breaking news
Governor Najib Jung
-
అన్ని పార్టీలతో చర్చ!
‘ఢిల్లీ’ సర్కారు ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై వివిధ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరపాలని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... ప్రభుత్వ ఏర్పాటు లేదా తిరిగి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తేల్చేందుకు నజీబ్ జంగ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి అనుమతించినందున, జంగ్ కొద్దిరోజుల్లో అక్కడి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని మొదటగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీజేపీ ముందుకు రాకపోతే అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్‌ను ఆహ్వానించవచ్చని పేర్కొన్నాయి. కాగా, ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోతే.. ఎన్నికలు నిర్వహించడం తప్పదన్నాయి. కాగా, జంగ్ ఎన్డీయే ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తూ.. రాజ్యాంగ పదవికి మచ్చతెచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఢిల్లీలో పరిస్థితిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ఆద్మీపార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. -
ఫీడర్ బస్సు సేవలను ప్రారంభించిన ఎల్జీ
న్యూఢిల్లీ: డీఎంఆర్సీ కొత్తమార్గాల్లో ప్రవేశపెట్టనున్న ఫీడర్ బస్సులను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర రవాణా సంస్థ ఆమోదించిన మార్గాల్లో ఇవి సేవలు అందిస్తాయని డీఎంఆర్సీ తెలిపింది. బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎల్జీ, తరువాత శాస్త్రిపార్కులోని డీఎంఆర్సీ డిపో, వర్క్‌షాప్‌ను కూడా సందర్శించారు. డీఎంఆర్సీ కార్యాలయాలను సందర్శించడం అద్భుత అనుభవమని ఎల్జీ అన్నారు. ఇక తాజాగా ప్రవేశపెట్టిన ఫీడర్ బస్సులు ఉదయం ఎనిమిదింటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు సేవలు అందిస్తాయి. వీటిలో మొదటి నాలుగు కిలోమీటర్ల వరకు రూ.ఐదు వసూలు చేస్తారు. పది కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే రూ.10 చెల్లించాలి. ఇవి విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ నుంచి బురారి, విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ నుంచి గోకుల్‌పురి మెట్రో, అజాద్‌పూర్ మెట్రో స్టేషన్ నుంచి కన్హయ్య నగర్ మెట్రో స్టేషన్, ఛత్తర్పూర్ నుంచి హాజ్‌కాస్ మెట్రో స్టేషన్ మార్గాల్లో సేవలు అందిస్తాయి. ఈ ఏడాది వివిధ మార్గాల్లో డీఎంఆర్సీ ప్రవేశపెట్టబోయే 400 బస్సుల్లో ఇవి భాగమని సంస్థ అధికారులు తెలిపారు. కాలుష్యకారక పరిశ్రమలకు మూత: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశంకాలుష్య కారక పరిశ్రమల మూసివేతకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) జారీ చేసిన ఆదేశాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులు ఎవరో తేల్చాలని పట్టణాభివృద్ధిశాఖ డెరైక్టర్‌ను ఆజ్ఞాపించారు. పట్టణాభివృద్ధిశాఖ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. తగినంత మంది డ్రైవర్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఖాళీల భర్తీని వెంటనే చేపట్టాలని డీటీసీ చైర్మన్ దేబశ్రీ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. డీటీసీ సమస్యల అధ్యయనం కోసం నియమించే కమిటీలో సీఎండీతోపాటు ముగ్గురు సీనియర్ అధికారులు ఉంటారు. నరేలా బస్టాపులోని మరుగుదొడ్లకు కూడా వెంటనే మరమ్మతులు చేయాలని ఎల్జీ ముఖర్జీని ఆదేశించారు.