breaking news
IQ test
-
ఆటిజం ఉన్నా ఐక్యూలో ఘనం! 12 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ
మెక్సికోకు చెందిన ఈ పన్నెండేళ్ల బాలికకు చిన్నప్పటి నుంచి ఆటిజం సమస్య ఉంది. మూడేళ్ల వయసులో స్కూల్లో చేరిన తొలి నాళ్లలో తోటి పిల్లలు ఏడిపించేవారు. టీచర్లు కూడా ఈమె పట్ల పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఈమె ఏకంగా గణితంలో మాస్టర్స్ డిగ్రీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈమె పేరు ఆధరా పెరెజ్ సాన్షెజ్. మెక్సికో సిటీలో పుట్టి పెరుగుతోంది. ఇప్పుడామె ఒకవైపు మాస్టర్స్ డిగ్రీ కోసం పాఠాలను చదువుకుంటూనే, తన తోటి పిల్లలకు, తన కంటే పెద్దవారికి కూడా లెక్కల్లో పాఠాలు చెబుతోంది. మరోవైపు మెక్సికన్ స్పేస్ ఏజెన్సీ కోసం కూడా సేవలందిస్తోంది. ఏనాటికైనా అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’తో కలసి పనిచేయాలనేదే తన లక్ష్యమని చెబుతోంది. ఐదేళ్ల వయసులో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న ఆధరా, మరుసటి ఏడాదిలోనే మిడిల్ స్కూల్, హైస్కూల్ పరీక్షలను ఒకే ఊపులో గట్టెక్కింది. ఐదేళ్ల వయసులోనే పిరియాడిక్ టేబుల్ కంఠస్థం చేయడమే కాకుండా, కఠినమైన ఆల్జీబ్రా సమస్యలను అలవోకగా పరిష్కరిస్తుండటం చూసి, ఆధరా తల్లి ఆమెను థెరపిస్ట్ వద్దకు తీసుకువెళ్లింది. చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడింది. వయసుకు మించిన పరీక్షల్లో వరుస ఉత్తీర్ణతలు సాధిస్తూ, గత ఏడాది మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశం సాధించింది. ఆధరాకు చికిత్స చేసిన థెరపిస్ట్ ఆమెలోని ప్రతిభను గుర్తించి, ఆమెను ‘సెంటర్ ఫర్ అటెన్షన్ టు టాలెంట్’ (సీఈడీఏటీ)కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆమె ఐక్యూ 160 అని నిపుణులు తేల్చారు. అంటే, ఆమె ఐక్యూ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే ఎక్కువే! ప్రస్తుతం అరిజోనా యూనివర్సిటీ ఆమెకు స్కాలర్షిప్ ప్రకటించినా, వీసా ఆలస్యం కావడంతో అక్కడ చేరడం వాయిదా పడింది. ప్రస్తుతం చదువుకుంటున్న మాస్టర్స్ డిగ్రీ పూర్తయితే, అరిజోనా యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ కోర్సులో చేరనుంది. (చదవండి: 'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై) -
ఈ బాలికకు ఐన్‌స్టీన్ మించిన ఐక్యూ
లండన్: భారత సంతతికి చెందిన బాలిక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఐక్యూ(మేథ) పరీక్షల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా 162 పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లు ప్రపంచ ప్రఖ్యాత మేథావులు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే కూడా రెండు పాయింట్లు ఎక్కువే కావటం గమనార్హం. లండన్‌లోని చెషైర్ కౌంటీలో నివసించే ప్రవాస భారతీయుడు డాక్టర్ సూరజ్ కుమార్ పవార్ కుమార్తె రాజ్‌గౌరి పవార్. 18 ఏళ్లలోపు వారికి నిర్వహించే ఐక్యూ పరీక్షలో రాజ్‌గౌరి పాల్గొని అత్యధికంగా 162 పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో మెన్సా సంస్థ రాజ్గౌరిని తమ బ్రిటిష్ మెన్సా ఐక్యూ సొసైటీ సభ్యురాలిగా చేర్చుకుంది. స్కూల్లో టీచర్లు ఇస్తున్న ప్రోత్సాహంతోనే తమ కుమార్తె ఇంతటి ప్రతిభను చాటగలిగిందని బాలిక తండ్రి సూరజ్‌కుమార్ పవార్ తెలిపారు. సాధారణంగా 140 పాయింట్లు సాధించిన వారిని జీనియస్‌గా పరిగణిస్తామని మెన్సా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20వేల మంది మాత్రమే ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్నారని వివరించింది.