breaking news
ICPA
-
90 గంటల పని..ఎయిరిండియా పైలట్ల సంచలన ఆరోపణలు, ప్రయాణీకుల ప్రాణాలు!?
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ సొంతమైన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పైలట్లు సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పనిగంటలతో పాటు,హెల్త్ లీవ్‌లను నిరాకరిస్తోందని ఎయిరిండియా పైలట్ బాడీ, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఆరోపించింది. తాజా పరిణామంతో ప్రయాణీకుల భద్రత ప్రశ్నలను లేవనెత్తుతోంది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం పైలట్లు నెలకు 70 గంటలకు బదులుగా అన్ని విమానాలలో నెలకు 90 గంటలకు పైగా ప్రయాణించారని(ఫైయింగ్ అవర్స్) ఐపీజీ-ఐసీపీఏ వాదించింది. అలాగే ఎయిరిండియా యాజమాన్యం పైలట్లకు లీవ్‌లను నిరాకరిస్తోందని ఒక్కోసారి రద్దు చేస్తోందని తద్వారా చాలామంది పైలట్లు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించింది. అంతేకాదు సెలవులు పొందిన లేదా శిక్షణ పొందిన నెలల్లో వేతన కోతలతో వేధిస్తున్నారని పైలట్లు ఆరోపించారు. ఇకపై దీన్ని సహించలేమని, తమ జీవన నాణ్యత, పని-జీవిత సమతుల్యత, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని త్యాగం చేయలేమని పేర్కొన్నారు. (రిలయన్స్ మరో సంచలనం: గుజరాత్లో షురూ) కోవిడ్ తరువాత వేతనాల్లో కోత పెట్టిన సంస్థ ఇపుడు పూర్వ వేతనాలను చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్ 777 ఫ్లీట్ల కోసం ఎక్స్-ప్యాట్ పైలట్లను ప్రస్తుత దీర్ఘకాలిక పైలట్ల కంటే 80 శాతం ఎక్కువ వేతనంతో రిక్రూట్ చేస్తోందనీ భారతీయ పైలట్లపై చూపిస్తున్న ఈ వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఐపీజీ-ఐసీపీఏ తెలిపింది. కాగా సిబ్బంది కొరత నివేదికలను ఎయిరిండియా ఖండించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుసుకుంది. మరి తాజా ఆరోపణలపై ఎయిరిండియా సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. (బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా) -
ఎయిర్ ఇండియాలో సమ్మె?
న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మరోసారి అలజడి రేగింది. కేంద్ర కార్మిక శాఖ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెజారిటీ పైలట్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఫ్లైట్ కమాండర్స్ ను వర్క్ మెన్ జాబితా నుంచి తొలగిస్తూ కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్(ఐసీపీఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రెండు రోజుల్లో సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ఐసీపీఏ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కె కీర్తి తెలిపారు. సమ్మెకు ఐసీపీఏ నాలుగు విభాగాలు పూర్తి మద్దతు తెలిపాయని అన్నారు. రహస్య ఓటింగ్ ద్వారా సమ్మెపై అభిప్రాయాన్ని తెలుసుకున్నామని వెల్లడించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 మధ్య కాలంలో ఓటింగ్ నిర్వహించినట్టు చెప్పారు. ఎయిర్ ఇండియాలో మొత్తం 3,500 మంది కేబిన్ క్రూ సిబ్బంది ఉండగా వీరిలో 2,200 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా మిగతావారు కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు.