్కండి' అనే మన ఆర్టీసీ నినాదాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో.. ఎకంగా కదులుతున్న విమానానికి ఎదురెళ్లి 'ఆపండి.. మేం లోపలికి ఎక్కాలి' అంటూ హడావిడిచిచేసింది ఓ ఇటాలియన్ జంట! దక్షిణ ఐరోపాలోని ద్వీప దేశం మాల్టాలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు మాల్టా కోర్టు శుక్రవారం ముగింపు పలికింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మ్యాటియో క్లెమెంటి (26) అనే ఆయన తన గర్ల్ ఫ్రెండ్ ఎన్రికా అపోలోనియా (23)తో కలిసి మాల్టా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో వాళ్లు ఎయిర్ పోర్టుకు చేరుకునే సరికి చెక్ఇన్ సహా అన్ని కౌంటర్లు మూసేశారు. అటు చేస్తూ వాళ్లు వెళ్లాల్సిన విమానం అప్పుడే కదులుతోంది. ఇంటికి వెళ్లాలనే దొందర్లో మరేమీ ఆలోచించకుండా సెక్యూరిటీ గర్డుల్ని తోసేసిమరీ మరో గేటు ద్వారా టెర్మినల్‌లోకి దూసుకెళ్లారు. విమానం ఆపాలంటూ పెలట్కు రకరకాల సంజ్ఞలు చేశారు. అఫ్కోర్స్ విమానం ఆగకముందే ఆ జంటను తమ అదుపులోకి తీసుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. కేసు కోర్టుకు చేరింది. అసలు ఎందుకలా చేశారు? అన్న జడ్జిగారి ప్రశ్నకు 'కుటుంబంతో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నా. ఆ విమానం మిస్ అయితే మళ్లీ 24 గంటల తర్వాతగానీ మరో విమానం లేదు. అందుకే ధైర్యం చేశాం. మాది తప్పయితే క్షమించండి' అని సమాధానమిచ్చారు మ్యాటియో, ఎన్రికా. ఇద్దరికీ కలిపి రెండున్నర వేల డాలర్ల జరిమానా విధించారు జడ్జిగారు.