breaking news
hefty fine
-
పాతనోట్లు ఉన్నాయా.. రూ. 10వేల ఫైన్!
పెద్దనోట్ల రద్దు తర్వాత చాలామంది తమ వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చేసుకున్నారు. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని, కొత్త నోట్లు తీసుకున్నారు. అయితే కొంతమంది వద్ద మాత్రం ఇంకా ఆ నోట్లు ఉండిపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పటికి చెలామణిలో ఉన్న కరెన్సీకి.. నోట్ల రద్దు తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన కరెన్సీకి మధ్య తేడా కనిపించింది. దాంతో కొంతమంది ఇంకా పాతనోట్లను ఉంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు అలా ఎవరివద్ద అయినా పది కంటే ఎక్కువ సంఖ్యలో రద్దయిన పాతనోట్లు ఉంటే, వాళ్లకు కనీసం రూ. 10 వేల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం కొత్త చట్టం ఒకదాన్ని తెచ్చింది. పాత నోట్లను ఉపయోగించి సమాంతర ఆర్థికవ్యవస్థను నడిపించే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చినట్లు చెబుతున్నారు. దీన్ని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఫిబ్రవరి 27న దీనిపై సంతకం చేసేశారు. దాంతో ఇది చట్టరూపం దాల్చింది. పెద్దనోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉండి, తప్పుడు డిక్లరేషన్లు ఇస్తే వారికి రూ. 50వేల కనీస జరిమానా విధించే అవకాశం కూడా ఈ చట్టంలో ఉంది. వ్యక్తుల వద్ద పది నోట్ల కంటే ఎక్కువ, పరిశోధన అవసరాల కోసం అయితే 25 నోట్లకన్నా ఎక్కువ చేతిలో ఉంచుకోవడం నేరం అవుతుంది. అందుకు రూ. 10వేల జరిమానా లేదా వాళ్ల దగ్గరున్న నగదు విలువకు ఐదు రెట్ల మొత్తం.. ఏది ఎక్కువైతే అది విధిస్తారు. -
క్రెడిట్ కార్డు మోసాలు: అమెరికన్ ఎక్స్ప్రెస్కు భారీ జరిమానా
అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే, క్రెడిట్ కార్డు అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు ఆ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలు మరో మూడింటికి భారీ జరిమానా పడింది. దాదాపు 3.35 లక్షల మంది వినియోగదారులకు రూ. 368 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నియంత్రణ సంస్థలు ఆదేశించాయి. వంద కోట్ల రూపాయల జరిమానా కూడా చెల్లించాలన్నాయి. అమెరికన్ ఎక్స్ప్రెస్, దాని అనుబంధ సంస్థలు అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సంబంధిత కంపెనీ, సెంచూరియన్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్.. ఈ మూడు సంస్థలకూ జరిమానా పడింది. బిల్లింగు విషయంలో అక్రమాలకు పాల్పడిందని, మోసకారి మార్కెటింగ్ వ్యవహారాలు చేశారని, క్రెడిట్ కార్డుల యాడ్ ఆన్ ఉత్పత్తుల విషయంలో ఇలా చేశారని వీటిపై ఆరోపణలొచ్చాయి. ఇన్నాళ్లుగా అమెరికన్ ఎక్స్ప్రెస్ చేతిలో మోసపోయిన లక్షలాది మంది వినియోగదారులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నామని కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో (సీఎఫ్పీబీ) డైరెక్టర్ రిచర్డా కార్డ్రే తెలిపారు.