breaking news
Godavari districts farmers
-
పట్టిసీమలో అవినీతి ప్రవాహం
* ప్రాజెక్టు పూర్తికి ఇచ్చిన గడువే ఏడాది * గడువులోగా పూర్తిచేస్తే కాంట్రాక్టర్‌కు 21.9 శాతం అదనపు చెల్లింపు * ఎగువ రాష్ట్రాలకు వాటా సమస్యను పట్టించుకోని ప్రభుత్వం * గోదావరి జిల్లాల రైతుల ఆవేదననూ పట్టించుకోని సర్కారు సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియలోనే అవినీతి ప్రవాహానికి ప్రభుత్వం తెరతీసింది. నిబంధనలు తుంగలో తొక్కి తమతో అవగాహన ఉన్న కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టింది. కేవలం ‘సొమ్ము’ చేసుకోవడానికే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారనే ఆరోపణలు బలంగా వచ్చినా.. ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కాంట్రాక్టర్ నుంచి ముందే ‘సొమ్ము’ నొక్కేయడం వల్లే ప్రభుత్వం పట్టిసీమ విషయంలో వెనక్కితగ్గడం లేదని అధికారులే చెబుతున్నారు. ఈపీసీ విధానంలో టెండర్ విలువలో 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేయడానికి అవకాశం లేదు. ఆన్లైన్లో టెండర్ దాఖలు చేసే సమయంలో 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేసే టెండర్లను సిస్టం (కంప్యూటర్) అంగీకరించదు. గడువులో పూర్తిచేస్తే 21.9% అదనం ఎందుకో! 21.9 శాతం అధిక ప్రీమియానికి టెండర్ కట్టబెట్టడంతో ప్రభుత్వం మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కొత్త పల్లివి అందుకుంది. సాధారణంగా 5 శాతం అధికంగా పనులు కట్టబెట్టడానికి అవకాశం ఉందని, దానికి అదనంగా ఉన్న 16.9 శాతాన్ని ఏడాదిలో పనులు పూర్తిచేస్తేనే చెల్లిస్తామని విచిత్ర వాదన చేయడం మొదలు పెట్టింది. పనులు పూర్తి చేయడానికి ఏడాది గడువు ఇస్తూ టెండర్లు పిలిచారు. ఇచ్చిన గడువులోగా పూర్తిచేస్తే అదనపు చెల్లింపులేమిటి? అని విపక్ష నేతలు, ప్రజలు, రైతు సంఘాల నేతలు అడుగుతున్నా.. ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకు లేదు. ఎగువ రాష్ట్రాల వాటా అడిగితే.. సీమ ఎడారే పట్టిసీమ లిఫ్ట్ వల్ల పోలవరం ప్రాజెక్టు కోల్డ్ స్టోరేజీకి చేరుతుందనే బలమైన అనుమానాలు ఉన్నాయి. దీంతోపాటు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు కూడా రాష్ట్రానికి ఇబ్బందిగా పరిణమిస్తుందనే భయం ప్రజల్లో ఉంది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు రెండో చాప్టర్ క్లాజ్-7లో.. పోలవరం కుడికాల్వకు మళ్లించే నీటిలో ఎగువ రాష్ట్రాల వాటా గురించి స్పష్టంగా ఉంది. 7(ఇ): రిజర్వాయర్ పూర్తిస్థాయి మట్టం 150 అడుగులతో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడీబ్ల్యూసీ) అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకు వాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే అంశంతో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్రలకు ఉంటుంది. 7(ఎఫ్): 75 శాతం డిపెండబిలిటీ ప్రకారం.. 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని పోలవరం నుంచి కృష్ణాకు మళ్లిస్తే, అధికంగా మళ్లించిన నీటినీ మూడు రాష్ట్రాలకు అదే దామాషాలో పంచాలి. రాయలసీమకు నీటిని మళ్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విషయం నమ్మశక్యంగా లేదు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో చేసిన కేటాయింపులు నామమాత్రమే. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం అటుంచితే, కేటాయింపులు నిర్వహణ ఖర్చులకూ సరిపోయే పరిస్థితి లేదు. గోదావరి ట్రిబ్యునల్‌లోని 7(ఇ), 7(ఎఫ్)ప్రకారం ఎగువ రాష్ట్రాలు వాటా అడిగితే.. ప్రజల్లో నెలకొన్న భయం నిజమవుతుందనే ఆందోళన అందరిలో ఉంది. చుక్కనీరు మళ్లించక ముందే రాష్ట్రం 70 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తుంది. అంతా అస్పష్టమే పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రావిటీతో కుడికాల్వ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించవచ్చు. అది పోలవరం ప్రాజెక్టులో భాగమే. 4 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈలోగా కుడికాల్వకు లిఫ్ట్ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. ఎంత వేగంగా పనులు పూర్తి చేసినా.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని, వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యల వల్ల జరిగే జాప్యం దీనికి అదనమని ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అస్పష్టమైన ప్రణాళిక, పూర్తి చేయడం ఎప్పటికి సాధ్యమవుతుందో తెలియని అనిశ్చితి, భారీ వ్యయం.. అన్నీ ప్రతికూల అంశాలే ఉన్నా ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. సర్కారు దొంగాట పట్టిసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. గోదావరి డెల్టా ప్రయోజనాలతో చెలగాటమాడుతోందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. పట్టిసీమ లిఫ్ట్ డిజైన్ ప్రకారం.. 12.5 మీటర్ల కనీస నీటిమట్టం ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయడానికి అనుకూలంగా నిర్మాణం చేపడుతున్నారు. లిఫ్ట్ నిర్మాణానికి పిలిచిన టెండర్లలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. పట్టిసీమపై గోదావరి డెల్టా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం ‘దొంగాట’ మొదలుపెట్టింది. ఈ మేరకు పట్టిసీమ లిఫ్ట్ వాడకం మార్గదర్శకాలను మార్చి 27న జారీచేసింది. గోదావరిలో కనీస నీటిమట్టం 14 మీటర్లు ఉన్నప్పుడే నీటిని తీసుకోవాలని, అంతకంటే తక్కువ ఉంటే నీటిని తీసుకోవడానికి లేదని పేర్కొంటూ జీవో 200 జారీచేసింది. కాటన్ బ్యారేజీ జలాశయం గరిష్ట మట్టం 13.67 మీటర్లు. లిఫ్ట్ వద్ద కనీసం 14 మీటర్ల మట్టం ఉన్నప్పుడే నీటిని తోడుకోవాలి’ అని జీవోలో పేర్కొంది. గోదావరి డెల్టాపై అంత ప్రేమ ఉంటే పట్టిసీమ రూపకల్పనలోనే కనీస నీటిమట్టాన్ని 14 మీటర్లు ఎందుకు పెట్టలేదని నిపుణులంటున్నారు. నిబంధనలు మార్చేశారు తొలుత సాధారణ నిబంధనలతో జనవరి 7న టెండర్ పిలిచారు. ఈమేరకు టెండర్ నోటీసు ప్రకటన జనవరి 9న ‘ఈనాడు’లో వచ్చింది. జనవరి 12 నుంచి షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమవుతుందని, 27న ముగుస్తుందని అందులో పేర్కొన్నారు. ప్రీబిడ్ సమావేశాన్ని 19న నిర్వహిస్తామని తెలిపారు. 28న టెక్నికల్ బిడ్స్, 31న ప్రైస్ బిడ్స్ తెరుస్తామని నీటిపారుదల శాఖ అందులో చెప్పింది. సాధారణ నిబంధనల వల్ల సర్కారు పెద్దలు ‘ఆశించిన ప్రయోజనం’ దక్కదనే ఉద్దేశంతో టెండర్ నిబంధనలు మార్చాలని ప్రభుత్వం భావించిందని అధికార వర్గాల సమాచారం. అందుకు అనుగుణంగా ‘5 శాతం’ నిబంధననే తుంగలో తొక్కేశారు. 5 శాతం నిబంధనను తొలగించి, అధిక ధర (ఎక్సెస్)కు కోట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం జనవరి 20న మెమో (నం.52/ప్రాజెక్ట్ 1.ఎ.2/2015)ను జారీ చేసింది. ఈ మినహాయింపు కేవలం పట్టిసీమకే పరిమితమని, మిగతా ప్రాజెక్టులకు సాధారణ ఈసీపీ నిబంధనలే వర్తిస్తాయని మెమోలో పేర్కొనడం గమనార్హం. మినహాయింపు ఒక్క పట్టిసీమకే ఇవ్వడం వెనక భారీ ముడుపులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తినా ప్రభుత్వం ఇప్పటి వరకు వాటికి సమాధానం చెప్పలేదు. 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత.. రెండో టెండర్ నోటీసును జనవరి 30న ‘ఈనాడు’లో ప్రకటించారు. సవరణల్లో ముఖ్యమైన అంశమైన ‘5 శాతం పరిమితి తొలగింపు’ విషయాన్ని ప్రకటనలో పేర్కొనకపోవడం గమనార్హం. అనంతరం.. అంతా అనుకున్నట్లుగా సాగింది. 21.9 శాతం అధిక ప్రీమియంతో టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టారు. వరదల్లో వరద నీరు.. వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం 45-50 రోజులు ఉంటుంది. అదే సమయంలో కృష్ణాలో కూడా వరదలుంటాయి. కృష్ణానది పొంగి ప్రవహిస్తుంటే గోదావరి నీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. గోదావరిలో వరద ఉన్నప్పుడు తీసుకెళ్లిన నీటిని నిల్వ చేయడానికి ఎక్కడా అవకాశం లేదు. గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువన కలపనున్నారు. బ్యారేజీ గరిష్ట సామర్థ్యం 3 టీఎంసీలే. కృష్ణాలో ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీ వద్దకు గోదావరి నీటిని తీసుకొచ్చి నిల్వ చేయడంలో అర్థం లేదు. పట్టిసీమ లిఫ్ట్ మొదలు.. కృష్ణా నది చేరేవరకు ఎక్కడా నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు. మరి కృష్ణా డెల్టాలో డిమాండ్ ఉన్నప్పుడు.. గోదావరిలో వరద లేకుంటే నీటిని ఎలా తెస్తారు? కుడికాల్వ భూసేకరణలో సమస్యలు కుడికాల్వ పనులు ఇప్పటికే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. మిగతా 30 శాతం పనులు.. భూసేకరణలో సమస్యలు ఎదురుకావడంతో ఆగిపోయింది. ఈ పనులు పూర్తి చేయడానికి ఇంకా 1,820 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది. వీటిని ఇవ్వడానికి నిరాకరించిన రైతు లు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వెళ్లారు. భూసేకరణకు వ్యతిరేకంగా వివిధ కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రైతుల సమస్యలు పరిష్కరించి తక్షణం భూసేకరణ చేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. భూసేకరణే కాకుండా.. రామిలేరు, తమ్మిలేరు మీద రెండు మేజర్ అక్విడెక్టుల నిర్మాణం, రైల్వే క్రాసింగ్, ఇతర నిర్మాణాలు కలిపి 100కు పైగా పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటి నిర్మాణానికి రెండు, మూడేళ్లు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఎత్తిపోతలు పూర్తయినా, కుడికాల్వ పనులు పూర్తికాకపోతే ప్రయోజనం ఉండదు. పోల వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. ఎటూ కూడికాల్వ ద్వారా నీరు కృష్ణా డెల్టాకు చేరుతుంది. ఎవరికీ ప్రయోజనం చేకూర్చని పథకాన్ని రూ.1,300 కోట్ల వ్యయంతో చేపట్టాలా? అని గోదావరి జిల్లాల ప్రజలు, కృష్ణా డెల్టా రైతులూ ప్రశ్నిస్తున్నారు. -
రగులుతున్న రైతన్న
చెమట చుక్కల పదునులో విత్తనాలు నాటి.. నెత్తుటి చుక్కల్ని పిచికారీ చేసి పంటలు పండించే అన్నదాతలు సర్కారు తీరుపై రగిలిపోతున్నారు. రుణమాఫీ ఫలాలు చేతికి రాలేదు. పెట్టుబడి కోసం రుణాలూ అందలేదు. కష్టాలు, నష్టాలను పంటిబిగువన భరిస్తూ రబీ సాగు కోసం ఏరువాక చేపట్టిన అన్నదాతలు పాలకులు రచిస్తున్న కుట్రలపై పోరువాక సాగించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒద్దికగా ఒదిగిన గింజలతో తలదించుకుని పుడమి తల్లి ఒడిలో సేదతీరేందుకు తహతహలాడే కంకుల మాదిరి చేలగట్ల చుట్టూ తిరుగాడే అన్నదాతల పిడికిళ్లు బిగుస్తున్నాయ్. పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే.. సర్కారు పునాదులను సైతం పెకలిస్తామని వారి గళాలు గర్జిస్తున్నాయ్. కాళీపట్నం రైతు పోరాటం.. కాల్ధరి ఉద్యమ తరహాలో మరో పోరాటం నిర్వహించేందుకు ఉభయ గోదావరి జిల్లాల కర్షకులు సమాయత్తమవుతున్నారు. సర్కారుపై సమరానికి సమాయత్తమవుతున్న కర్షకులు భీమవరం/పోలవరం : గోదావరి జిల్లాల రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. పంట చేలో పచ్చదనాన్ని కాపాడుకునేందుకు పోరుబాట పడుతున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తీరుతామని ప్రకటించడం.. ఆ వెనుకే రూ.1,300 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడటంపై అన్నదాతలు రగిలిపోతున్నారు. పచ్చని గోదావరి జిల్లాలను ఎడారిగా మార్చేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి పూనుకోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాలను కరువు ప్రాంతాలుగా మార్చే హక్కు ఎవరిచ్చారంటూ గర్జిస్తున్నారు. పట్టిసీమ వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనిచ్చేది లేదంటూ రణ నినాదం చేస్తున్నారు. ఈ పథకం విషయంలో ఇప్పటివరకు రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తూ వచ్చిన సీఎం చంద్రబాబు గురువారం జిల్లా పర్యటన సందర్భంగా పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలను తరలిస్తామని బహిరంగంగా ప్రకటన చేయడంతో రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పక్కన పెట్టి హడావుడిగా ఎత్తిపోతల పథకం నిర్మించడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆంతర్యం ఏమిటని, ఈ పథకానికి ఎకాఎకిన రూ.1,300 కోట్లను కేటారుుస్తూ జీవో జారీ చేయడం వెనుక పన్నాగం ఏమిటని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు కృష్ణా జిల్లా రైతులతో కలసి ఉభయ గోదావరి జిల్లాల రైతులు ప్రత్యక్ష పోరాటానికి సమాయత్తమవుతున్నారు. 5న కాకినాడ కలెక్టరేట్ ముట్టడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సర్కారుపై సమరభేరికి సమాయత్తమైన ఉభయగోదావరి జిల్లాల రైతులు ఈనెల 5న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌ను ముట్టడించడం ద్వారా తొలి నగారా మోగిస్తున్నారు. అనంతరం ఏలూరు నగరాన్ని ముట్టడించేందుకు కార్యాచరణ రూపొం దిస్తున్నారు. సర్కారుకు ఎందుకింత హడావుడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడిగా ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తలపోయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది వెల్లడించాలని రైతు నాయకులతోపాటు గోదావరి జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తరుుతే బృహత్తర ప్రయోజనాలు సిద్ధిస్తారుు. అలాంటప్పుడు ఎత్తిపోతల పథకం నిర్మించి పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువకు అనుసంధానం చేయటం వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమని నీటి పారుదల, జల వనరుల, ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే ఉద్దేశం ఉన్నప్పుడు రూ.1,300 కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కోసం వినియోగించే నిధులు బూడిదలో పోసిన పన్నీరవుతాయని పేర్కొంటున్నారు. ఆ నిధులను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వినియోగిస్తే పనులు త్వరగా పూర్తవుతాయని, తద్వారా నవ్యాంధ్ర రాష్ట్రానికి మేలు కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.1,300 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం హడావుడిగా జారీ చేసిన జీవోఎంఎస్-1లో పేర్కొన్న వివరాలను బట్టి గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ పేరు చెప్పి నూతనంగా నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో పరిశ్రమలకు ఈ నీటిని తరలించే ఎత్తుగడ వేస్తున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఎత్తిపోతల ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా పులిచింతల దిగువ ప్రాంతానికి తరలించేందుకు నిర్ణయించారని చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి అధికారం కట్టబెట్టిన గోదావరి జిల్లాల ప్రజలను.. ముఖ్యంగా ఇక్కడి రైతులను నట్టేట ముంచి.. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గోదారి జిల్లాల గతేంటి ఉభయ గోదావరి జిల్లాల రైతులు ఇప్పటికే రెండో పంటకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. జూన్, జూలై నెలల్లో ధవళేశ్వరం బ్యారేజి వద్ద 8 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు రావడం లేదు. అలాంటప్పుడు ఎత్తిపోతల పథకం నిర్మించి ఇక్కడి నీటిని కొత్త రాజధానిలో పారిశ్రామిక అవసరాలకు తరలిస్తే గోదావరి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.