breaking news
ichampalli
-
మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి–సాగర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. గతంలో కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ అనుసంధాన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను వినియోగించదలిస్తే కేంద్రం సాయమందించే ఇచ్చంపల్లి–సాగర్ లింకు ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ మేరకు ఒక ప్రతిపాదనను తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముందుంచారు. దీంతో నాలుగేళ్ల కిందట గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తయారు చేసిన ఇచ్చంపల్లి–సాగర్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.మొత్తం 247 టీఎంసీల మళ్లింపు ఎన్‌డబ్ల్యూడీఏ 2020–21లో రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు అందజేసిన డీపీఆర్‌లో..ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధాన ప్రాజెక్టు, జలాల లభ్యత, మళ్లించే విధానం, అవసరమయ్యే నిధులు, ఆయా రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలు, వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితర అంశాలను స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం.. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి నదిపై 15.8 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ నిర్మించి తమిళనాడులో కావేరి నదిపై ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. బరాజ్ నుంచి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున నీటిని సాగర్‌కు మళ్లిస్తారు. ఈ దారిలో గొట్టిముక్కల బ్రాంచి కాలువ కింద నల్లగొండ జిల్లాలోని మునుగోడు, చండూరు ప్రాంతాల్లో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, ఎస్సారెస్పీ–2 కింద 1.78 లక్షలు, ఎస్ఎల్బీసీ కింద 1.09 లక్షల హెక్టార్లకు నీరందించాల్సి ఉంటుంది. ఇక ఏపీలో సాగర్ కుడి కాలువ కింద 1.26 లక్షల హెక్టార్లు, నాగార్జునసాగర్–సోమశిల కింద 1.68 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీటిని ప్రతిపాదించారు. సోమశిల–కావేరి మధ్య 2.5 లక్షల హెక్టార్లకు నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. మూడు రాష్ట్రాలకు 230 టీఎంసీలుగోదావరిలో వరద ఉండే జూన్–అక్టోబర్ నెలల్లో 143 రోజుల్లో 247 టీఎంసీలను మళ్లిస్తారు. ఇందులో ఆవిరి నష్టాలు పోనూ మిగిలే 230 టీఎంసీలలో తెలంగాణ 65, ఆంధ్రప్రదేశ్ 79.9, తమిళనాడు 84 టీఎంసీలు వినియోగించుకునేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు ఆ సమయంలోనే రూ.85 వేల కోట్ల మేర వ్యయాన్ని అంచనా వేసింది. ఇచ్చంపల్లి నుంచి సాగర్‌కు నీటిని మళ్లించే క్రమంలో మూడు లిఫ్టులు నిర్మించాల్సి ఉండగా, వీటి నిర్వహణకు 3,840 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమవుతుందని, ఇందుకు ఏటా రూ.770 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఇక ఇచ్చంపల్లి వద్ద నిర్మించే బరాజ్‌తో 9,300 హెక్టార్లు ముంపునకు గురికానుండగా, 22 వేల మంది నిరాశ్రయులవుతారని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లో తెలంగాణ వ్యతిరేకించింది. దీనికి దిగువన అకినేపల్లి నుంచి ఒక ప్రతిపాదన, తుపాకులగూడెం నుంచి మరో ప్రతిపాదన, దుమ్ముగూడెం నుంచి ఇంకో ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే ఇంద్రావతి మిగులు జలాలపై ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో దీనిపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలవరం–బనకచర్ల చేపట్టడంతో, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ తాజాగా ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. -
ఇచ్చంపల్లికే మొగ్గు !
సాక్షి, హైదరాబాద్ : నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా జలాలను కావేరీకి తరలించే క్రమంలో ఇచ్చంపల్లి నుంచే నీటి తరలింపునకు కేంద్రం మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన అకినేపల్లి ప్రతిపాదనను, జనంపేట నుంచి పైప్‌లైన్ ద్వారా నీటి తరలింపు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించడంతో ఇచ్చంపల్లి నుంచి నీటిని నాగార్జునసాగర్‌కు తరలించే ప్రతిపాదనకు పదును పెడుతోంది. అనుసంధాన ప్రక్రియపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇచ్చంపల్లి నుంచి నీటి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చిన ఎన్‌డబ్ల్యూడీఏ.. దీనిపై తెలంగాణ అభిప్రాయాలు కోరింది. నిజానికి ఎన్‌డబ్ల్యూడీఏ మొదట 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరీకి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలపడంతో జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూసేకరణ తగ్గించేలా పైప్‌లైన్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. అయితే పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తే వ్యయం ఏకంగా రూ.90 వేల కోట్ల మేర ఉంటోంది. కాల్వల ద్వారా అయితే రూ.60 వేల కోట్ల వరకే వ్యయం ఉంటోంది. అయినా ఈ ప్రతిపాదనతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. ఈ అనుసంధానం ద్వారా ఎస్సారెస్పీ–2లోని కాకతీయ కాల్వల ఆయకట్టు, ఎస్ఎల్బీసీ ఆయకట్టు, డిండి ఆయకట్టుకు కలిపి మొత్తం 9 లక్షల హెక్టార్లు (25 లక్షల ఎకరాలు) ఆయకట్టుకు నీరు అందించొచ్చని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.73 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కోరింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నీటిని కృష్ణాకు తరలించే అంశమై చర్చలు జరుగుతున్న దృష్ట్యా, దీనిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్రం చేస్తున్న ప్రతిపాదనపై స్పష్టత ఇస్తామని తెలంగాణ తెలిపింది. -
మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియలో మళ్లీ ఇచ్చంపల్లి తెరపైకి వచ్చింది. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించే ప్రతిపాదనపైనా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దృష్టి పెట్టింది. గతంలో ప్రతిపాదించిన మాదిరి ఇచ్చంపల్లి వద్ద భారీ రిజర్వాయర్ కాకుండా చిన్న రిజర్వాయర్ నిర్మించి మిగులు జలాలను తరలించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జానంపేట, అకినేపల్లి ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. పాతదే.. మళ్లీ కొత్తగా.. దక్షిణాది నదుల కోసం ద్వీపకల్ప నదుల అభివృద్ధి పథకాన్ని చేపట్టిన కేంద్రం... అందులో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014లోనే మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్న దృష్ట్యా వాటిని కృష్ణా, కావేరి నదులకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ తీవ్రంగా తప్పుపట్టాయి. ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానానికి 299 కి.మీ. మేర నీటి తరలింపు ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరమవుతాయని, ఇందులో ప్రధాన లింక్ కెనాల్‌కే రూ. 14,636 కోట్లు అవసరమని లెక్కగట్టింది. 312 కి.మీ. పొడవైన ఇచ్చంపల్లి–పులిచింతలకు సైతం భారీ అంచనా వ్యయాలనే ప్రతిపాదించారు. ఇక అనుసంధాన కాల్వల వెంబడి రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల తవ్వకంతో 226 గ్రామాలు, లక్ష మంది ప్రజలు ప్రభావితం కానున్నారు. మరో 51 వేల ఎకరాల అటవీ, 70 వేల ఎకరాల వ్యవసాయ భూమి ప్రభావితమయ్యే అవకాశం ఉందని గతంలో తేల్చారు. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంతో ఇది మూలన పడింది. దీనికి బదులుగా ఖమ్మం జిల్లా అకినేపల్లి నుంచి 247 టీఎంసీలు సాగర్‌కు, అటు నుంచి కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపైనా తెలంగాణ వ్యతిరేకత చూపడంతో ఇదే జిల్లాలో జానంపేట నుంచి పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించింది. అయితే దీని ద్వారా సైతం తమకు ఒనగూరే ప్రయోజనం లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇచ్చంపల్లి తెరపైకి వచ్చింది. ఇక్కడ చిన్న రిజర్వాయర్ నిర్మించి ఆ నీటిని పెద్దవాగు రిజర్వాయర్, తమ్మలగుట్ట రిజర్వాయర్ల మీదుగా తరలించి సూర్యాపేట వద్ద గల మూసీతో కలపాలని ప్రతిపాదిస్తున్నారు. ఇటు నుంచి సాగర్ ఎడమ గట్టు కాల్వ పరిధిలోని ఆయకట్టుకు నీరందిస్తూ గోదావరి నీటిని సాగర్‌కు తరలించేలా ఈ కొత్త ప్రతిపాదన ఉంది. నీటిని పూర్తిగా పైప్‌లైన్ ద్వారా తరలిస్తేనే మేలన్న అభిప్రాయం ఉంది. ఇలా అయితే సాగర్ కింద కృష్ణా నీటి అవసరాలను తగ్గించవచ్చని, డిండిలో భాగంగా ఉన్న గొట్టిముక్కుల రిజర్వాయర్‌కు సైతం గోదావరి నీటిని తరలించే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నీటితో ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతాలైన చుండూర్, పెద్దఊర, గుర్రంపాడు, నార్కట్‌పల్లి ప్రాంతాలకు నీటిని అందించవచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఇది వీలుకాకుంటే ఇప్పటికే నిర్మిస్తున్న తుపాకులగూడెం నుంచి మూసీకి, అటు నుంచి సాగర్‌కు తరలించేలా మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన సైతం ఉంది. అయితే ఇందులో ఈ ప్రతిపాదనను తెలంగాణ ఆమోదిస్తుందన్నది తెలియాల్సి ఉంది. -
ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలి
హన్మకొండ : గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోరారు. సోమవారం వారు న్యూ ఢిల్లీలో మంత్రి ఉమా భారతినికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఇచ్చంపల్లి వద్ద అనకట్ట నిర్మిస్తే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు అందుతుందని మంత్రికి వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు వెన్నంపల్లి పాపయ్య, మధు పాల్గొన్నారు.