indiranagar
-
నీళ్లు తెమ్మంటే తీసుకురావా రా..
హన్మకొండ చౌరస్తా : ‘నీళ్లు తెమ్మంటే తీసుకురావా రా.. నాకే ఎదురు సమాధానం చెబుతావా’ అంటూ జూనియర్ పై ఓ సీనియర్ విద్యార్థి దాడికి పాల్ప డ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి హనుమకొండలోని ఇందిరానగర్ ఎస్సీ హాస్టల్లో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన రాజబాబు, పవన్‌కల్యాణ్, రణధీర్, మధుకర్ హనుమకొండ 8వ డివిజన్లోని ఇందిరానగర్‌లో గల ఎస్సీ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. సుమారు పదిహేను రోజుల క్రితం ఇదే హాస్టల్లో ఉంటూ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న రంజిత్ వాటర్ బాటిల్లోని నీరును రాజబాబు తాగాడు. విషయం తెలుసుకున్న రంజిత్ ‘నా వాటర్ బాటిల్లోని నీరు తాగి మళ్లీ తీసుకురాకుండా వెళ్తావా’ అంటూ గద్దించాడు. దీంతో భయపడిన జూనియర్ విద్యార్థి రాజబాబు అన్న రూమ్‌లో ఉంటే తాగి వెళ్లిపోయానన్న నీ బాటిల్ అని తెలియదని సమాధానం ఇచ్చాడు. నీళ్లు తీసుకురాకుండా నాకే ఎదురు సమాధానం చెబుతావా, నీ సంగతి చెబుతా అంటూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి హాస్టల్లో రాజబాబు ఎదురుపడినా ప్రతీసారి దూషణకు దిగేవాడు. రాజబాబు అతడి మిత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయినా రెచ్చగొట్టేలా వ్యవహరించేవాడు. ఆదివారం రాత్రి రంజిత్ హాస్టల్‌కు సంబంధం లేని కొందరి వ్యక్తులను తీసుకొచ్చి రాజబాబుపై దాడికి దిగాడు. అడ్డుకున్న అతడి మిత్రులు పవన్‌కల్యాన్, రణధీర్, మధుకర్‌ను సైతం చితకబాదారు. ఈ ఘటనలో రాజబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత విద్యార్థులు తెలిపారు. ఈ విషయం పై హాస్టల్ వార్డెన్ మోతీలాల్‌ను వివరణ కోరగా గాయపడిన విద్యార్థికి చికిత్స చేయించామని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. -
ఇల్లు దగ్ధం.. మహిళ సజీవ దహనం
సాక్షి, అనంతపురం రూరల్: అనంతపురం నగరంలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఇందిరానగర్‌లో గుడిసెకు నిప్పంటుకుని ఓ మహిళ సజీవ దహనం అయింది. మృతురాలిని ఒంటరి మహిళ రజియాబీగా గుర్తించారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దలప్లాన్..పేదల విలవిల
ఇందిరా సత్యనగర్ పుంత పేదల ఇళ్లకు ఎసరు 80 అడుగుల రోడ్డు విస్తరణకు అధికారుల ప్రయత్నాలు సర్వే లేకుండానే పనులు చేసేందుకు యత్నం ఆక్రమణదారులెవరు? ఎందరో తేల్చాలని స్థానికుల డిమాండ్ నీటి సరఫరా నిలిపివేత, వైఎస్సార్సీపీ జోక్యంతో పునరుద్ధరణ చర్యల వెనుక అధికార పార్టీ నేతల హస్తం 200 కుటుంబాల్లో అలజడి ... సాక్షి, రాజమహేంద్రవరం : ఉండటానికి గూడు లేకపోవడంతో 44 ఏళ్ల క్రితం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వెనుక ఉన్న ఇందిరానగర్ రెవెన్యూ సర్వే నంబర్ 89లోని పుంతను చదును చేసుకుని చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రస్తుతం గూడును కోల్పో యే పరిస్థితి ఏర్పడింది. 1975 మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం కోరుకొండ రోడ్డు నుంచి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వెనుక అన్నయాచారి రోడ్డును కలుపుతూ 80 అడుగుల రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే దాన్ని 1989లో స్థానికులు విజ్ఞప్తి మేరకు అప్పటి నగరపాలక మండలి 40 అడుగులకు కుదిస్తూ అక్కడున్న వారికి పట్టాలు మంజూరు చేసేవిధంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించ లేదు. అయితే తర్వాత 1998లో ఆ రోడ్డును 80 అడుగుల నుంచి 40 అడుగులకు కుదించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం నగరపాలక సంస్థ యంత్రాంగం పుంతలో ఉన్న పేదలను ఖాళీ చేయించి 80 అడుగుల రోడ్డును నిర్మించాలని ప్రయత్నిస్తోంది. 1973 నుంచి ఆ పుంతలో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. 1989లో నగరపాలక మండలి తీర్మానం మేరకు అక్కడ 76 మంది ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. పేదల ఇళ్లను ఆనుకుని, ముఖ్యంగా ధనవంతుల ఇళ్లకు ముందు రోడ్డువైపున పేదల ఇళ్లున్నాయి. ప్రస్తుతం అక్కడ కొంత మంది రాజకీయ నాయకులు, పీఅండ్‌టీ కాలనీ వాసులు పేదలను ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సర్వే లేకుండానే పనులు ఎలా? గత చరిత్రను పక్కన పెట్టిన ప్రస్తుత పాలకవర్గం, యంత్రాంగం పుంతలోని ఆక్రమణదారులను ఖాళీ చేయించి 80 అడుగుల రోడ్డు వేయాలని ప్రయత్నిస్తోంది. నగరాన్ని అభివృద్ధి చేయాలన్న యంత్రాంగం చర్యలు తమ బతుకులను ఛిద్రం చేయరాదన్నది అక్కడి పేదల విన్నపం. పుంత ఆక్రమణలో పేదలతోపాటు, ఆ తర్వాత అక్కడ ప్రైవేటు స్థలాలు కొన్నవారు కూడా కొంత ప్రాంతాన్ని తమ స్థలంలో కలుపుకున్నారు. ఆ అనవాళ్లు ఆక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి వెనుక వైపున అన్నయాచారి రోడ్డు నుంచి కోరుకొండ రోడ్డులోని క్వారీ సెంటర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉంది. మధ్య మధ్యలో రోడ్డు వెడల్పు ప్రస్తుతం పలు రకాలుగా ఉంది. నగరపాలక మండలి 1998 తీర్మానం ప్రకారం 40 అడుగులు కాకుండా 80 అడుగుల మేర రోడ్డును వేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అక్కడ ఉన్న పేదలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు పుంత ఎంత స్థలం? ఎక్కడ వరకు ఉంది? ఆక్రమణ ఎంత మేర గురైంది? ఆక్రమణదారులు ఎవరు? ఎంత ఆక్రమించారు? అన్న విషయాలు తేల్చేందుకు సర్వే చేయకుండా పేదల ఇళ్లను మాత్రమే తొలగించాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. కోరుకొండ రోడ్డు 80 అడుగులు ... అదే విధంగా అన్నయాచారి రోడ్డు కనీసం 30 అడుగులు కూడా లేదు. అలాంటిది ఈ రెండు రహదారులను కలుపుతూ వేసే లింకు రోడ్డు 80 అడుగులు ఉండడం, పీఅండ్‌టీ కాలనీ సంఘానికి, అక్కడ పేదలకు గత కొన్నేళ్లుగా వివాదాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు... యంత్రాంగం తాను అనుకున్న పనిని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా పదిహేను రోజుల క్రితం పుంతలోని అన్నయాచారి రోడ్డువైపు ప్రారంభంలోని నీటి కుళాయిని తొలగించింది. అయితే పేదల విషయం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి అధికారుల దృష్టికి తీసుకురావడంతో కుళాయిని పునరుద్ధరించారు. ఘటనా స్థలానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. అయితే మరుసటి రోజు నుంచి కూడా యంత్రాంగం తమ ప్రయత్నాలను ఆపలేదు. దీంతో స్థానికులు నగరపాలక సంస్థ ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎప్పడు ఎవరొస్తారు? ఏమి చేస్తారోనన్న ఆందోళనలో కాలనీ వాసులున్నారు. -
బ్యాంక్ లోన్ అంటూ మోసం..
బంజారాహిల్స్ : బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యాపారిని నమ్మించి లక్షలాది రూపాయలకు టోకరా వేశాడో యువకుడు. దీనిపై బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా వారు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్ నివాసి ఖురేషి నిసార్ అహ్మద్ అనే వ్యాపారికి కర్నూలు నగరంలోని భాస్కర్‌నగర్‌కు చెందిన కేఎం.ఇలియాస్(28) గత ఏడాది పరిచయం అయ్యాడు. మాసబ్ ట్యాంకులో నివాసముంటున్న తాను చార్టెడ్ అకౌంటెంట్‌ను అని ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టెర్డు బ్యాంకు, ఎస్బీఐ తదితర బ్యాంకుల్లో మంచి పరిచయాలున్నాయని, దక్షిణాఫ్రికాలో చేపట్టబోయే వ్యాపారానికి అవసరమైన రూ. 20 కోట్ల రుణాన్ని తాను ఇప్పించగలనంటూ నమ్మించాడు. ఇందుకోసం పలు దఫాలుగా ఆయన్నుంచి రూ.45 లక్షలు వసూలు చేశాడు. ఎన్ని రోజులు గడిచినా రుణం మాటే ఎత్తకపోవడంతో నిసార్ అహ్మద్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించగా ఎస్బీఐలో రూ.2.65 కోట్లు రుణం వచ్చిందంటూ బ్యాంకు పేరున ఉన్న రుణం మంజూరు పత్రాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఆయన సికింద్రాబాద్‌లోని ఎస్బీఐ బ్రాంచికి వెళ్లగా ఆ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో ఇలియాస్‌కు ఫోన్ చేసి నిలదీశాడు. ఇక అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. మోసపోయానని తెలుసుకొన్న ఖురేషి నిసార్ అహ్మద్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు ఇలియాస్‌పై ఐపీసీ 420, 406, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు
తనకల్లు, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో సీఆర్ పల్లి పంచాయతీ బంట్రోతుగా పని చేస్తున్న శ్రీరాములు కూతురు అనసూయ్యమ్మ ఇంటిలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో అతనితో పాటు భార్య నాగమ్మ, మనువళ్లు మూడేళ్ల దేవచరణ్ (చంటి), ఏడాది వయసున్న వినయ్ కుమార్(లడ్డు)కు తీవ్రంగా గాయపడ్డారు. అల్లుడు సూరి స్థానికంగా పనులు లేపోవడంతో బెంగళూరుకు వలస వెళ్లాడు. ఈ క్రమంలో కూతురు, మనువళ్లను స్వగ్రామంలో జరిగే పీర్ల పండుగకు తీసుకు వెళ్లేందుకు శ్రీరాములు, తన భార్య నాగమ్మతో కలసి తనకల్లు వచ్చాడు. మధ్యాహ్న భోజనం చేసి వెళదామని కూతురు చెప్పడంతో అందరూ ఆగిపోయారు. గ్యాస్ స్టౌ వెలిగించిన అనంతరం ఫోన్ రావడంతో అనసూయమ్మ బయటకు వెళ్లి మాట్లాడుతోంది. అంతలోనే గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలి పోయి మిద్దె కుప్ప కూలి పోయింది. బాధితుల్ని చుట్టు పక్కల వారు మంటలను ఆర్పి శిథిలాల నుంచి బయటకు తీశారు. 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కాగా శ్రీరాములుతో సహా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, నాగమ్మ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వారి బంధువులు తెలిపారు. దాదాపు రూ.2 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు ఇంటి యజమాని ఖాజీపీర్ చెప్పాడు. ఆర్ఐ నవీన్‌కుమార్, వీఆర్ఓ లత, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో తహశీల్దార్ కళావతి పరామర్శించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె చెప్పారు.