breaking news
Group-D posts
-
లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: తాను రైల్వేమంత్రిగా ఉన్న కాలంలో భూములు రాయించుకుని కొందరికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కూ సమన్లు పంపింది. ఈనెల 22వ తేదీన ఢిల్లీ ఆఫీస్‌కు రావాలని తేజస్వీని, డిసెంబర్ 27న రావాలని లాలూకు ఈడీ సూచించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వీరిద్దరి నుంచి అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈడీ ఇప్పటికే ఇదే కేసులో ఏప్రిల్‌లో ఎనిమిది గంటలపాటు తేజస్వీని విచారించింది. లాలూ ప్రసాద్‌కు ఈ కేసులో సమన్లు పంపడం ఇదే తొలిసారి. గత నెలలో లాలూ కుటుంబానికి ఆప్తుడైన అమిత్ కాత్యాల్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో వీరికి సమన్లు జారీకావడం గమనార్హం. -
లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2004–09లో రైల్వే శాఖలో గ్రూప్–డి ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి బిహార్ రాజధాని పాట్నాలో లక్షకుపైగా చదరపు అడుగుల భూమిని లాలూ, కుటుంబ సభ్యులు తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలూ 2004–09లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. తాజా కేసు నేపథ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌లో లాలూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన 16 చోట్ల సోదాలు ప్రారంభించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌తోపాటు అక్రమంగా ఉద్యోగాలు దక్కించుకున్న మరో 12 మందిని నిందితులుగా చేర్చారు. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ 2021 సెప్టెంబర్ 23న దర్యాప్తు ప్రారంభించింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మూడు సేల్ డీడ్ల ద్వారా భూమిని రబ్రీదేవికి, ఒక సేల్ డీడ్ ద్వారా మీసా భారతికి, రెండు గిఫ్ట్ డీడీల ద్వారా హేమా యాదవ్‌కు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములను సొంతం చేసుకోవడానికి లాలూ కుటుంబం సదరు అభ్యర్థులకు కేవలం రూ.3.75 లక్షల నుంచి రూ.13 లక్షల దాకా చెల్లించినట్లు సీబీఐ చెబుతోంది. నిజానికి ఆ భూముల విలువ రూ.కోట్లల్లో పలుకుతోంది. సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం ఇటీవలే బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) స్పందించింది. కేంద్రంలోని అధికార బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగుతోందని, తాము భయపడే ప్రసక్తే లేదని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా తేల్చిచెప్పారు. రబ్రీదేవి పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పట్ల సీబీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఆరోపించింది. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలో రబ్రీ దేవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆమెను 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. -
దక్షిణ మధ్య రైల్వేలో కొలువుల కూత..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి.. భారతీయ రైల్వే. అంతేకాదు ప్రపంచంలోనే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్న ప్రభుత్వ విభాగం కూడా ఇదే. ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పశ్చిమానికి దేశ నలుమూలలను కలుపుతున్న భారతీయ రైల్వేలను దేశ జీవనాడిగా అభివర్ణించవచ్చు. రైల్వేలు నిత్యం లక్షల మంది ప్రజలను, సరుకులను రవాణా చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జించిపెడుతున్నాయి. ఇంతటి కీలకమైన భారతీయ రైల్వే వ్యవస్థలో నిష్ణాతులైన ఉద్యోగుల అవసరం ఎంతో ఉంది. తాజాగా వివిధ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ కూడా ఉంది. మరోవైపు నగరంలో మెట్రోరైలు నిర్మాణం చురుగ్గా కొనసాగుతోంది. ఇందులో పనిచేయడానికి ఎంతోమంది సిబ్బంది కావాలి. ఈ నేపథ్యంలో రైల్వేల్లో కొలువులు.. అర్హతలు.. ఎంపిక వివరాలు.. అర్హతలుంటే.. లక్షల్లో ఉద్యోగాలు దేశంలో రైల్వేల కోసం ప్రత్యేకంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఉంది. కేంద్ర బడ్జెట్‌కు ఎంత ప్రాధాన్యముందో.. రైల్వే బడ్జెట్‌కు అంతే ప్రాముఖ్యత ఉంది. పెరుగుతున్న జనాభా, రవాణా అవసరాల దృష్ట్యా రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలనే యోచనలో భారతీయ రైల్వే ఉంది. రానున్న రోజుల్లో దేశంలో ప్రధాన నగరాల మధ్య బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. మరోవైపు హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్- పుణె నగరాల మధ్య బుల్లెట్‌రైళ్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది! ఇవేకాకుండా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మధ్య బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో రైల్వేస్టేషన్లలో సోలార్‌ప్యానల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. రైలు సదుపాయం లేని మరికొన్ని ప్రాంతాలకు రైల్వే లైన్లను విస్తరించనున్నారు. కొన్ని మార్గాలను విద్యుదీకరించాలనుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రత, రైల్వే నిర్వహణ, ఇంజనీరింగ్, విద్యుత్ విభాగాల్లో లక్షల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంది. రాబోయే రోజుల్లో సుమారు 76 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీంతోపాటు దక్షిణ మధ్యరైల్వే కూడా అవసరమైన అన్ని విభాగాల్లో ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. గ్రూప్-ఏ ఉద్యోగాల భర్తీ ఇలా.. సాధారణంగా రైల్వేలో ఎ, బి, సి, డి అని నాలుగు గ్రూపుల్లో ఉద్యోగులను నియమిస్తారు. * గ్రూప్-ఏ ఉద్యోగులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నాయి. అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దేశిత వయోపరిమితి తప్పనిసరి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. * యూపీఎస్సీ నిర్వహించే మరో పరీక్ష.. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్). దీని ద్వారా రైల్వేలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో ఇంజనీర్లను నియమిస్తారు. అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ ఉత్తీర్ణత. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. * యూపీఎస్సీ ఏటా నిర్వహించే మరో పరీక్ష కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా రైల్వేల్లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ చేపడతారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇవేకాకుండా యూపీఎస్సీ- స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ ద్వారా రైల్వేల్లోని ఆయా విభాగాల్లో మెకానికల్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేస్తోంది. 10+2 ఉత్తీర్ణులు అర్హులు. ప్రవేశ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. తర్వాత వారికి నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ కోర్సులో శిక్షణనిచ్చి ఉద్యోగులుగా నియమిస్తారు. వెబ్‌సైట్స్: www.upsc.gov.in, www.irimee.indianrailways.gov.in గ్రూప్-బి, సి, డి ఉద్యోగాల భర్తీ ఇలా.. గ్రూప్-బి విభాగంలో సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. గ్రూప్-సి ఉద్యోగులను సీనియార్టీ ఆధారంగా గ్రూప్-బి ఉద్యోగులుగా నియమిస్తారు. గ్రూప్-సి విభాగంలో టెక్నికల్-నాన్‌టెక్నికల్ పోస్టులుంటాయి. క్లర్క్, అసిస్టెంట్ స్టేషన్‌మాస్టర్, టికెట్ కలెక్టర్, గూడ్స్‌గార్డ్, సీనియర్ క్లర్క్-కం టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్స్, కమర్షియల్ అప్రెంటీస్, ట్రాఫిక్ అప్రెంటీస్ వంటి ఉద్యోగాలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. వీటికి అర్హత పోస్టును బట్టి పదో తరగతి, డిప్లొమా, నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ. ఈ పోస్టులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తుంది. గ్రూప్-డిలో ట్రాక్‌మెన్, హెల్పర్, సఫాయివాలా, గ్యాంగ్‌మెన్, ఫ్యూన్ తదితర పోస్టులుంటాయి. ఈ పోస్టులకు కనీస విద్యార్హత ఐదోతరగతి నుంచి పదోతరగతి. ప్రతి రైల్వే జోన్ స్థాయిలో రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ) ఈ విభాగాల్లో ఉద్యోగులను నియమిస్తుంది. నవంబర్‌లో పరీక్ష ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 1,01,036 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో సుమారు 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విడతలవారీగా ఈ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగానే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ 8,730 గ్రూప్-డి పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 2,801 ట్రాక్‌మెన్, హెల్పర్, అసిస్టెంట్ పాయింట్‌మెన్ పోస్టులకు నవంబరులో పరీక్ష నిర్వహించనుంది. జనవరినాటికి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పదోతరగతి, ఐటీఐ విద్యార్హతలతో జరిగే ఎంపిక ప్రక్రియ మూడు దఫాలుగా కొనసాగుతుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకం జరుగుతుంది. భారతీయ రైల్వేలో ఆరు వేలకు పైగా ఖాళీలు వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా కింది పోస్టుల భర్తీకి రైల్వేశాఖ దరఖాస్తులను కోరుతోంది. * ీసీనియర్ సెక్షన్ ఇంజనీర్: 1798 అర్హత: సివిల్/ మెకానికల్/ ఎలక్ట్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ మెటలర్జికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్ ఉండాలి. * చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 53 అర్హత: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. * జూనియర్ ఇంజనీర్: 3967 అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 105 అర్హత: ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉండాలి. * కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్: 183 అర్హత: మెటలర్జీ/ కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ / బీటెక్/ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉండాలి. పై పోస్టులతోపాటు ఎక్స్-సర్వీస్‌మెన్, వికలాంగుల కోటా పోస్టులు కూడా అదనం. విభాగాల వారీగా పోస్టులు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలకు నోటిఫికేషన్లో చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 19 రాత పరీక్ష తేదీలు: సీనియర్ సెక్షన్ ఇంజనీర్ : డిసెంబరు 21 జూనియర్ ఇంజనీర్, డీఎంఎస్, సీఎంఏ: డిసెంబరు 14 వెబ్సైట్: http://rrbsecunderabad.nic.in/ వచ్చే జూలైలో మరో నోటిఫికేషన్ ‘‘భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకమైంది. మెరుగైన ప్రజా రవాణా సేవలను అందించడంలో అంతర్జాతీయంగా ఖ్యాతి పొందింది. ఇంతటి వ్యవస్థలో విధి నిర్వహణ సవాళ్లతో కూడిందనే చెప్పాలి. ప్రజా భద్రతతోపాటు సిబ్బంది సంక్షేమానికీ ప్రాధాన్యతనిస్తున్నాం. ఖాళీలను బట్టి ఎప్పటికప్పుడు భర్తీ ప్రక్రియను చేపడుతున్నాం. భద్రత, సాధారణ విభాగాల్లో ఉద్యోగులను పెంచే యోచనలో ఉన్నాం. సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ప్రతిపాదనపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది కార్యరూపం దాలిస్తే మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో అవసరాల మేరకు ఎప్పటికప్పుడు ఉద్యోగులను నియమించుకుంటున్నాం. జోనల్ స్థాయిలో ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ పనిచేస్తుంటాయి. ఉద్యోగుల ఎంపిక పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మొద్దు. గ్రూప్-డి స్థాయి పోస్టుల భర్తీకి వ చ్చే ఏడాది జూలైలో ప్రకటన విడుదల చేయనున్నాం. అభ్యర్థులు మరిన్ని వివరాలకు ఇండియన్ రైల్వే, ఆర్ఆర్బీ వెబ్సైట్లు www.indianrailways.gov.in, http://rrbsecunderabad.nic.in/ చూడొచ్చు’’ -కె.సాంబశివరావు, సీపీఆర్వో, దక్షిణ మధ్య రైల్వే