breaking news
Innovative design
-
ఆకట్టుకునే స్మార్ట్ టాయిలెట్లు
టోక్యో : పబ్లిక్ టాయిలెట్లు అనగానే అపరిశుభ్రత, దుర్వాసనలతో జనం వాటికి దూరంగా జరిగే పరిస్ధితి నెలకొంటే టోక్యోలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ వాటిని అద్భుత డిజైన్‌తో ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. పారదర్శక వాల్స్‌తో భిన్నమైన రంగుల్లో టాయిలెట్లను డిజైన్ చేశారు. బయటనుంచి పారదర్శకంగా కనిపించే మూత్రశాలలు, ఉపయోగించే సమయంలో డార్క్‌గా మారేలా ఏర్పాటు చేయడం ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్లు అంటే ముక్కు మూసుకునేలా ఉన్నా జపాన్‌లో రెస్ట్‌రూమ్స్ అత్యంత మెరుగైన పారిశుద్ధ్య ప్రమాణాలకు నిలువుటద్దంలా ఉంటాయి. పారిశుద్ధ్య పరిస్ధితి మెరుగ్గా ఉండే జపాన్‌లోనూ పబ్లిక్ టాయిలెట్లపై నెలకొన్న అపోహలను చెరిపివేసేందుకు నిప్పన్ ఫౌండేషన్ ది టోక్యో టాయిలెట్ ప్రాజెక్టును చేపట్టింది. టోక్యోలోని జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లో 17 పబ్లిక్ టాయిలెట్లను పునరుద్ధరించే బాధ్యతను 16 మంది ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లకు అప్పగించింది. వయసు, వైకల్యం, లింగ బేధాలతో నిమిత్తం లేకుండా పబ్లిక్ బాత్రూంలు అందరికీ అందుబాటులో ఉండేలా వినూత్న డిజైన్‌తో వీటిని చేపట్టాలని సూచించింది. వీటిలో హరునొవగ్వా కమ్యూనిటీ పార్క్ వద్ద ప్రిట్కర్ ప్రైజ్ గెలుపొందిన ఆర్కిటెక్ట్ షిగెరు బాన్ ఏర్పాటు చేసిన పారదర్శక పబ్లిక్ టాయిలెట్ల డిజైన్ ఆకట్టుకుంటోందని నిప్పన్ ఫౌండేషన్ తెలిపింది. బాన్ డిజైన్ చేసిన ఈ టాయిలెట్లలో ఒక్కో యూనిట్లో మూడు క్యూబికల్స్ ఉంటాయి. న్యూ స్మార్ట్‌గ్లాస్ టెక్నాలజీ వాడటంతో డోర్ లాక్ చేసి ఉన్న సమయంలో టాయిలెట్ గోడలు డార్క్‌గా మారతాయని నిప్పన్ ఫౌండేషన్ తెలిపింది. రాత్రి సమయాల్లో ఇవి అందమైన లాంతర్ల తరహాలో పార్కుల్లో వెలుగులు విరజిమ్ముతాయని పేర్కొంది. ప్రముఖ ఆర్కిటెక్టులు రూపొందించిన డిజైన్లతో ఆయా పబ్లిక్ రెస్ట్రూమ్లు దశలవారీగా ప్రారంభమవుతాయని వెల్లడించింది. చదవండి : నవ్వొద్దని ప్రభుత్వం ఆంక్షలు, కానీ.. -
ఈకల కోకలు
రాతియుగం సెకండాఫ్‌లో బట్టలు చుట్టుకోవడం నేర్చిన మానవులు.. అంచెలంచెలుగా ఆధునికతను అందిపుచ్చుకున్నారు. చెట్ల ఆకులు కట్టుకున్న చేతులతోనే.. పట్టుపీతాంబరాలు చుట్టుకున్నారు. జంతు చర్మాలను ధరించిన వాళ్లే.. లెదర్‌తో నయా డిజైన్లను ప్రపంచానికి పరిచయం చేశారు. విప్లవాత్మకమైన మార్పులతో కొత్తపుంతలు తొక్కిస్తున్న ఫ్యాషన్ డిజైనర్లు ఇప్పుడు మూలాల్లోకి వెళ్లి ఆనాటి ట్రెండ్స్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఆదివాసీలు అలంకరించుకునే పక్షుల ఈకలతో ఇన్నోవేటివ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి మార్కెట్లో మార్కులు కొట్టేస్తున్నారు. ఫాస్ట్‌గా మూవ్ అవుతున్న ప్రపంచం కోసం ఫ్యాషన్ రంగం సైతం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. ఈతరం అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తెస్తోంది. కాటన్ శారీస్, సిల్క్ స్కర్ట్స్.. వందల రకాల ఫ్యాబ్రిక్స్‌తో వేల రకాల కాస్ట్యూమ్స్ మగువల మనసులు దోచేశాయి. ఇప్పుడదే కోవలోకి ఫెదర్స్ ట్రెండ్‌ను చేరుస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. నెమలీకలు.. కోడీకలు.. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్‌తో కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అని రుజువు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. నెమలి, కోడి, పావురాల ఈకలతో సరికొత్త వస్త్రాలు తయారు చేస్తున్నారు. నెమలీకలతో వెడ్డింగ్ డ్రెస్, ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్స్, మినీ డ్రెస్, స్కర్ట్స్ రూపొందిస్తున్నారు. చీరల కొంగులకు ఈకలతో ముడివేసి.. అతివల అందానికి మరింత వన్నె తెస్తున్నారు. కోడి ఈకలు, పావురాల ఈకలు కూడా ఫెదర్ ట్రెండ్‌లో సత్తా చాటుతున్నాయి. రంగురంగుల ఈకలు అల్లుకున్న డ్రెస్‌లు మగువల మనసును దోచేస్తున్నాయి. అదనపు సొబగులు.. పట్టుపోగులతో సవరాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈకలతో రూపుదిద్దుకున్న హెయిర్ యాక్ససరీస్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. రంగురంగుల ఫెదర్ హెయిర్ యాక్ససరీస్ కురుల అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఇవేకాకుండా ఫెదర్ హెయిర్ హ్యాట్, ఫెదర్ హెయిర్ క్లిప్స్, ఇయర్ హ్యాంగింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈకలతో రూపొందించిన పౌచెస్ కూడా అందర్నీఆకట్టుకుంటున్నాయి. ఈ తరం కాలేజ్ స్టూడెంట్స్, మోడల్స్, హీరోయిన్లు సైతం నైట్ పార్టీలకు ఇలాంటి ఇన్నోవేటివ్ కలెక్షన్స్ వేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. సిరి