breaking news
Home taxes
-
70% తగ్గితే చర్యలు
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇంటి పన్నులపై ఈఓపీఆర్డీలు,కార్యదర్శులతో సమీక్ష వరంగల్ రూరల్ : జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు కృషి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. ఈ ఏడాది 70శాతం కన్నా తక్కువ పన్నులు వసూలైన గ్రామపంచాయతీల బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్ను బకాయిలు, వసూళ్లపై హన్మకొండలోని జెడ్పీ హాల్లో సోమవారం ఆయన ఈఓ పీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మండలాల వారీగా గ్రామాల్లో పన్నుల లక్ష్యం వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పన్నుల వసూళ్లలో వెనకబడి ఉన్న గ్రామాల ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ లక్ష్యాలు ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 24 రోజులే గడువు ఉన్నందున రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకుని గ్రామాలకు వెళ్లాలని కలెక్టర్ పాటిల్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తించాలని మందలించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పన్నుల వసూళ్లలో కొన్ని మండలాలు ముందంజలో ఉన్నాయని, మిగతా వారు కూడా ప్రత్యేక దృష్టి సారించాలరు. ప్రతీరోజూ ఉదయమే గ్రామాలకు వెళ్లి పన్నులు వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నల్లబెల్లి, గీసుగొండ మండలాల్లో దాదాపు 90శాతం లక్ష్యాన్ని చేరుకోవడంపై ఆయన అధికారులను అభినందించారు. ఈఓ పీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు సమష్టిగా పనిచేస్తే ఫలితముంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పిండి కుమారస్వామి, గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) ఈఈ విజయ్‌గోపాల్ పాల్గొన్నారు. -
పంచాయతీ బకాయిలు రూ.72 కోట్లు
- వేధిస్తున్న సిబ్బంది కొరత - అదనపు బాధ్యతలతో సతమతం - గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నుల బకాయిలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. పన్నులు, పన్నేతర బకాయిలు మే చివరినాటికి జిల్లా మొత్తం గా రూ.72కోట్లు ఉన్నాయి. దీంతో పన్నుల వసూలుకు అధికారులు అదను చూసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. ఇందులో ఇంటిపన్నులు, నల్లా పన్నులు. రెండవది పన్నేతర ఆదాయం. ఇందులో సంతలు, ఆంగళ్లు, రహదారి శిస్తు, వేలంపాటలు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం ఉంటుంది. జిల్లాలో కొద్ది సంవత్సరాలుగా పంచాయతీ సిబంది పన్నులు వసూలు చేయడం పూర్తిగా మర్చిపోయారు. దీంతో ఇంటి పన్నులు, నల్లా పన్నులు కలిపి రూ.45కోట్లకు పైగా, పన్నేతర బకాయిలు రూ.26కోట్లకు పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించడంతో పంచాయతీ పాలనకు ప్రాధాన్యం పెరిగింది. దీనికి తోడు పంచాయతీల ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ముఖ్యం గా పన్నులు వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చెప్పడంతో పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది. సిబ్బంది కొరతతో ఇబ్బందులు జిల్లాలో 962 పంచాయతీలు ఉండగా కార్యదర్శులు మాత్రం 342 మంది మాత్రమే ఉన్నారు. సగటున ఒక్కో కార్యదర్శికి మూడు పంచాయతీల బాధ్యతలున్నాయి. దీనికి తోడు రెండేళ్లుగా సర్పంచ్‌లు లేక ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఖర్చు చేశారే తప్ప పన్నుల వసూళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వెరసి బకాయిలు తడిసి మోపెడయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 98 మంది కార్యదర్శులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతవరకు అదనపు బాధ్యల నుంచి వారికి విముక్తి కలిగి పన్నుల వసూళ్లపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇబ్బందే... ప్రస్తుతం ‘మన గ్రామం-మన ప్రణాళిక’ క్యాక్రమంలో చేసే ప్రతి ప్రణాళిక గ్రామ ఆదాయాన్ని బట్టే చేయాలి. అయితే పేరుకు పోయిన బకాయిలు నూరుశాతం వసూలవుతాయని ఊహించి ప్రణాళికలు సిద్ధం చేయడంటే ఇబ్బందికరమే. ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం పంచాయతీ సిబ్బందికి కత్తిమీద సాములాంటిదే.