breaking news
industries set up
-
ఏపీ: రూ.10,350.21 కోట్ల పెట్టుబడులకు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రూ.10,350.21 కోట్ల పెట్టుబడులతో కీలకమైన ఐదు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 12,454 మందికి ఉపాధి లభించనుంది. నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్, నాయుడుపేట సెజ్‌లో గ్రీన్‌టెక్ విస్తరణ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్యాపిటల్ బిజినెస్ పార్క్ నిర్మించే టెక్స్టైల్ పార్క్, చిత్తూరు జిల్లాలో అమ్మయప్పర్ గార్మెంట్స్ తయారీ యూనిట్, విశాఖలో సెయింట్ గోబెయిన్ ప్రాజెక్టులకు అనుమతులు, ప్రత్యేక రాయితీలు ఇస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టుల వారీగా ఆ వివరాలు ఇవీ గ్రీన్‌టెక్ భారీ విస్తరణ నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏపీ సెజ్‌లోని ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థ గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ విస్తరణ ప్రాజెక్టును చేపట్టింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు స్టీల్ కాస్టింగ్ రంగంలోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం రూ.627 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విస్తరణ ద్వారా ప్రత్యక్షంగా 2,200 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ విస్తరణ పనులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్ల పాటు యూనిట్ చార్జీ ఒక రూపాయిని తిరిగి ఇవ్వనుంది. గరిష్టంగా రూ.3.75 కోట్లు ఇవ్వనున్నారు. 2020–23 పారిశ్రామిక పాలసీ ప్రకారం రాయితీలు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. చిత్తూరులో గార్మెంట్ యూనిట్.. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలకట్టూర్లో రూ.29.05కోట్లతో డెనిమ్ మెన్స్, కిడ్స్ గార్మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అమ్మయప్పర్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 2,304 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ యూనిట్‌కు యూనిట్ విద్యుత్ ఒక రూపాయి చొప్పున ఇవ్వడంతోపాటు ఐదేళ్ల పాటు 100 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపులు, స్టాంప్ డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో సెయింట్ గోబెయిన్.. విశాఖ సమీంపలోని అచ్యుతాపురం సెజ్‌లో సెయింట్ గోబెయిన్ సంస్థ రూ.2,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జిప్సం ప్లాస్టర్ బోర్డ్, ఫోట్ గ్లాస్ తయారీ యూనిట్ పనుల కాలపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్, లాక్డౌన్ కారణంగా తొలి దశ పనులు ఆలస్యం కావడంతో కాలపరిమితి పొడిగించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం ఆమోదించింది. తొలిదశ పనుల పూర్తికి గడువును 2022 జూన్ వరకు పొడిగించింది. సెయింట్ గోబెయిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరును సెయింట్ గోబెయిన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్పునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.7,500 కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ జిందాల్ స్టీల్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) నెల్లూరు జిల్లాలో రూ.7,500 కోట్లతో టీఎం టీ బార్స్, వైర్ రాడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంతో వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా 15, 000 మందికి ఉపాధి లభించనుంది. జిందాల్ గ్రూపు ఇందుకోసం జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ నెలకొల్పేందుకు నెల్లూరు జిల్లా చిల్లకూర్ మండలం మోమ్మిడి గ్రామం వద్ద 860 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూమి ధరను ఏపీఐఐసీ నిర్ణయిస్తుందని, ఇంటిగ్రేటెడ్ స్టీల్ యూనిట్ ఏర్పాటు సమయంలో ఆర్ అండ్ ఆర్ చార్జీలు చెల్లించాల్సి వస్తే జిందాల్ సంస్థే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. తాడేపల్లిలో మెగా రిటైల్ పార్క్ గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద రూ.194.16 కోట్లతో అప్పారెల్ అండ్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి క్యాపిటల్ బిజినెస్ పార్క్ ఎల్ఎల్పీ ముందుకొచ్చింది. సుమారు 900 టెక్స్టైల్ షాపులు ఏర్పాటు చేసే విధంగా 7 లక్షల చదరపు అడుగుల్లో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీనిద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రతిపాదనకు ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీ 2021–26 ప్రకారం రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తే రిటైల్ పార్క్ మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. గరిష్టంగా రూ.3 కోట్ల వరకు చెల్లిస్తారు. 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
వారికిచ్చిన భూములు రద్దు చేస్తాం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : పరిశ్రమల శాఖ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హైదరాబాద్ ఫార్మా సిటీపై సంబంధిత అధికారులతో మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భూములు పొంది కార్యకలాపాలు ప్రారంభించని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కేటీఆర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించకుంటే, కంపెనీలకు ఇచ్చిన భూములు రద్దు చేస్తామని హెచ్చరించారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ-స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యకలాపాల విస్తరణకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. హైదరాబాద్ ఫార్మా సిటీ కాలుష్య రహితంగా ఉండబోతోందని కేటీఆర్ అన్నారు. (‘కార్పొరేషన్ పేరిట ప్రభుత్వం అప్పులు చేస్తోంది’) -
ఒక్క పరిశ్రమనూ తేలేని దద్దమ్మ బాబు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతోందని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, ప్రత్యేక హోదా తీసుకురాలేక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ఏపీని బాబు తాకట్టు పెట్టాడన్నారు. రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలీని పప్పుకి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. సోది సోమిరెడ్డి, కలెక్షన్ కింగ్ నారాయణలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.. దొడ్డిదారిలో మంత్రులైన వీరు పార్టీకి పెట్టిన పెట్టుబడులను ప్రజల నుంచి తిరిగి దోచుకుంటున్నారని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని, వీరిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు అమ్ముడుపోతున్నారని అన్నారు. క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరని చంద్రబాబును రోజా హెచ్చరించారు. -
పరిశ్రమల ఏర్పాటుపై ఉచిత కౌన్సెలింగ్
సనత్‌నగర్ (హైదరాబాద్): ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భారతీయ యువశక్తి ట్రస్ట్ (బీవైఎస్టీ) ఆధ్వర్యంలో బేగంపేట్ మోతీలాల్ నెహ్రునగర్‌లోని సంస్థ కార్యాలయంలో గురువారం ఉచిత కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఈ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. పరిశ్రమ నెలకొల్పడానికి కావలసిన వనరులు ఏమిటి ? రుణం పొందడమెలా ? మార్కెటింగ్ మెళకువలు తదితర అంశాల గురించి తెలియజేయనున్నారు. వివరాలకు ఫోన్: 040-2776 5774 నెంబర్లో సంప్రదించవచ్చు.