breaking news
high-value deposits
-
హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా!
హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి చోట్ల నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన సీబీడీటీ.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించకుండా నిఘా పెట్టాలని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. -
పాన్ లేకుండా భారీ మొత్తంలో డిపాజిట్లు
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్ తర్వాత అక్రమదారులకు కొమ్ముకాసి బ్యాంకు అధికారులు మోసాలకు పాల్పడినట్టు మరోసారి రుజువైంది. డీమానిటైజేషన్ తర్వాత కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లోకి రూ.1.13 లక్షల కోట్లకు పైగా పెద్దమొత్తంలో డిపాజిట్లు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వచ్చి చేరాయని హిందూస్తాన్ టైమ్స్ రివీల్ చేసింది. ప్రభుత్వం డేటా ఆధారంగా ఈ విషయాలను హిందూస్తాన్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ లావాదేవీలు సగానికి కంటే పైగా, అంటే మూడో వంతు డిపాజిట్లు అనుమానిత డిపాజిట్లేనని వెల్లడించింది. అనుమానిత లావాదేవీలను మానిటర్ చేసే ప్రభుత్వ ఏజెన్సీ ఫైనాన్సియల్ ఇంటిలిజెన్సీ యూనిట్(ఎఫ్ఐయూ) ఈ డిపాజిట్లను అనుమానిత లావాదేవీలుగా తేల్చింది. అవినీతికి వ్యతిరేకంగా, నకిలీ ధనంపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న పేర్కొంది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం, రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు పన్ను పరిశీలనలోకి వస్తాయని వెల్లడించింది. కానీ కొంతమంది బ్యాంకు అధికారులు ఖాతాదారుల అక్రమ సొమ్ము డిపాజిట్లకు సాయపడినట్టు తెలిసింది. రద్దయిన నోట్లను కొత్త కరెన్సీలోకి అక్రమంగా మార్చుతూ పట్టుబడిన బ్యాంకు అధికారులను సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం వంటి కఠినచర్యలు చేపట్టినప్పటికీ, కొంతమంది బ్యాంకుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి కూడా. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు మొత్తం బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు రూ.7.33 లక్షల కోట్లు కాగా, వాటిలో రూ.1.13 లక్షల కోట్లకు అసలు ఎలాంటి డాక్యుమెంట్లు కానీ, పాన్ కానీ లేనట్టు వెల్లడైంది. రూ.50వేల మొత్తంలో డిపాజిట్లు దాటిన వారికి పాన్ తప్పనిసరి. పన్ను ఎగవేతలను గుర్తించడానికి పాన్ వివరాలు ఎంతో సహకరిస్తాయి. మరోవైపు జన్ ధన్ అకౌంట్లను కూడా వాడి బ్యాంకు అధికారులు అక్రమ డిపాజిట్ దారులకు సాయపడినట్టు వెల్లడైంది.