breaking news
gail victims
-
గెయిల్ బాధితులకు పరిహారం పంపిణీ
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైపులైను పేలిన సంఘటనలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం పంపిణీ చేశారు. హోంశాఖ మంత్రి చినరాజప్ప, గెయిల్ ప్రతినిధులు నష్టపరిహారం అందజేశారు. నగరం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని గెయిల్ ప్రతినిధులు చెప్పారు. నగరాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గెయిల్ దుర్ఘటనలో 21 మంది మరణించగా, మరికొందరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. -
చిరు, బొత్సలకు చేదు అనుభవం
-
చిరు, బొత్సలకు చేదు అనుభవం
కాకినాడ: కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు తూర్పుగోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు ఆదివారం చిరంజీవి, బొత్స నగరం వెళ్లారు. పేలుడు జరిగిన సంఘటనా స్థలాన్ని వీరిద్దరూ పరిశీలించారు. బాధితులను పరామర్శించే సమయంలో చిరంజీవి, బొత్సలను నగరం ప్రజలు అడ్డుకున్నారు. చిరంజీవి, బొత్సలకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. తమకు మీ పరామర్శలు అవసరం లేదంటూ నిరసన తెలిపారు. చిరంజీవి, బొత్స తదితరులు అక్కడ నుంచి వెనుదిరిగారు. -
ఎటు చూసినా బూడిద కుప్పలే
మరుభూమిలా మారిన నగరం సన్నిహితుల శవాలు, కాలిన ఇళ్లను చూసి విలపిస్తున్న గ్రామస్తులు అమలాపురం/ మామిడికుదురు/కాకినాడ క్రైం: ఎటు చూసినా పచ్చటి పొలాలు, గుబురు చెట్లు.. ఆకాశాన్నంటే కొబ్బరి తోటలు.. సెలయేర్లలో తామర, కలువ పూల హొయలు.. పాడి పశువులతో కళకళలాడే పశువుల కొట్టాలు.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతికి పట్టుగొమ్మలా ఉండే నగరం గ్రామం మొన్నటి చిత్రమిది. నేడు.. అదో రగులుతున్న చితి. ప్రకృతిని వికృతిగా మార్చిన నిర్లక్ష్యానికి బలైన గ్రామం. చైనా డ్రాగన్‌లా బుసలుకొడుతూ విరుచుకుపడిన అగ్నిగోళాలకు గ్రామం మొత్తం మాడి మసైపోయింది. తెలతెలవారుతుండగా పక్షుల కిలకిలలతో నిద్ర లేవాల్సిన ఆ ప్రాంతం హాహాకారాలతో మిన్నంటింది. లేగదూడల పరుగులు, పశువుల పదఘట్టనలకు లేచే దుమ్ముతో, కమ్మని మట్టి వాసనతో దినచర్య మొదలెట్టాల్సిన గ్రామం అగ్నిగోళాల మధ్య చిక్కుకుని విలవిల్లాడింది. పల్లె జనం దిక్కూతెన్నూ తెలియకుండా పరుగులెత్తారు. శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపు లైను సృష్టించిన విధ్వంసానికి గ్రామం గ్రామమే వల్లకాడులా మారింది. శనివారం ఆ గ్రామానికి వెళ్లిన వారికి అదో మరుభూమిలా కనిపించింది. ప్రకృతి సోయగం మాయమైంది. ఎటు చూసినా బూడిద కుప్పలే దర్శనమిచ్చాయి. కాలిపోయిన ఇళ్లు, మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. నిండు గెలలతో ఉండాల్సిన కొబ్బరి చెట్లు ఇప్పుడు మాడిపోయి నల్లగా మారిపోయాయి. మసిబొగ్గులా మారిన పశువులు, పక్షులు అక్కడక్కడా పడి ఉన్నాయి. అక్కడక్కడా నిప్పు రగులుతూనే ఉంది. పెను మంటల్లో కాలిపోయిన దేహాల వాసన ఇంకా వస్తూనే ఉంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న వారు ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. తమ వారి కోసం వెదుక్కుంటున్నారు. సన్నిహితులు, బంధువులు, తోటి గ్రామస్తులు మరణించిన విషయం తెలుసుకొని బోరుమంటున్నారు. కాలిపోయిన ఇళ్లు, విలువైన వస్తువులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బతుకులేమిటంటూ కుమిలిపోతున్నారు. ఈ విషాదం తమ జీవితాల్లో మరువలేనిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి మృతి గెయిల్ గ్యాస్ పైపులైను పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 18కి పెరిగింది. పేలుడు జరిగిన శుక్రవారంనాడే 16 మంది మృత్యు వాత పడగా, 27 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయుడు సూర్యనారాయణ (20), మహమ్మద్ తక్వి (42) శనివారం మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న కాశి చిన్నా, తాటికాయల రాజ్యలక్ష్మి, ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వానరాశి వెంకటరత్నం, బోణం రత్నకుమారి, బోణం పెద్దిరాజు, సాయిసుధ ఆస్పత్రిలో ఉన్న రుద్ర సూరిబాబుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన హైపవర్ కమిటీ గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి (హైపవర్) కమిటీ శనివారం నగరం గ్రామానికి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి (రిఫైనరీల విభాగం) ఆర్.పి.సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం పేలుడుకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసింది. పేలుడు సంభవించిన ప్రాంతంలో మట్టి, పైపుల నమూనాలను సేకరిస్తోంది. ఈ కమిటీలో చమురు సంస్థల భద్రత డెరైక్టరేట్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లకు చెందిన అధికారులున్నారు. జనావాసాల మధ్య నుంచి పైపులైన్ వెళ్లడంపై సింగ్ విస్మయం వ్యక్తంచేశారు. పేలుడుకు కారణాలను ఒకట్రెండు రోజుల్లో తేలుస్తామని ఆయన చెప్పారు. నష్టం అంచనాకు సర్వే బృందాలు పేలుడు వల్ల జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాకు ప్రభుత్వం సర్వే బృందాలను నియమించింది. ఈ బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన ఒక తహసీల్దారు, ఒక డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, హౌసింగ్, విద్యుత్, ఆరోగ్యం, ఇతర శాఖలకు చెందిన అధికారులతో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు 50 మందితో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
రూ.కోటి పరిహారం ఇవ్వాలి: నగరంలో వైఎస్ జగన్ డిమాండ్
ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే పాతిక లక్షల పరిహారం సరిపోదు, విదేశాల్లో ఇస్తున్నట్టు భారీగా ఇవ్వాలి.. ఆయిల్ కంపెనీలకు భయం పుట్టేలా పరిహారం ఉండాలి పరిహారంగా ఎకరా కొబ్బరి తోటకు రూ. 20 లక్షలు, ప్రతి ఇంటికీ రూ. 30 లక్షలు, క్షతగాత్రులకు నెలకు రూ. 20 వేల పింఛన్ ఇవ్వాలి బాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి కేజీ బేసిన్లో మన వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉండి పోరాడుతుంది సాక్షి, కాకినాడ: ‘‘ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విదేశాల్లో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు భయం పుట్టుకునేలా పరిహారం ఇప్పించాలి. ఒక్కసారి ఇతర దేశాలకు వెళ్లి చూడండి. అక్కడ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మరోసారి పునరావృతం కాకుండా చూసేందుకు ఆ కంపెనీలకు, యాజమాన్యాలకు భయం కల్పించేందుకు వాళ్లు ఇస్తున్న పరిహారం లెక్క చూడండి. నగరం దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఎంత మాత్రం సరిపోదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గెయిల్‌కు కాని, ఓఎన్జీసీకి కాని ఒంట్లో భయం పుట్టాలంటే కనీసం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మృతుల కుటుంబాలనే కాదు.. కాలిపోయి ఏ మాత్రం పనులు కూడా చేసుకోలేని వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా కళ్లు తెరచి, కేజీ బేసిన్లో మనకు రావాల్సిన వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో పైపులైన్ పేలుడు ప్రాంతాన్ని శనివారం పరిశీలించి, బాధితులను పరామర్శించిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇది ముమ్మాటికీ మానవ తప్పిదం. ఈ ప్రాంతంలో ఇది తొలిసారి జరిగింది కాదు. ఇక్కడి ప్రజలు దాదాపు సంవత్సరం నుంచి అడపాదడపా కంప్లయింట్ చేస్తూనే ఉన్నారు. గెయిల్ వాళ్లు అప్పటికప్పుడు వచ్చి కాస్త తవ్వి, కాస్త సిమెంట్ వేసి మరమ్మతు అయిపోయిందని వదిలేస్తున్నారు. గ్యాస్ ఒక మేఘంలా దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో కమ్ముకుని... ఒకరు వంట చేసుకునేందుకు పొయ్యి వెలిగిస్తే ఊరంతా బాంబులా పేలిందంటే... పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చెప్పనవసరం లేదు. గెయిల్, ఓఎన్జీసీ.. కంపెనీ ఏదైతేనేం ఇక్కడనుంచి వస్తున్న గ్యాస్ ద్వారా రూ.వేలకోట్లు సంపాదిస్తున్నాయి. కానీ స్థానిక ప్రజలకు, పరిసర ప్రాంతాలకు, పర్యావరణానికి ఏ రకంగా న్యాయం చేస్తున్నామనేది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆలోచన చేయాలి. గ్యాస్ వల్ల ఏ నష్టం జరిగినా మన రాష్ట్రానికే. ఆఫ్‌షోర్‌లో సముద్రం లోపల డ్రిల్లింగ్ చేస్తే కిలోమీటర్.. రెండున్నర కిలోమీటర్ల మేరకు డ్రిల్లింగ్ చేస్తారు. చేసినప్పుడు దాని సిస్మిక్ యాక్టివిటీ వల్ల నష్టం జరిగేది మన ప్రాంతానికే. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజమ్‌లో పొరపాట్లు జరిగితే ప్రాణాలు కోల్పోయేది.. నష్టం జరిగేది మన ప్రాంతానికే. కానీ ఆ గ్యాస్ వల్ల మనకెలాంటి లాభం లేకపోవడం బాధ కలిగిస్తుంది. ఆఫ్‌షోర్‌లో డ్రిల్లింగ్ జరిగితే కాస్తో కూస్తో ఏదో శనక్కాయలు వేసినట్టుగా రాయల్టీ ఇస్తారు. ఆన్‌షోర్ డ్రిల్లింగ్ జరిగితే అదీ రాదు. బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్‌లో కేంద్రానికి 50 శాతం, రాష్ట్రానికి 50 శాతం వాటా. రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత సింగరేణి కాలరీస్‌లో మనకు రావాల్సిన వాటా పూర్తిగా తీసేశారు. రాష్ట్రంలో గ్యాస్ పుష్కలంగా ఉందనుకుంటే... మన రాష్ర్టం అవసరాలకు మాత్రం ఒక్క రవ్వ కూడా గ్యాస్ ఇవ్వరు. నష్టాలు మనకు, లాభాలు పరాయి రాష్ట్రాలకు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళ్లుతెరవాలి. కేజీ బేసిన్లో కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన వాటా అడిగి తీసుకోవాలి. ఈ మేరకు డబ్బులు మనకు వస్తే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మీద మనకు కంట్రోల్ వస్తుంది. మన రాష్ర్ట అవసరాలను మనం తీర్చుకునే అవకాశం వస్తుంది. సరసమైన ధరలకు మనవాళ్లకు మనం గ్యాస్ ఇవ్వవచ్చు. ఈ ప్రాంతంలో ఏమైనా నష్టాలు జరిగితే మన వాటా ప్రకారం వచ్చిన వేలకోట్లలో కొంత ఇక్కడ ప్రజలకు.. ఇక్కడి అవసరాలకు.. ఇక్కడి పర్యావరణ పరిరక్షణకు, ఇక్కడ నష్టం జరగకుండా చూసుకునేందుకు ఖర్చు చేసుకోవచ్చు. నాకందిన సమాచారం మేరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో ఉన్నారు. వారికి ముష్టి వేసినట్టుగా కేవలం 25 లక్షలు రూపాయలు ఇచ్చి దులుపుకుంటున్నారు. ఇందులో గెయిల్, కేంద్రం 20 లక్షలు, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు, రాష్ర్ట ప్రభుత్వం 3 లక్షలు ముష్టిలా ఇస్తారట. శరీరం పూర్తిగా కాలిపోయి మున్ముందు ఎలాంటి పనులు చేసుకోలేని వారికి రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారట. ఇంతకన్నా దారుణం ఏముంది? మనిషి ప్రాణం విలువ 25 లక్షలేనా? గెయిల్, ఓఎన్జీసీ, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు కాస్త మానవతా దృక్పథంలో ఆలోచించాలి. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. తీవ్రంగా గాయపడిన వారికి ప్రతినెలా కనీసం రూ.20 వేలు పింఛన్ వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి. ఇక పంట పొలాలను ఒక్కసారి చూడండి. పచ్చని కొబ్బరిచెట్లు నిలువెల్లా మాడిపోయాయి. కాలిపోయిన కొబ్బరి చెట్లు పూర్తిగా తొలగించి కొత్త చెట్లు వేయాలి. వాటిని ఈ స్థాయికి వచ్చే వరకూ కాపాడుకోవాలి. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకునేందుకు ఎకరాకు కనీసం అంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్లకు కనీసం పదిహేను లక్షలు.. రెండు ఫ్లోర్లున్న వారికి కనీసంగా రూ.30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇళ్లు లేని వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఈ గ్యాస్ కలెక్షన్ పాయింట్లన్నీ ఊళ్లకు దూరంగా షిఫ్ట్ చేయాలి. మొత్తంగా కొత్త పైపులైన్ వేసి ఈ ప్రాంత ప్రజలకు భద్రత కల్పించాలి. బాధితులకు మా పార్టీ అండగా ఉంటుంది. మా ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పాటు గెయిల్, ఓఎన్జీసీ, పెట్రోలియం మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొస్తారు. అండగా ఉంటాం: జగన్ సాక్షి, కాకినాడ: ధైర్యంగా ఉండండి.. త్వరలోనే కోలుకుంటారు.. మీకు అండగా నేను ఉంటానంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నగరం గ్యాస్ ప్రమాద బాధితులకు ధైర్యం చెప్పారు. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మధురపూడి చేరుకున్న జగన్ నేరుగా మామిడికుదురు మండలం నగరం చేరుకొని ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును స్థానికులు, ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. దాదాపు రెండుగంటలపాటు గ్రామంలోనే ఉండి విస్ఫోటం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించి చలించిపోయారు. అనంతరం అమలాపురం చేరుకుని అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో, ఆ తర్వాత కాకినాడ చేరుకొని అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.