breaking news
human Traces history
-
‘సెర్చ్’ ఇంజన్లీ అమ్మలు
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో. దిల్లీలోని యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ సీమా దేవి, సుమన్ హుడా ఒక్కరు కాదు... ఇద్దరు కాదు రకరకాల కారణాలతో కనిపించకుండా పోయిన 104 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.ఒకప్రాంతంలో... ‘అయ్యా... నా కొడుకు వారం రోజుల నుంచి కనిపించడం లేదు...’‘ఫోటో ఉందా?‘లేదయ్యా’మరోప్రాంతంలో...‘మా అమ్మాయి కనిపించడం లేదు సారూ... ఎక్కడెక్కడో వెదికాం...’దిల్లీ, దిల్లీ చుట్టుపక్కలప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 104 ఆ పేద తల్లిదండ్రులలో చాలామంది దగ్గర కనీసం తమ పిల్లల ఫొటోలు కూడా లేవు. కొందరు ‘మా పిల్లలు ఇలా ఉంటారు’ అని పోలికలు చెప్పేవారు.కొందరి దగ్గర ఫొటోలు ఉన్నా అవి అవుట్‌డేటెడ్ ఫొటోలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ‘ఆపరేషన్ మిలాప్’ తెర మీదికి వచ్చింది. ఈ ఆపరేషన్‌ను సీమా దేవి, సుమన్ హుడా సవాలుగా తీసుకున్నారు. దిల్లీలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్స్ ఎలాగైనా సరే కనిపించకుండా పోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. అదెంత కష్టమో వారికి తెలియనిది కాదు. అయినా సరే, రంగంలోకి దిగారు. ప్రతి కేసును సవాలుగా తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణాలో ఊరూ వాడా వెదికారు.కొన్ని సందర్భాలలో బాధితులకు పోలీసులు మాట్లాడే భాష అర్థం కాకపోయేది. పిల్లలను చివరిసారిగా గుర్తించిన ప్రాంతాల్లోని స్థానికులు పోలీసులతో మాట్లాడేందుకు నిరాకరించేవారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా వెనకడుగు వేయలేదు. సైబర్ టీమ్ సహాయం కూడా తీసుకున్నారు.ఎట్టకేలకు వారి కష్టం ఫలించింది. తప్పిపోయిన 104 మంది పిల్లలను తొమ్మిది నెలల కాల వ్యవధిలో వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో సీమాదేవి, సుమన్ హూడాలు విజయం సాధించారు. ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇంట్లో నుంచి పారిపోవడం నుంచి సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి మాటలు నమ్మి వెళ్లిపోవడం వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొత్తప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్‌లను అనుమానంగా చూసేవాళ్లు. ‘మీరు నిజంగా పోలీసులేనా?’ అని అడిగేవారు. వారిలో నమ్మకం రావడానికి కాస్త టైమ్ పట్టేది. అయినా ఓపికగా ఎదురు చూసేవారు. స్థానికులలో నమ్మకం వచ్చాక... ఇంటింటికి వెళ్లి వెదికేవారు.చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వేస్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతోమంది నుంచి ఎన్నో రకాల క్లూలు సేకరించేవారు.‘ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కావు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెదకడంలో మా పిల్లల్ని చూసుకోవడం కుదిరేది కాదు. అయినా బాధ పడలేదు’ అంటుంది సీమాదేవి.‘రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. బాగా అలిసిపోయేవాళ్లం’ అంటుంది సుమన్ హుడా.తొమ్మిది నెలల కాలంలో వారు ఇళ్లు విడిచి, కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే... కృతజ్ఞతతో నిండిన పిల్లల తల్లిదండ్రుల కళ్ల నుంచి వచ్చిన ఆనంద బాష్పాలను చూసిన తరువాత ఆ కష్టాలేవీ ఇప్పుడు వారికి గుర్తుకు రావడం లేదు. -
గోదారి తీరాన ‘ఆదిమ’ జాడలు
- గోదావరి తీరం వెంట మూడు వేల ఏళ్లనాటి మానవ చరిత్ర జాడలు - ఖమ్మం, భూపాలపల్లి అడవుల్లో అద్భుత నిర్మాణాలు - ఒకేచోట వేల సంఖ్యలో సమాధులు - గుట్టువిప్పేందుకు ముందుకొచ్చిన అమెరికా వర్సిటీ సాక్షి, హైదరాబాద్/ భూపాలపల్లి పది అడుగుల ఎత్తున్న రాతి పలకాలతో చుట్టూ గోడ.. పదిహేను నుంచి ఇరవై అడుగుల వెడల్పు, అడుగు మందంతో రాతి పైకప్పు.. దానికి చిన్న ద్వారం.. లోపల పదడుగుల వెడల్పు, అంతే పొడవుండే గండ శిలతో చెక్కిన తొట్టిలాంటి ఆకృతి. దానికి రాతి మూత.. దాని బయట అస్పష్టమైన మానవాకృతితో గండశిలలు.. ఆ ప్రాంగణం చుట్టూ భారీ శిలలు..! అలాంటివి ఒకటి కాదు రెండు కాదు.. వందలు... వేలు... దట్టమైన అడవిలో ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలు! ఇంతకూ ఏంటవి..?? ఎవరు నిర్మించారు.. ఎక్కడున్నాయి? రాతి తొట్టిలో ఎముకలు కనిపించటంతో అవి సమాధులని, ఆదిమానవుల కాలానివని దాదా పు వందేళ్ల క్రితమే తేల్చారు. కానీ అవి ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నిర్మాణాలని అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో విశ్వవిద్యాలయం గుర్తించింది. వీటిపై అధ్యయనానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి ఆసక్తిగా ఉంది. ఇంతకూ ఆ నిర్మాణాలు ఎక్కడున్నాయో తెలుసా? భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల పరిధిలోని గోదావరి నదీతీరం వెంట! వారంతా వలస వచ్చినవారా? గోదావరి తీరం వెంట భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోని తాడ్వాయి, దామరవాయి, జానంపేట, దొంగలతోవు, సింగారం, గంగారం, కాచనపల్లి, గలబ, గుండాల... అటవీప్రాంతాల్లో వేల సంఖ్యలో సమాధులున్నాయి. వీటిని ఎవరు నిర్మించారన్నది ఇప్పటివరకు మిస్టరీగా ఉంది. తాజాగా సీసీఎంబీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో వారు వలస జీవులని తేలింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఆచార్యులు కేపీరావు ఆధ్వర్యంలో సర్వే జరిగిన సమయంలో సీసీఎంబీ.. ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఈ సమాధుల్లోని ఎముకల డీఎన్ఏను పరీక్షించిం ది. అది స్థానికుల డీఎన్ఏతో సరిపోలలేదు. దీంతో వలస వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారని భావించారు. దీన్ని రూఢీ చేసుకోవాలంటే ఈ సమాధులు విస్తరించిన ఇతర ప్రాంతాల్లో కూడా డీఎన్ఏ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీసీఎంబీ భావిస్తోంది. దానికంటే ముందు వీటి గుట్టు విప్పేందుకు కాలిఫోర్నియాలోని శాన్ డియాగో విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని సంఖ్య లో.. ఆకృతిలో భిన్నంగా ఉన్న ఈ నిర్మాణాల వెనక బలమైన చరిత్ర ఉందని ఆ వర్సిటీ భావిస్తోంది. తాజాగా ఆ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ థామస్ లెవీ వాటిని పరిశీలించారు. వీటి గుట్టు విప్పేందుకు తెలంగాణ పురావస్తు శాఖ ముందు ప్రతిపాదన ఉంచారు. పశువుల కొట్టాల్లోకి తొట్లు: సమాధుల్లో రాతి తొట్లను స్థానికులు కొందరు అక్రమంగా ఇళ్లకు తరలించి పశువుల కొట్టాల్లో తొట్లుగా వాడుతున్నారు. వాటిపై అవగాహన లేకపోవటంతో అత్యంత అరుదైన సంపద ధ్వంసంఅవుతోంది. ఆ నిర్మాణాల్లో ఎన్నో ప్రత్యేకతలు సాధారణంగా సమాధులు భూమి లోపల నిక్షిప్తమై ఉంటాయి. వాటికి గుర్తుగా పైన గండ శిలలను వృత్తాకారంలో పాతటం నాటి అలవాటు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా భూమి ఉపరితలంలోనే రాతి పలకలతో గుడారం తరహా నిర్మాణం ఉంది. సమాధుల ముందు అస్పష్టమైన మానవాకృతి రాళ్లు పాతి ఉన్నాయి. మగవారి ఆకృతి ఉన్న రాళ్లు క్రెస్తవ శిలువ ఆకృతిని పోలి ఉన్నాయి. కానీ అది క్రెస్తవంతో సంబంధం లేదని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు తెలిపారు. మహిళా రూపం అయితే శిలలపై స్థనభాగం రూపొందించి ఉంది. ఇలాంటి ఆకృతులు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. గతంలో ఈ నిర్మాణాలపై పలుమార్లు పరిశోధన జరిగినా 1982లో పురావస్తు అధికారి రామకృష్ణ వీటిని పరిశీలించి రిపోర్టు రూపొందించారు. 1991లో పురావస్తు అధికారులు రంగాచారి, గోవిందరెడ్డిలు పరిశీలించి వీటిలోని తొట్టి తదితర వివరాలను బహిర్గతం చేశారు. స్వాతంత్య్రానంతరం తొలి మెరుగైన అధ్యయనం ఇదే. 2000లో ప్రొఫెసర్ పుల్లారావు బృందం మరికాస్త పరిశోధించి వీటి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి వెల్లడించింది. వీరి ఆధ్వర్యం లోనే ఇటీవల డీఎన్ఏ పరీక్షలు జరిగాయి. యునెస్కో గుర్తింపు అర్హత ఉంది: పురావస్తుశాఖ డైరెక్టర్ ఈ సమాధులు అరుదైనవి, అద్భు తమైనవి. శాన్ డియాగో విశ్వవిద్యాల యం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి పరిశోధనలు చేయాలనే విష యంలో మేం ప్రణాళిక రూపొందిస్తాం. ఇన్ని వేల సంఖ్యలో మరెక్కడా సమా ధులు లేవు. వాటి గుట్టువిప్పి ప్రపంచం ముందు పెడితే తెలంగాణకు తొలి యునెస్కో గుర్తింపు రావటం ఖాయం.